పోల‌వ‌రం ప‌నులపై చొర‌వ కేంద్రానిదా రాష్ట్రానిదా..?

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌పై కేంద్రం కొంత స్పష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇటీవల చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే ప‌నులు ప‌డ‌కేస్తాయేమో అనే అనుమానం క‌లిగింది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా కొంత ఆవేద‌న‌కు గురికావ‌డం, ప్రాజెక్టు ప‌నులు వారికే ఇచ్చేసి ఒక న‌మ‌స్కారం పెట్టేస్తా అని చెప్ప‌డం చూశాం. ఈ నేప‌థ్యంలో భాజ‌పా, టీడీపీ సంబంధాల‌పై కూడా కొంత చ‌ర్చ జ‌రిగింది. అయితే, ఈ అనుమాల‌న్నింటిపై కేంద్రం ఇప్పుడు కొంత స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌మంత్రి నితిన్ గ‌ట్క‌రీతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వ వాద‌న‌ల‌పై కేంద్రం కొంత సానుకూల దృక్ప‌థంతో స్పందించింది అంటున్నారు. కాంక్రీటు ప‌నుల విష‌యంలో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి చివ‌రిగా ఓ నెల‌రోజులు అవ‌కాశం ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఓ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ నెల‌రోజుల త‌రువాత ప‌నులు స‌మీక్షిద్దామ‌నీ, ఆ త‌రువాత వేరే కంపెనీకి ప‌నులు అప్ప‌గిద్దామా వ‌ద్దా అనేది నిర్ణ‌యిస్తారు.

పెరిగిన నిర్మాణ వ్యయానికి సంబంధించి డీపీఆర్ పంపిస్తే ఆలోచిస్తామ‌ని కూడా కేంద్రం స్ప‌ష్టం చేసింది. పోల‌వ‌రం అథారిటీకి సీయీవోను కూడా త్వ‌ర‌లోనే నియ‌మించ‌బోతోంది. ఇవే అంశాలను కేంద్ర‌మంత్రి నితిన్ గ‌ట్క‌రీ మీడియాకి వివరించారు. పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు అనీ, ఆంధ్రా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు అనుగుణంగా 2019లోపు పూర్తి చేసే బాధ్య‌త త‌మ‌కు ఉంద‌ని చెప్పారు. ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబు ఎంత ఆందోళ‌న‌తో ఉన్నారో, తానూ అదే భావ‌న‌తో ఉన్నాన‌ని చెప్ప‌డం విశేషం. రాజ‌కీయాల‌కు అతీతంగా పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌నీ, శాఖాప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా వెంట‌నే తాను స్వ‌యంగా స్పందిస్తాన‌ని గ‌ట్క‌రీ హామీ ఇచ్చారు. ఆ త‌రువాత‌, చంద్ర‌బాబు నాయుడు కూడా మాట్లాడుతూ… పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్రం ఇచ్చిన స్ప‌ష్ట‌తపై సంతోషంగా ఉంద‌న్నారు.

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ విష‌యంలో మ‌రో నెల‌రోజులు టైమ్ ఇవ్వ‌డం విశేషం! అలాంట‌ప్పుడు, గ‌త నెల‌లో ప‌నులు నిలిపెయ్యాల‌ని లేఖ ఎందుకు రాసిన‌ట్టు..? ఆ లేఖ వ‌ల్ల‌నే క‌దా ఇంత చ‌ర్చ జ‌రిగింది. దానిపై కేంద్రం ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదే..! ట్రాన్స్ ట్రాయ్ కొంత గ‌డువు ఇచ్చి చూడండ‌ని ముందే చెప్పి ఉంటే చెప్పి ఇంత గంద‌ర‌గోళం ఉండేది కాదు క‌దా. నాగ్ పూర్ లో గ‌ట్క‌రీని సీఎం క‌లిసిన‌ప్పుడు టెండ‌ర్లు పిల‌వ‌డానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని చెప్పారు. ఆ త‌రువాత‌… టెండ‌ర్లు ఆపాలంటూ లేఖ రాశారు. ఇప్పుడేమో మ‌రో నెల‌రోజులు టైమ్ ఇద్దామ‌ని చెబుతున్నారు. పోల‌వ‌రంపై కేంద్ర‌మే చాలా చొర‌వ‌తో ఉంద‌నీ, తానే స్వ‌యంగా ప‌నులు చూసుకుంటాన‌ని గ‌ట్క‌రీ చెబుతున్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా పోల‌వ‌రం పూర్తిచేస్తామ‌ని చెబుతూనే.. మ‌ధ్య‌లో ఈ లేఖ‌లు లాంటి గంద‌ర‌గోళ ప‌రిస్థితి క్రియేట్ చేస్తున్నది వారే క‌దా! ఈ లెక్క‌న గత కొద్దిరోజులుగా చోటుచేసుకున్న ప‌రిణామాలను ఎలా చూడాలి..? ఏదేమైనా, అనుకున్న స‌మ‌యంలో పోల‌వ‌రం పూర్తి కావాల‌న్న‌దే అంద‌రి ఆకాంక్ష‌. అయితే, అది త‌మ చొర‌వ‌తోనే జ‌రుగుతోంద‌ని కేంద్రం చెప్పుకునే ప్ర‌య‌త్నం, త‌మ కృషితోనే పూర్త‌వుతోంద‌ని రాష్ట్రం ప్ర‌చారం చేసుకునే తీరులోనే కొంత మార్పు అవ‌స‌రంగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.