సెటైర్ : అవును, చిరుత నిర్దోషి

అది న్యాయస్థానం. అక్కడ బిళ్ల బంట్రోతు బిగ్గరగా పిలుస్తున్నాడు.

`చారల చిరుత పులి… ఒకటోసారి,
చారల చిరుతపులి…రెండోసారి…
చార…’ మూడోసారి పిలపించుకోకుండానే ప్రధాన ద్వారం నుంచి శరీరాన్ని అటూఇటూ ఊపుకుంటూ నెమ్మదిగా కోర్టు హాలులోకి గంభీరంగా ప్రవేశించింది చిరుత.

అంతే, అంతటా నిశ్శబ్దం. అడవిలో ఉండాల్సిన చిరుత ఇలా జనారాణ్యంలోకి రావడమేమిటీ!? అందునా నేరుగా న్యాయస్థానం గడపతొక్కడమేమిటీ…!!! అందరిలోనూ బోలెడంత ఆశ్చర్యం.

ఇంతలో చిరుత బోనులోకి వచ్చేసింది. ఓసారి అటూ ఇటూ కలయజూసింది. న్యాయమూర్తులవారివైపు ఆశగా చూసింది. అందరికీ నమస్కారమన్నట్టుగా ఒక్కసారి మెల్లగా గ్రాండించింది.

ఆ చిన్ని గ్రాండింపుకే కిక్కిరిసిఉన్న కోర్టు హాలు ఉలిక్కిపడింది.

`ఎంతైనా అది చిరుత. వన్యప్రాణి. దాన్ని ఇలా తీసుకురావడమేమిటండీ, ఇదేం బాగోలేదు’ గజగజా వణకుతూ ఓ పెద్దాయన పక్కనున్నాయన చెవికొరికాడు. అలా అంతా గుసగుసలాడుకుంటున్నారు. భయంతో గజగజలాడిపోతున్నారు.

అంతలో న్యాయమూర్తి `ఆడర్, ఆడర్..’ అంటూ చెక్కసుత్తిని బల్లమీద కొట్టారు. ఆ శబ్దానికి గుసగుసలు ఆగిపోయాయి.

న్యాయమూర్తి చిరుతవైపు చూస్తూ…

`ఏమిటి, ఈ ముద్దాయిమీద మోపబడిన అభియోగం’ అడిగారు.

`ఇది ఉంది చూశారూ..’ వాదన మొదలుపెట్టాడు లాయర్.

వెంటనే అడ్డుతగిలింది చిరుత –

`ఇది…అది అంటావేంటీ ? నువ్వేదో బొడ్డుకోసి పేరుపెట్టినట్లు. మర్యాద..మర్యాద’ అంటూ హెచ్చరిక స్వరంతో గాండ్రించింది.

న్యాయవాది సర్దుకుంటూ –

`సారీ, సారీ… (న్యాయమూర్తివైపు తిరిగి), ఈ చారల చిరుతపులి..జనారణ్యంలోకి చొచ్చుకొచ్చినట్లు దానిపై అభియోగం మోపబడింది మిలార్డ్…’ అంటూ ఇంకా ఏదో చెప్పుకుపోతుంటే చిరుత-

`ఏడ్చినట్లుంది నీ అభియోగం. ఎవరు చెప్పారు నేను జనారణ్యంలోకి చొచ్చుకువచ్చానని ?’ అగ్నిగోళాల్లాంటి కళ్లతో న్యాయవాదివైపు సూటిగా చూస్తూ ప్రశ్నించింది చిరుత.

`కాక మరేమిటీ… జనావాసాలపైకి నువ్వు వచ్చింది నిజం. అందుకు టివీల్లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్స్ సాక్ష్యం. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో ఈ చిరుత స్వైరవిహారం చేసింది మిలార్డ్. ఎన్నో గ్రామాలమీద పడి గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. ఊర్లలోని చెట్లు ఎక్కేస్తున్నది. ఇంటి ప్రహరీగోడల మీద ఠీవీగా కూర్చుంటున్నది. రోడ్లమీద దర్జాగా తిరిగేస్తున్నది. రాత్రిపూట కూడా గ్రామస్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. తన సొంత జాగీరులా ఊరంతా తిరిగేస్తూ, పైగా ఇప్పుడు అడ్డంగా వాదిస్తోంది. ఇది పచ్చి అబద్దం. అందుకే ఈ చారల చిరుతను క్రాస్ ఎగ్జామ్ చేయడానికి అనుమతి ఇవ్వండి మిలార్డ్ ‘ అడిగాడు న్యాయవాది.

