ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయలేము: బోర్డు చైర్మెన్

విభజన హామీలలో ఒక్కొక్క హామీనీ కేంద్రప్రభుత్వం పక్కన పెడుతోంది. మొదట ప్రత్యేక హోదా హామీని గట్టున పెట్టిన కేంద్రం తరువాత విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును పక్కన పెట్టింది. ఇప్పుడు విశాఖలో రైల్వే జోన్ న్ని కూడా పక్కనపెడుతున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మెన్ ఎకె.మిట్టల్ స్పష్టం చేసారు. అందుకు ఆయన చెప్పిన కారణం చాలా విస్మయం కలిగిస్తోంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్లయితే భువనేశ్వర్ రైల్వే జోన్ తీవ్రంగా నష్టపోతుందని కనుక ఓడిశా ప్రభుత్వం నుండి తమపై తీవ్ర ఒత్తిడి వస్తోందని ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుకి నిన్న తెలియజేసారు. సాంకేతికపరంగా చూసినా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కష్టమని తెలిపారు. అయినా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రతీ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పారు.

అయితే ఈ అంశాలేవీ పరిగణనలోకి తీసుకోకుండానే యూ.పి.ఏ.ప్రభుత్వం ఈ హామీని విభజన చట్టంలో చేర్చిందనుకోవాలా? ఒకవేళ యూ.పి.ఏ.ప్రభుత్వం తెలియకపోతే దానికి మద్దతు ఇచ్చిన బీజేపీకి కూడా తెలియదా? రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొన్ని నెలల క్రితం విశాఖ వచ్చినప్పుడు త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు గురించి ఒక శుభవార్త చెపుతామని అన్నారు. కానీ ఇప్పుడు ఓడిశా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని, భువనేశ్వర్ రైల్వే జోన్ కి నష్టం వస్తుందని విశాఖకి రైల్వే జోన్ ఇవ్వలేమని రైల్వే బోర్డు ఛైర్మెన్ చేత చెప్పిస్తున్నారు. అంటే ప్రత్యేక హోదాపై ప్రజలను మభ్యపెట్టినట్లే దీనిపై కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టినట్లు అర్ధం అవుతోంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలు అభ్యంతరాలు చెపుతున్నాయనే సాకుతో దానిని కేంద్రం పక్కన పెట్టేసింది. ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటుకి కూడా అదే కారణంతో పక్కన పెట్టేయలనుకోవడం చాలా అన్యాయం. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చలేదు కనుక ఆ హామీని నెరవేర్చలేకపోతున్నామని కేంద్రం నేర్పుగా తప్పించుకొంది. కానీ విభజన చట్టంలో పేర్కొనబడిన ఈ హామీని ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రజలు ప్రశ్నించక మానరు.

ఓడిశా ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయడానికి అభ్యంతరం చెప్పింది కనుక దానిని పక్కన పెట్టేశారు. రైల్వే జోన్ ఏర్పాటుకి అభ్యంతరం చెపుతోంది కనుక దానిని కూడా పక్కన పెట్టేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ఓడిశా ప్రభుత్వం అభ్యంతరం చెపుతోంది. బహుశః ఏదో ఒకనాడు దానిని కూడా పక్కన పెట్టేయవచ్చును.

ఓడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తనకు కావలసినవన్నీ సాధించుకోగలుగుతోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా, తెదేపా, బీజేపీలు మిత్ర పక్ష పార్టీలుగా కొనసాగుతున్నప్పటికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయించలేకపోతోంది. బీజేపీతో తన సంబంధాలను నిలుపుకోవడానికే తెదేపా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు లేదు. కేంద్రం చేస్తున్న ఈ మోసాన్ని ప్రశ్నించకుండా కేంద్రం ఆడించినట్లు ఆడుతూ అది కూడా కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోంది. తెదేపా, బీజేపీలు రెండూ ఇదేవిధంగా ప్రజలను మోసం చేసినట్లయితే వచ్చే ఎన్నికలలో దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అవి గుర్తుంచుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com