సాక్షిలో ప్ర‌ధాన వార్త‌ల ప్రాధాన్య‌త క్ర‌మం ఇదేనా..?

ప్రింట్ మీడియాలో మొద‌టి పేజీ వార్త‌కి చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. దేశం లేదా రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకున్న ప్ర‌ధాన ఘ‌ట‌న‌ల‌కు, రాజ‌కీయ ప‌రిణామాల‌కు ఫ‌స్ట్ పేజీలో ప్రాధాన్య‌త ల‌భిస్తుంది. ఈ రోజు సాక్షి ఆంధ్రా మెయిన్ పేప‌ర్లో రెండు వార్త‌ల్ని ప్ర‌ధానంగా చూపించారు. మొద‌టిది… ‘ఏపీలో ఆరాచ‌క పాల‌న’ అంటూ సుప్రీం కోర్టు రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ గోపాలగౌడ చేసిన విమ‌ర్శ‌ల్ని పతాక వార్త చేసేశారు. మ‌రోటి.. ‘మ‌రో అడుగు దిగ‌జారి..’ అంటూ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి వైకాపాను వీడుతున్న వైనం గురించి రాశారు. ఈ రెంటినే బ్యానర్ చేసేందుకు సాక్షి ప్రాధాన్య‌తా క్ర‌మంలో చూసుకుంటే… తెలుగుదేశం పాల‌న‌పై రిటైర్డ్ జ‌డ్జ్ చాలా విమ‌ర్శ‌లు చేశారు కాబ‌ట్టి, ఆ వార్త బ్యాన‌ర్ అయిపోయింది. ఇక‌, రెండోది.. పాడేరు ఎమ్మెల్యే పార్టీ వీడ‌టానికి కార‌ణం తెలుగుదేశం ప్ర‌లోభాలే అన్న‌ట్టు ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు కాబ‌ట్టి, ఇది కూడా బ్యాన‌ర్ క‌థ‌న‌మే!

తాను అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించాన‌నీ, ఎక్క‌డ చూసినా పోలీసులే క‌నిపిస్తున్నార‌నీ, ఆంధ్రప్ర‌దేశ్ లో ప్ర‌జాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం క‌లుగుతోంద‌ని గోపాల గౌడ విమ‌ర్శించారు. ఏపీలో రాజ‌ధాని ఎంపిక రాజ్యాంగబ‌ద్ధంగా జ‌ర‌గలేద‌ని, రాష్ట్రం ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించి అమ‌రావ‌తి నిర్మిస్తోంద‌నీ, ఏడాదికి మూడు పంట‌లు పండే భూముల్లో రాజ‌ధాని నిర్మాణం ఏంటంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ లో ఉండే అవ‌కాశం ఉన్నా, తొంద‌రప‌డుతూ అమ‌రావ‌తికి వ‌చ్చేయాల్సిన అవ‌స‌రం ఏముందంటూ గౌడ ప్ర‌శ్నించారు. రాజ‌ధాని ప్రాంత రైతుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగిపోయింద‌నీ, బ‌ల‌వంతంగా భూములు లాక్కున్నార‌ని ఆరోపించారు. సింగ‌పూర్ కి చెందిన కౌన్ కిస్కా కంపెనీకి రాజ‌ధాని నిర్మాణం అప్ప‌గించ‌డం ఏంటంటూ మండిప‌డ్డారు. ఆ మీడియాలో బ్యాన‌ర్ వార్త‌ల్లో నిల‌వాలంటే ఈమాత్రం విమ‌ర్శ‌లు చాలు క‌దా! అవే ప్రాథ‌మ్యాలు పాటించిన‌ట్టున్నారు. చంద్ర‌బాబు నాయుడు స‌ర్కారును ఎవ‌రైనా ఎడాపెడా విమ‌ర్శ‌లు చేస్తే చాలు… ఫ‌స్ట్ పేజీకి వ‌చ్చేస్తుంది, అంతే!

ఇక‌, వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి క‌థ‌నం విష‌యానికొస్తే.. రాజ్యాంగ దినోత్స‌వం రోజునే ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయిపోయింద‌ని వాపోతూ క‌థ‌నం రాశారు. ఇదంతా టీడీపీ కుట్ర అనీ, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాస్పంద‌న చూసి ఓర్వ‌లేక‌పోతున్నార‌నీ, గిడ్డి ఈశ్వ‌ని పార్టీ వీడుతున్న వైనాన్ని చూసి ప్ర‌జాస్వామ్యవాదులు విస్తుపోతున్నార‌ని రాశారు. అసెంబ్లీకి వైకాపా ఎమ్మెల్యేలు హాజ‌రు కాక‌పోవ‌డాన్ని కూడా మ‌రోసారి స‌మ‌ర్థించుకున్నారు. అయితే, గిడ్డి ఈశ్వ‌ని పార్టీ మార్పున‌కు అస‌లు కార‌ణాలు వేరే అంటూ ఇత‌ర మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది క‌దా! అవ‌న్నీ అవాస్త‌వాలు అని ఖండించే ప్ర‌య‌త్రం ఎక్క‌డా చెయ్య‌లేదు. పాడేరు, అరుకు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల నుంచి వేరే నేత‌ల‌కు టిక్కెట్లు ఇచ్చేందుకు వైకాపా వ్యూహర‌చ‌న చేస్తోంద‌నీ, దాన్లో భాగంగా మూడేళ్లుగా పార్టీని నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్న గిడ్డి ఈశ్వ‌రిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశార‌నే క‌థ‌న‌మూ ప్ర‌చారంలో ఉంది. స్వ‌యంగా గిడ్డి ఈశ్వ‌రే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ ను న‌మ్ముకుంటే మోసం చేశార‌ని ఆమే బ‌హిరంగంగా చెప్పారు. ఇది నిజ‌మా కాదా అనే వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం కథనంలో ఎక్క‌డా లేదు.

గిడ్డి ఈశ్వ‌రి పార్టీ వీడాల‌నే నిర్ణ‌యం ఆమె వ్య‌క్తిగ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో, స్థానిక రాజ‌కీయ ప‌రిణామాల ఫ‌లితంగా తీసుకున్న‌ద‌నే విష‌యం తెలుస్తూనే ఉంది. దీన్ని కూడా ఇత‌రుల ప్ర‌లోభ‌మ‌నీ, ప్ర‌జాస్వామ్యం ఖూనీ అంటూ వేరే కోణాన్ని ఆపాదించే ప్ర‌య‌త్నం చేశారు. పాడేరు, అరుకులోయ అసెంబ్లీ స్థానాల విష‌యంలో వైకాపా ఇటీవ‌ల అనుస‌రించిన వైఖ‌రేంటీ..? స్థానిక ఎమ్మెల్యే ఈశ్వ‌రి ప్ర‌మేయం లేకుండా అక్క‌డ వైకాపా నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌రిగిందేంట‌ని చెప్పే ప్ర‌య‌త్నం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. త‌మ‌కు అనుకూల‌మైన కోణం ఎంచుకోవ‌డం, పార్టీకి అవ‌స‌ర‌మైన మాట‌లు ఎవ‌రు మాట్లాడినా ఒడిసిప‌ట్ట‌డం.. ఆ ప‌త్రిక‌లో ప్ర‌ధాన వార్త‌ల‌కు అర్హ‌త‌లు ఇవే. ఇలాంటప్పుడు విలువలతో కూడిన జ‌ర్న‌లిజం మాదే, బ్లా బ్లా బ్లా వంటి అంశాల‌పై నో కామెంట్స్‌..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.