`గ్రాంటెడ్’ అన్నారు న్యాయమూర్తి.

`చూడు, చారల చిరుతపులి, మీరు జనావాసాలమీద అంటే జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లోకి వస్తున్నారా , లేదా సూటిగా చెప్పండి’

`అవును వస్తున్నాను’ న్యాయవాది కళ్లలోకి సూటిగానే చూస్తూ చెప్పింది చిరుత.

`దట్సాల్ మి లార్డ్, నేరం ముద్దాయి ఒప్పుకున్నాడు. ఈ చారల చిరుతపులి గత కొంతకాలంగా జనారణ్యాన్ని టార్గెట్ చేస్తున్నది. ఇందుకు తగిన శిక్ష విధించాలి మిలార్డ్ ‘ తేల్చిపారేశాడు లాయర్.

`ఇంకా మీరేమైనా చెప్పుకోవాల్సి ఉన్నదా చారల చిరుతపులి…’ మరో అవకాశం ఇస్తున్నట్లు అడిగారు జడ్జ్.

`ఉన్నది న్యాయమూర్తిగారు. మీ దృష్టితో చూస్తే నేను జనావాసాల మీదకు వస్తున్నట్లు అనిపించవచ్చు. అందుకే ఒప్పుకున్నాను. కానీ, నా దృష్టిలో అది తప్పు. నేను పుట్టినప్పటి నుంచి ఎక్కడకు వెళ్లలేదు. అలాంటప్పుడు జనావాసాల దగ్గరకు వెళ్లడమేమిటీ..!?’

`పుట్టినప్పటి నుంచి ఎక్కడకూ వెళ్లలేదంటున్నావ్…మరో పక్క మా ఊర్లమీద పడుతున్నది నిజమేనంటున్నావ్. (న్యాయమూర్తి వైపు తిరిగి) మిలార్డ్ , ఈ చారల చిరుతపులి చాలా తెలివిగా మాట్లాడుతోంది. ఊర్లమీద పడుతున్న అభియోగాన్ని అంగీకరిస్తూనే మరోపక్క తానెక్కడికీ కదలలేదని వాదిస్తోంది. దీనికి …సారీ…ఈ చారల చిరుతపులికి లై-డిటెక్టర్ తో టెస్ట్ చేయించడానికి అనుమతి మంజూరు చేయాలి మిలార్డ్’

`నేను నిజమే చెబుతున్నాను. మీవాదన ఎంత నిజమో , నా వాదన కూడా అంతే నిజం’ మళ్ళీ అదే చెప్పింది చిరుత.

`కాస్తంత వివరంగా చెప్పు చారల చిరుతపులి’ ఒక్క నిర్దోషికి కూడా అన్యాయం జరగకూడదన్న తపనతో అడిగారు న్యాయమూర్తి.

`మెదక్ జిల్లాలోనో, చిత్తూరు జిల్లాలోనో, కాదంటే విశాఖ జిల్లాలోనో…ఏ జిల్లా అయితే ఏమిట్లేండీ, మొత్తానికి అక్కడక్కడా మా చిరుతపులులు ఊర్లమీదకు వస్తున్నాయని మీరంటున్నారు. అదేమంటే టీవీ క్లిప్పింగ్స్ చూపిస్తామంటున్నారు. వాటి ఆధారంగా చూస్తే ఇది నిజమే కావచ్చు. అందుకు మీరు శిక్ష విధించనూవచ్చు. కానీ ఇది మావైపునుంచి చూస్తే వాస్తవం కాదు. ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను, మా నాన్న, మా తాతముత్తాతలు అంతా ఇక్కడే, అంటే నన్ను ఎక్కడైతే పట్టుకున్నారో ఆ ప్రాంతంలోనే ఉండేవారం. ‘

