చంద్రబాబు, జస్టిస్‌ రమణ ఒకే మాటా? జస్టిస్‌ చలమేశ్వర్‌

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుప్రీకోర్టు న్యాయమూర్తి ఎంవిరమణల సాన్నిహిత్యం గురించి రాజకీయ వర్గాల్లోనూ న్యాయవర్గాల్లోనూ నిరంతరం ప్రస్తావన రావడం మామూలే. కాని ప్రస్తుత సుప్రీం కోర్టులోనే అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా వున్న జాస్తి చలమేశ్వర్‌ అధికారికంగా దాన్ని ఒక లేఖలో ప్రస్తావించడం, ఆ కారణంగా గత న్యాయమూర్తి ఖేహర్‌ రమణ అభ్యంతరాలను తోసిపుచ్చి ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను సిఫార్సు చేయడం . ఇప్పుడుబయిటకు వచ్చింది. ప్రముఖ పత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఇందుకు సంబంధించిన ఉత్తరాలను బయిటపెట్టింది. దానిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవలసి వుంది.ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురి పేర్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి భోసలే 2016 ఏప్రిల్‌ లో ప్రతిపాదించారు. దానిపై సుప్రీం కోర్టు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు అడిగింది. కెసిఆర్‌ అప్పుడే రాసేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం 2017 మార్చి 21న రాశారు. ఆరుగురిలో అయిదుగురు ఇతర న్యాయమూర్తుల బంధువులు లేదా జూనియర్లు గనక వద్దని అభ్యంతరం చెప్పారు. తర్వాత మూడు రోజులకు 2017 మార్చి 24న జస్టిస్‌ రమణ కూడా దాదాపు అదే భాషలో వారి పేర్లకే అభ్యంతరం తెలిపారు. రమణ చంద్రబాబు మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలుసుననీ ఈ ఇద్దరూ ఒకే సమయంలో ఒకే విధంగా రాయడం ప్రభుత్వాధినేతకూ న్యాయవ్యవస్థల మధ్య అవాంఛనీయ అనుబంధానికి నిదర్శనమని చలమేశ్వర్‌ అప్పట్లో రాసిన లేఖలో విమర్శించారని ఆ పత్రిక రాసింది. దీనిపై జస్టిస్‌ రమణను పత్రిక వివరణ కోరగా తన అభిప్రాయాలు తాను రాశానని , ఎపి ముఖ్యమంత్రి ఏం రాశారో తెలియదని బదులిచ్చారట. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం అసలు స్పందించలేదు. మొత్తంపైన ఈ కథనం న్యాయ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. గతంలోనూ కొలీజియం విధానాన్ని తప్పు పడుతూ చలమేశ్వర్‌ రాసిన లేఖ లీక్‌ అయిన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.