ప్రొ.నాగేశ్వర్ : కాంగ్రెస్‌ హయాంలో జరిగిన స్కాములన్నీ ఉత్తుత్తివేనా..?

మన దేశంలో రోజుకొక కుంభకోణం బయటకు వస్తూంటుంది. ప్రతిపక్షాలు విమర్శిస్తూంటాయి. కొన్ని సార్లు కేసులు నమోదవుతాయి. విచారణలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏ ఒక్క కేసు కూడా నిరూపితం కాదు. ఇదో విచిత్రమైన ప్రపంచం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పెద్ద స్కాం అని కాంగ్రెస్ .. ఆరోపిస్తోంది. మోడీ తన మిత్రుల కోసం వేల కోట్లు ప్రజాధనాన్ని దోచి పెట్టారని చెబుతోంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణాల విషయంలో మోడీకి శిక్ష విధిస్తుందా..?

యూపీఏ హయాంలోని స్కాములకు ఆధారాల్లేవు.. !

యూపీఎ హయాంలో వెలుగు చూసిన కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు. టూజీ, కామన్వెల్త్ దగ్గర్నుంచి అగస్టా వెస్ట్యాండ్ అనే హెలికాఫ్టర్ తయారీ సంస్థ కు ముడుపులిచ్చి అవినీతికిపాల్పడినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఇన్ని కుంభకోణాల్లో నరేంద్రమోడీ అధికారం చేపట్టిన తర్వాత ఒక్కరికైననా శిక్ష విధించారా..?. నరేంద్రమోడీ అధికారంలోకి రావడానకి టూజీ స్కాం ముఖ్యకారణం. ఈ స్కాంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం, ప్రచారం నరేంద్రమోడీకి ప్లస్ అయింది. యూపీఏ -2 హయాంలో జరిగిన కుంభకోణాల వల్లనే .. నరేంద్రమోడీ అధికారంలోకి రాగలిగారు. కానీ ఈ కేసులో ఏ ఒక్కరికి ఎందుకు శిక్ష వేయించలేకపోయారు. టూజీ కేసును దర్యాప్తు చేసిన న్యాయమూర్తి.. సీబీఐ ఒక్క సాక్ష్యాన్ని కూడా తీసుకొచ్చి తన ముందు ప్రొడ్యూస్ చేయలేదని ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండి..ఈ కుంభకోణాన్ని పట్టిచుకోలేదంటే.. మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఆ టూజీ స్కాంకు కాంగ్రెస్ ప్రభుత్వమే కర్త, కర్మ, క్రియ. మరి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాcలుగేళ్ల తర్వాత కూడా .. సీబీఐ, ఈడీ ఇలాంటి సంస్థలు.. సాక్ష్యాలు ఎందుకు తీసుకురాలేకపోయాయి. దీనికి ఎవరు బాధ్యులు..?

టూజీ కేసులో ప్రభుత్వంపైనే అనుమానాలు..!

ఇంకా ఈ కేసులో అనుమానించాల్సిందేమిటంటే.. ఈ టూజీ కేసులో అవినీతి జరిగి ఉంటే.. కేంద్రం అప్పీల్‌కు వెళ్లి ఉండాలి. కానీ అప్పీల్‌కు వెళ్లారో లేదో తెలియదు. ఈ టూజీ స్కాం మీద ప్రధానమంత్రి అసలు మాట్లాడనే మాట్లాడరు. రూ. 70 వేల కోట్ల కామన్వెల్త్ కుంభకోణం కూడా బయటపడింది. దీనికి కాంగ్రెస్ నేత సురేష్ కల్మాడీ అరెస్టయ్యారు. కానీ కేసు తేలిపోయింది. అలాగే బొగ్గు కుంభకోణం.. సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు.అప్పటి ప్రధాని మన్మోహన్ పై విమర్శలు వచ్చాయి కూడా. అవన్నీ ఎక్కడికిపోయాయి.

బోఫోర్స్ పై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు..!

