నంద్యాలలో శాంతికి ఎసరు!కుట్రల పాట!

నేను చాలాసార్లు సరదాగా అంటుంటాను – ప్రతిపక్ష నేత జగన్‌కు టిడిపి నేతలను మించిన ప్రచారకులు అక్కర్లేదని. నంద్యాల ఉప ఎన్నిక ఆ ప్రహసనాన్నిమరోసారి పరాకాష్టకు చేర్చింది. తుపాకితో కాల్చి చంపినా పర్వాలేదని ఆయన అన్నమాటను అందరం ఖండించాం. ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. తుది నిర్ణయం తీసుకుంటుంది. కాని దాన్నే ఏకైక అస్త్రంగా భావించిన అధికార పక్ష నేతలు ఈ ఒక్క రోజున బుడ్దా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, వర్ల రామయ్య, దేవినేని ఉమ, కెఇ కృష్ణమూర్తి ఇంకా కొంతమంది రకరకాల మాటలతో దాడి చేసి జగన్‌ పేరిట శీర్షికలు రావడానికి కారకులైనారు. ఈ క్రమంలో తామే అధికారంలో వున్నామన్న నిజం కూడా మర్చిపోయి జగన్‌ అనుకున్నట్టే చేయగలరన్న భావం కలిగిస్తున్నారు. గురువారం ఒక చర్చలో మాతో పాల్గొన్న టిడిపి ప్రతినిధి డా.రేణుక నంద్యాలలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. .దేవినేని ఉమ జగన్‌ను నంద్యాల నుంచే బహిష్కరించాలన్నారు. వర్ల రామయ్య జగన్‌తో పాటు సలహాదారు ప్రశాంత కిశోర్‌ను చేర్చి తమ ప్రభుత్వాన్నే కూల్చడానికి కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించారు. ఆయనకూ క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వుందని కూడా ఆరోపించారు.ఇదే రీతిలో విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధ కూడా ప్రశాంత కిశోర్‌ కుట్రలు బయిటపెడతామని ప్రకటించారు. ఇక కెఇ కృష్ణమూర్తి ఇందుకు పూర్తి భిన్నంగా పికె జగన్‌ను తట్టుకోలేకే ఢిల్లీ వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్‌ను మెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించాలని సలహా ఇచ్చారు. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి జగన్‌ హద్దుమీరి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. జగన్‌ వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతున్నట్టు మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. ఇక కాంగ్రెస్‌ నాయకుడు కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఈ రెండు పార్టీల ఘర్షణ వల్ల శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుందనే సందేహం వెలిబుచ్చారు.జగన్‌ తప్పొప్పులు ఏమైనా సరే ఇంతమంది మంత్రులు ముఖ్య నాయకులు వరసకట్టి దాడి చేయడం ద్వారా ఆకర్షణ పెంచడం లేదా? టిడిపికే తెలియాలి. విజయవాడ యువనాయకుడు దేవినేని అవినాశ్‌, కడియాల బుచ్చిబాబు అయితే జగన్‌ వల్ల చంద్రబాబు ప్రాణానికి ముప్పు వుందని డిజిపికి అధికారికంగా ఫిర్యాదు చేయడం దీనికి కొసమెరుపు. మొత్తంపైన నంద్యాలలో అందరూ కలసి శాంతికి ఎసరు పెట్టడం బాగుందా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com