మ‌రిన్ని ఆధారాల సేక‌ర‌ణ ప‌నిలో రేవంత్‌..!

మియాపూర్ భూ కుంభకోణం వెలుగులోకి వ‌చ్చాక తెర వెన‌క చాలా మార్పులు జ‌రుగుతున్నాయంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి, ఇది తాము బ‌య‌ట‌కి తీసిన కుంభ‌కోణ‌మే అని అధికార పార్టీ ఘ‌నంగా చెప్పుకుంటూ ఉన్నా… విమ‌ర్శ‌లు విష‌యంలో విప‌క్షాలు త‌గ్గ‌డం లేదు. కేవ‌లం చిన్న చేప‌ల్ని మాత్ర‌మే బ‌య‌ట ప్ర‌పంచానికి చూపి, పెద్ద తిమింగ‌లాల‌కు అండ‌గా నిలుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ కుంభకోణానికి సంబంధించి కొన్ని వివ‌రాల‌ను రేవంత్ రెడ్డి మొద‌ట్లోనే బ‌య‌ట‌ప‌ట్టారు. అయితే, దానిపై మీడియాలో కూడా పెద్ద‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. ఇక‌, అధికార పార్టీ కూడా రేవంత్ ఆరోప‌ణ‌ల్నీ, వెల్ల‌డించిన వివ‌రాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే, ఈ అంశాన్ని ఇక్క‌డితో వ‌దిలేట్టుగా రేవంత్ లేర‌ని తెలుస్తోంది. మ‌రిన్ని ఆధారాల కోసం ఆయ‌న అన్వేష‌ణ కొన‌సాగిస్తున్న‌ట్టు స‌మాచారం.

రేవంత్ వెల్ల‌డించిన వివ‌రాల్లో… కుంభకోణం సూత్ర‌ధారి అయిన వ్య‌క్తి ట్రినిటీ ఇన్ఫ్రా వెంచ‌ర్స్ పేరు మీద ఉన్న ఒక బెంజ్ కారులో తిరుగుతుంటార‌నీ, ఆ కారు ప్ర‌తీ రోజూ ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి వెళ్తుంద‌నీ, ఆ వివ‌రాలు కావాలంటే ప్ర‌గ‌తీ భ‌వ‌న్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను బ‌య‌ట పెట్టాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై తెరాస స‌ర్కారు స్పందించ‌లేదుగానీ… రేవంత్ బ‌య‌ట‌పెట్టిన ఫోన్ నంబ‌ర్ న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక మేనేజింగ్ డైరెక్ట‌ర్ దే అంటూ ఓ మీడియాలో తాజాగా క‌థ‌నం రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ భారీ కుంభ‌కోణంలో కేసీఆర్ స‌న్నిహితులూ, ఆప్తుల‌కు సంబంధం ఉందంటూ స‌ద‌రు క‌థ‌నంలో ప‌రోక్షంగా పేర్కొన‌డం విశేషం. నిజానికి, రేవంత్ రెడ్డి ల‌క్ష్యం కూడా ఇదే. మియాపూర్ భూ కుంభ‌కోణంతో సంబంధం ఉన్న కేసీఆర్ స‌న్నిహితుల్ని వెలుగులోకి తేవాల‌న్న‌దే ఆయ‌న ప‌ట్టుద‌ల‌గా ఉంది.

మ‌రో విశేషం ఏంటంటే… రేవంత్ రెడ్డి ఈ వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టిన నాటి నుంచీ ప్ర‌గతీ భ‌వ‌న్ కు స‌ద‌రు బెంజ్ రావ‌డం లేద‌ట‌! దీంతో ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్టుగా భావించాలి. రేవంత్ ఆరోప‌ణ‌ల్ని ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆశించిన స్థాయిలో దీనిపై చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. అయితే, ప్ర‌స్తుతం ఈ కుంభ కోణానికి సంబంధించి మ‌రిన్ని ఆధారాల‌ను సేక‌రించే ప‌నిలో రేవంత్ ఉన్నార‌నీ, మ‌రికొద్ది రోజుల్లో స్ప‌ష్ట‌మైన ఆధారాల‌తో రేవంత్ ప్ర‌జ‌ల‌కు ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ రేవంత్ కి కొత్త ఆధారాలు ఏవైనా ల‌భిస్తే ఈసారి తెరాస స్పందించాల్సిన ప‌రిస్థితి క్రియేట్ అవుతుంది. ఇత‌ర ప్ర‌తిప‌క్షాలు కూడా రేవంత్ వెంట నిలిచే అవ‌కాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.