ఇది ఒక్క మోడీనే కాదు… దాదాపుగా అందరూ ఇంతే వ్యవహరిస్తున్నారు. రాజీవ్ గాంధీ హయాంలో.. బోఫోర్స్ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ స్కాం కు జరిగిన ప్రచారంతో రాజీవ్ ప్రభుత్వమే పతనమయింది. ఇప్పటి వరకూ.. ఆ కేసు తేలలేదు. దశాబ్దాలు జరిగినా.. ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. కాంగ్రెస్ ఉంటే సహజంగానే పట్టించుకోరు. కానీ ఆరేళ్లు వాజ్‌పేయి ప్రభుత్వం, నాలుగేళ్లు మోడీ ప్రభుత్వం ఉంది. పదేళ్లకుపైగా బీజేపీ ప్రభుత్వాలు ఉన్న సమయంలో కూడా బోఫోర్స్ దొంగలను ఎందుకు పట్టుకోలేదు..? సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త.. రాబర్ట్ వాధ్రా డీఎల్ఎఫ్ సంస్థతో అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి. ఈ కుంభకోణంపై.. రోజూ బీజేపీ నేతలు మాట్లాడారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏ చర్య తీసుకోలేదు. ఆగస్టా వెస్ట్ ల్యాండ్‌ స్కాంలోనూ..ఫ్యామిలీ అనే ప్రస్తావన ఉంది. ఈ ఫ్యామిలీ సోనియా గాంధీదేనని బీజేపీ ఆరోపణ. ఈ అగస్టా స్కాంలో అవినీతి జరిగినట్లు విదేశీ కోర్టులు తేల్చాయి. అయినా భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఒక్క స్కాములోనూ బలమైన వాదనలు వినిపించలేదు..!

ఎయిర్ సెల్ – మ్యాక్సిస్ కుంభకోణంలో… నేరుగా చిదంబరం పాత్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఆర్థిక మంత్రికి విదేశీ పెట్టుబడుల విషయంలో నిర్ణయాలపై పరిమితి ఉంటుంది. అలాంటి నిర్ణయాలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ చూసుకుంటుంది. కానీ అక్కడి వరకూ వెళ్లకుండా చిదంబరమే.. ఎయిర్ సెల్ – మ్యాక్సిస్‌కు చాన్సిచ్చారు. కార్తీ చిదంబరంపైనా కేసు పెట్టారు కానీ… చిదంబరంపై పెట్టలేదు. ఎందుకు తాత్సారం చేస్తున్నారు. పీవీ ప్రధానిగా, మన్మోహన్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్టాక్ మార్కెట్ కుంభణం వల్ల లక్షల మంది…నష్టపోయారు. యూటీఐ కుంభణం … అలాగే… జూహూ బీచ్‌లో ఉన్నటువంటి హోటల్ అమ్మకం వ్యవహారం , టెలికాం వన్, టెలికాం టు కుంభకోణాలు చాలా బయటకు వచ్చాయి. వీటిలో ఎవరికీ ఎందుకు శిక్షలు పడవు.

జగన్మోహన్ రెడ్డికి ఎందుకు శిక్ష వేయించలేకపోయారు..?

ఇది కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి.. లక్ష కోట్లు దోచుకున్నారని టీడీపీ ప్రచారం చేసింది. తాము అధికారంలోకి రాగానే ప్రజలకు పంచుతామన్నారు. లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడిన జగన్‌కు ఇప్పటి వరకు ఏం శిక్ష పడింది..?. మరి కుంభకోణాలు జరగలేదా..? జరిగాయని ఇప్పిటకీ చెబుతారు. మరి ప్రభుత్వం అధికారం ఉంది కదా.. ఎందుకు చర్యలు తీసుకోరు. నాలుగేళ్ల పాటు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఒకటే ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి శిక్షలు వేయించలేదు. వైఎస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఫోక్స్ వ్యాగన్ కుంభకోణం వచ్చింది. మద్యం స్కాం జరిగింది. ఎవరికీ శిక్షలు పడలేదు,.

రాజకీయాల కోసమే అవినీతి ఆరోపణలా..?

ఇలా రాష్ట్ర స్థాయిలో… జాతీయ స్థాయిలో అనే స్కాంలు వెలుగు చూశాయి. తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీలు వీటిని పట్టించుకోవు. వాటిని రాజకీయ ఆరోపణలకు ఉపయోగించుకంటాయి. ఎవరికీ శిక్ష పడనప్పుడు.. వీటిని ఎందుకు ప్రచారం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ విధమై అవగాహన ఏర్పడుతుంది. రూ. 5వందలు లంచాలు తీసుకున్న వారు..ఏసీబీకి పట్టుబడి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కానీ వేల కోట్లు దోచుకుటున్న వారి మాత్రం దర్జాగా తిరుగుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com