మధ్యలో లాయర్ అడ్డుతగులుతూ…

`ఇందుకు తగిన సాక్ష్యం ఏదైనా మీవద్ద ఉన్నదా? అంటే రేషన్ కార్డు, లేదా ఆధార్ కార్డ్ లాంటివన్నమాట’

`ఆ కార్డులేమీ లేవు. కానీ గ్రీన్ కార్డ్ ఉండేది’

`ఇకనేం, ఆ గ్రీన్ కార్డ్ ని కోర్టువారికి అందజేయి’

`అదిప్పుడు లేదు’

`మిలార్డ్, ఈ చారల చిరుతపులి చాలా తెలివిగా మాట్లాడుతోంది. తానూ, తన పూర్వీకులు అక్కడే అదే గ్రామంలో ఉండేవారమని వాదిస్తూనే, అందుకు తగిన సాక్ష్యాలు మాత్రం చూపించలేనంటున్నది. ఈ మోసపూరిత వ్యాఖ్యలకు సెక్షన్….’ అంటూ న్యాయవాది వాదిస్తుంటే, మధ్యలో న్యాయమూర్తి కలగజేసుకుంటూ…

`మీరాగండి న్యాయవాదిగారూ… చూడు చారల చిరుతపులి, మీ దగ్గర లేకపోతే మీ బంధువుల దగ్గరైనా చిరునామా ధ్రవపత్రం ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి ‘

`ఎవరి దగ్గరాలేవు’ అన్నది చిరుత దీనంగా…

`చూడండి మిలార్డ్. ఎంత దీనంగా మాట్లాడుతున్నదో ఈ చారల చిరుత. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. విచ్చలవిడిగా తిరుగుతూ ఊర్లమీద పడి జనవాసాలను భీతావహం చేస్తున్న ఈ చారల చిరుతపులికి తగిన శిక్ష విధించండి మిలార్డ్.’

`ఆఖరి సారిగా మరో అవకాశం ఇస్తున్నాను. మీ వాదనను మీరు సమర్థించుకోగలరా…’ న్యాయమూర్తి చారల చిరుతవైపు సూటిగా చూస్తూ అడిగారు.

`నిరూపించుకోవడాలూ, ఆధార పత్రాలు చూపించడాలు నేను చేయలేకపోవచ్చు. కానీ, నేనూ మా వాళ్లు అక్కడ ఉన్నమాట నిజం. తరతరాలుగా ఆ ప్రాంతంలో ఉంటూ, రోజూ వేటకు వెళ్లేవాళ్లం. హాయిగా సంచరించేవారం. ఇప్పుడు మీరంటున్న జనావాసాలన్నీ అడవి ప్రాంతాలే. ఈ అడవి ప్రాంతమే మా గ్రీన్ కార్డ్. వాటిపై మాకు హక్కుని ఆ ప్రకృతే ప్రసాదించింది. కానీ ఇప్పుడా గ్రీన్ కార్డ్ పోయింది. చెదరిపోయింది. మా హక్కులను మీరే, మీ మానవులే లాక్కున్నారు. ఓ రకంగా చెప్పాలంటే గ్రీన్ కార్డ్ ను లాక్కుంది మీ మానవులే సార్’ ఆవేశపడిపోయింది చిరుత.

`అంటే, అపరాధులు ఎవరంటావు?’ ఆసక్తితో అడిగారు న్యాయమూర్తి.

`కచ్చితంగా మీ మానవజాతే. అడవులను మీ జనావాసాల కోసం అడ్డదిడ్డంగా నరికింది నిజంకాదా…చెప్పండి’

`నిజమే’

`మీ అవసరాల కోసం అడవులను జనారణ్యాలుగా మార్చేశారు. అంతేగా’

`అవును. అంతే’

