ప్రొ.నాగేశ్వర్ : నిరుద్యోగభృతి చంద్రబాబుకు ఓట్లు రాలుస్తుందా….?

నిరుద్యోగభృతి అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశం. ఆమాటకొస్తే.. జాబు రావాలంటే బాబు రావాలని.. ప్రచారం చేశారు. అందువల్ల జాబ్ రావడం ముఖ్యం కానీ భృతి ఇవ్వడం కాదు ముఖ్యం. అయినా మ్యానిఫెస్టోలో పెట్టారు కాబట్టి..రూ. వెయ్యి భృతి ఇస్తామంటున్నారు. అలాగే శిక్షణ ఇచ్చి.. జాబ్ కూడా ఇప్పిస్తారు.

ఎంత మంది నిరుద్యోగులకు ఇవ్వగలుగుతారు..?

మన దేశంలో నిరుద్యోగుల్ని గుర్తించడం అంత తేలిక కాదు. ఇప్పుడు ఏవో కొన్ని రూల్స్ పెట్టుకుంటామంటున్నారు. ఎందుకంటే.. మన దేశంలో ఉంది.. అన్ ఎంప్లాంట్‌మెంట్ కాదు.. అండర్ ఎంప్లాయ్‌మెంట్. ఖాళీగా ఇంట్లో కూర్చునేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా మందికి అర్థం కాని విషయం ఏమిటంటే.. భారదేశంలో అండర్ ఎంప్లాయ్‌మెంట్ ఉంది. యువత ఏదో ఓ పని చేసుకుంటూనే ఉంది. కానీ ఆ పని సంతృప్తికరంగా లేదనే … వాదన వినిపిస్తూ ఉంటారు. ఆ ఉద్యోగం… బతకడానికి సరిపోని విధంగా ఉంటే… నిరుద్యోగి కిందే భావిస్తారు. ఇప్పుడు పీఎఫ్ ఎకౌంట్ లేకపోతే.. డిగ్రీ చదువుకుని ఉంటే… నిరుద్యోగిగా గుర్తిస్తారు. చాలా కంపెనీల్లోనే కాదు.. ప్రభుత్వ దగ్గర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌గా ఉన్న వారికి కూడా పీఎఫ్ అకౌంట్లు లేవు. దాన్నే తీసుకుంటే.. ఎంత మందికి ఇవ్వగలుగుతారనేది ప్రశ్న.

భృతి కన్నా ఉపాధి చూపించడమే ముఖ్యం..!

ఇప్పటికే నాలుగేళ్లయిపోయింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇస్తామంటున్నారు. ఎన్నికల తర్వాత ఈ స్కీమ్ ఉంటుందా అన్నది ఓ ప్రశ్న. అసలు ఎంత మందికి ఇవ్వగలుగుతారనేది మరో ప్రశ్న. నిరుద్యోగులందరికీ భృతి ఇచ్చే సామర్ధ్యం ప్రభుత్వానికి ఉందా అనే మరో సందేహం. మన దేశంలో ఎంప్లాయ్‌మెంట్ పొటెన్షియల్ చాలా బాగా ఉంది. కొన్ని కొన్ని దేశాల్లో నిరుద్యోగభృతి చాలా సులువుగా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే.. అక్కడ ఉపాధి సులువుగా దొరుకుతుంది. కానీ మన దగ్గర విద్యావంతులైన నిరుద్యోగులు.. ఎక్కుగా పెరిగిపోతున్నారు. వారికి నైపుణ్యాలు పెంచడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ అనే మాటలను చాలా రోజులుగా వింటున్నాం. ఆ స్కిల్స్ ఏంటి..? ఏ రంగంలో ఉపయోగకరం..? తయారీ రంగంలో ఎంత మందికి ఈ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తారు..? అన్నవి చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్నలు.

పారిశ్రామికీకరణ కోసం ప్రయత్నించాలి..!

ఇప్పుడు సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం తెచ్చుకోవాలంటే.. ఆ రంగంలో స్కిల్స్ పెంచుకోవాలి. ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీల్లో చాలా మటుకు విద్యార్థులు లేకుండా ఉంటున్నాయి. ఇంజినీరింగ్ చదవుకుంటే ఉద్యోగాలు రావడం లేదంటున్నారు. మౌలికమైన సమస్యలకు పరిష్కారం వెదకడం లేదు. నిరుద్యోగ భృతి తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ పరిష్కారం కాదు అది. పరిష్కారం ఏమిటంటే… ఉపాధి అవకాశాలు పెరిగేటటువంటి ఓ ఆర్థిక విధానాన్ని ఏర్పరచాలి. ఏపీలో పారిశ్రామికంగా ఎదుగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతం ఎక్కువగా ఉంది. తయారీ పరిశ్రమ పెరగడానికి ఎక్కువ ఉంది. వీటిపై దృష్టి పెట్టాలి.

ఇలాంటి పథకాల వల్ల ఓట్లు రావు..!

ఎన్నికలకు ముందు పెట్టే ఇటువంటి పథకాల వల్ల ప్రజలు ఓట్లు వేస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే.. అందరికీ ఇవ్వలేరు. నిరు‌ద్యోగ భృతి రాలేదనుకున్న వారందరూ.. అసంతృప్తికి గురవుతారు. వచ్చిన వారు కూడా.. వెయ్యే ఇస్తున్నారని అసంతృప్తికి గురవుతారు. అందుకే.. వారికి నిరుద్యోగభృతి ఇవ్వడం కాకుండా.. అందరికీ ఉపాధి అవకాశాలు చూపించాలి. ప్రజలు కూడా అమాయులు కాదు.. చివరి క్షణాల్లో పెట్టే ఇటువంటి స్కీముల గురించి వారికి బాగా తెలుసు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.