చ‌ర‌ణ్ నిర్మాత‌… వ‌రుణ్‌తేజ్ హీరో

కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో రామ్ చ‌ర‌ణ్ ఓ నిర్మాణ సంస్థ‌ని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఖైది నెం.150తో ఈ సంస్థ త‌న ప్రయాణానికి శ్రీ‌కారం చుట్టింది. చిరు సినిమాతో చ‌ర‌ణ్‌కి భ‌లే లాభాలొచ్చాయి. తొలి వెంచ‌ర్ ని భారీ లాభాల‌తో పూర్తి చేసిన చ‌ర‌ణ్‌.. చిరు 151వ సినిమాపై దృష్టి పెట్టాడు. అంతేకాదు.. ఇప్పుడు మిగిలిన మెగా హీరోల‌తోనూ సినిమాలు చేయడానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. అందులో భాగంగా వ‌రుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట చ‌ర‌ణ్‌. ఈ విష‌యాన్ని వ‌రుణ్ కూడా ధృవీక‌రించాడు. ”కొణిదెల సంస్థ‌లో ఓ సినిమా చేస్తున్నా. చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఉంటాడు. అయితే ఎప్పుడు? ఎవ‌రితో అనేది ఇంకా తెలీదు” అంటున్నాడు వ‌రుణ్‌.

నాగ‌బాబుకి ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంది. అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో నాగ‌బాబు సినిమాలు తీసేవాడు. ఆరెంజ్ దెబ్బ‌కి ఆయ‌న మ‌రో సినిమా తీసే ధైర్యం చేయ‌లేదు. వ‌రుణ్ హీరోగా మారి, కాస్త క్రేజ్ సంపాదించుకోవ‌డంతో మ‌ళ్లీ నాగబాబుకి నిర్మాణంపై దృష్టి మ‌ళ్లింది. వ‌రుణ్‌తేజ్ కూడా ”మేమంతా ఉన్నాం క‌దా, డాడీ నువ్వు సినిమాలు తీయ్‌” అంటూ ప్రోత్స‌హిస్తున్నాడ‌ట‌. నాగ‌బాబు త‌దుప‌రి సినిమా వ‌రుణ్‌తేజ్‌తోనే అనుకొన్నారు. అయితే.. అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఇప్పుడు బ‌య‌టి హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి నాగ‌బాబు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. బ‌య‌టి హీరోలంటే.. మ‌రీ ఆ కాంపౌండ్ దాటి బ‌య‌ట‌కు పోరు. మెగా ఫ్యామిలీతో ట‌చ్‌లో ఉన్న హీరోల‌తో సినిమాలు చేస్తార‌న్న‌మాట‌. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com