`అలాంటప్పుడు, అంతవరకూ హాయిగా సంచరించిన మేము ఎక్కడకు వెళ్లాలి? ఏమైపోవాలి. ఒకప్పుడు పులిని చూసి మనిషి భయపడేవాడు. కానీ ఇప్పుడు మనిషిని చూసి మా పులిజాతి భయపడిపోతున్నది. ఎక్కడ చూసినా మనుషులే. ఎప్పుడు ఏ రకంగా ప్రమాదం పొంచి ఉంటుందో తెలియక మేమే బిక్కిబిక్కుమంటూ దాక్కునే పరిస్థితి వచ్చింది. మా ప్రాంతం విడిచి మేము వెళ్లలేము. తినడానికి తిండిలేక ఆకలి కడుపులతో మా జాతి చచ్చిపోతున్నది. ఉన్న సొంత అడవి విడిచి ఎక్కడకు వెళ్ళినా ఇదే పరిస్థితి. ఎటు చూసినా జనావాసాలు పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు ఎక్కడకు వెళ్ళినా ఏం ప్రయోజనం. అందుకే మేము అక్కడే పుట్టిన చోటే ఉంటున్నాం. అయినా మేమున్న ప్రాంతం కూడా మారిపోయింది. నెమ్మదిగా ఇళ్లు వచ్చేశాయి. మనిషి తన అవసరాల కోసం చెట్లను నరికేశాడు. పుట్టలు దున్నేశాడు. కొండల్నీ పిండిచేశాడు. నీటి కొలనుల రూపురేఖలు మార్చేశారు. మీరు చేసే ఒక్కొక్క పనికి మా అడవిజంతువులు చెల్లాచెదురయ్యాయి. రోజూ మేము నడిచే దారినే మీరు రోడ్లుగా మార్చేశారు. మేము వేటకోసం వెళ్లే ప్రాంతమంతా ఊరుగా మారిపోయింది. అప్పుడు మేము ఆహారం కోసం బయటకువస్తే మీకు మేమేదో మీ ఊర్లమీద పడినట్లు అనిపిస్తున్నది. ఇదే నిజం. అవునా …కాదా?’

`అవును’ న్యాయవాది కూడా అంగీకరించాడు.

`ఇది మీరు అంగీకరించినప్పుడు మా వన్యప్రాణులం ఊర్లమీద పడటంలేదు. వాస్తవానికి మీ మానవులే మా అడవులమీద పడుతున్నారన్న సత్యం మీకు అవగతమవుతుంది. మా ఆవాసాలను ధ్వంసం చేస్తున్నారు. మాకు నిలువనీడ లేకుండా చేస్తున్నారు. తప్పు మీమీద ఉంచుకుని నన్ను కోర్టుకు ఈడ్చుకొచ్చారు. నాపై అభియోగాలు మోపుతున్నారు. ధర్మమూర్తులు మీరోసారి ఆలోచించాలి’ ఆవేదనతో అంది చిరుత.

న్యాయమూర్తి తీర్పు చెప్పడం మొదలుపెట్టారు….

`అవును, చారల చిరుత చెప్పింది నిజమే. చూడండి న్యాయవాదిగారూ, మీరు చాలా తొందరపడి ఈ వన్యప్రాణులమీద కేసులు పెడుతున్నారు. అసలు వన్యప్రాణులే మనమీద కేసులు పెట్టే పరిస్థితి ఇది. తప్పు మనమీద ఉంచుకుని నిర్దోషులైన ఈ వన్యమృగాలపై అభియోగాలు మోపడం తప్పే. వాటి ఆవాసాలను కబ్జాచేసినందుకు నిజమైన దోషులు మానవులే అన్నది నా అభిప్రాయం. ఇప్పటికైనా ఈ విషయంలో మానవజాతి కళ్లుతెరవాలని, ఇకపై జంతువులు మనపై వేలెత్తి చూపకుండా జాగ్రత్తగా మసులుకోవాలని తగు సూచనలు చేస్తూ, ఈ కేసును కొట్టిపారేస్తున్నాను. ఈ చారల చిరుతను నిర్దోషిగా ప్రకటిస్తున్నాను. అలాగే, ఈ చిరుతకు తగిన స్వేచ్ఛ, ఆవాసం కల్పించాలని ఆదేశిస్తున్నాను’ అని న్యాయమూర్తి గంభీరంగా చెప్పగానే చిరుత తన ముందు కాళ్లనే చేతులుగా మారుస్తూ మనసారా నమస్కరిస్తూ,తప్పట్లు కొట్టింది. దాని కళ్లు, న్యాయమూర్తివైపు ఆరాధనా భావంతో చూశాయి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close