వ‌చ్చింది ఉప రాష్ట్రప‌తిగా… మాట్లాడింది మాజీ మంత్రిగా!

ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడుకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు స‌ర్కారు పౌర స‌న్మాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. రాజ‌ధాని ప్రాంతం వెల‌గ‌పూడిలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తోపాటు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప‌లువురు కేంద్ర‌మంత్రులు, ఎంపీలూ టీడీపీ నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య నాయుడు సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. త‌న స‌హ‌జ ధోర‌ణి అయిన పొగ‌డ్త‌ల్ని చివ‌రిసారిగా గుప్పించేలా ప్ర‌సంగంలో మేళ‌వించారు! కేంద్ర‌మంత్రిగా తాను చేసిన సేవ‌ల‌ను మ‌రోసారి గుర్తు చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల గురించి మాట్లాడుతూ… ఇద్ద‌రు చంద్రులూ ఎప్ప‌టిక‌ప్పుడు క‌లుసుకుని మాట్లాడుకోవాల‌ని ఆకాంక్షించారు. ఇదే విష‌యాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో కూడా తాను ఇటీవ‌లే చెప్పాన‌ని వెంక‌య్య అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల‌న్నారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న గురించి మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పాటు సంద‌ర్భంలో ఆంధ్రాకు కొంత అన్యాయం జ‌రిగిందన్నారు. అందుకే, నాడు రాజ్య‌స‌భ‌లో తాను ప‌ట్టుబ‌ట్టాన‌నీ, ఆంధ్రాకు అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు వ‌చ్చే విధంగా అప్ప‌ట్నుంచీ కృషి చేస్తూనే ఉన్నాన‌ని చెప్పుకున్నారు. కేంద్ర‌మంత్రిగా ఉంటూ ఒక్క ఆంధ్రాకే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ప్ర‌ధాని మోడీ కూడా త‌న‌తో చ‌మ‌త్క‌రించిన సంద‌ర్భాలున్నాయ‌న్నారు. దేశ‌వ్యాప్తంగా గ్రామాలు బాగుప‌డితేనే అభివృద్ధి సాధ్య‌మ‌ని ప్ర‌ధాని నరేంద్ర మోడీ న‌మ్మార‌నీ.. అందుకే, ప్ర‌ధాన‌మంత్రి స‌డ‌క్ యోజ‌న కార్య‌క్ర‌మం తీసుకొచ్చారు. ఆ కార్య‌క్ర‌మంలో త‌న‌కు భాగ‌స్వామ్యం ల‌భించ‌డం జ‌న్మ‌ధ‌న్య‌మైంద‌ని వెంక‌య్య అన్నారు.

దేశంలో అంద‌రికీ సొంత ఇళ్లు ఉండాల‌ని కోరుకుంటార‌నీ, అలాంటి క‌ల‌ల‌ను సాకారం చేసే ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌క‌మ‌నీ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రిగా వ‌చ్చి ఆ ప‌థ‌కం కింద గృహ నిర్మాణాల‌ బాధ్య‌త నిర్వ‌ర్తించ‌డం అదృష్ట‌మ‌ని వెంక‌య్య చెప్పారు. ఈ యోజ‌న కింద ఆంధ్రాకు ఐదు ల‌క్ష‌ల ముప్పై అయిదు వేల ఇళ్ల‌ను ఇవ్వ‌డం జ‌రిగింద‌నీ, చ‌రిత్ర‌లోనే ఇంత భారీ కేటాయింపు లేద‌ని వెంక‌య్య అన్నారు. ఆంధ్రా విష‌యంలో మొద‌ట్నుంచీ శ్ర‌ద్ధ తీసుకుంటూ వ‌చ్చాన‌నీ, పోల‌వ‌రం, ప్రాజెక్టులు, ఐఐటీలు, ఐఐఎమ్ లు ఇలాంటివి ఎన్నో వ‌చ్చే కృషి చేశాన‌ని చెప్పుకున్నారు. ఇంత త‌క్కువ స‌మ‌యంలో రాష్ట్రానికి ఇంత ఎక్కువ‌గా సాయం అంద‌డం గ‌తంలో ఎప్పుడూ జ‌రలేద‌న్నారు. హ‌క్కు ప్ర‌కారం ప్ర‌జ‌ల‌కు రావాల్సిన‌వి ర‌ప్పించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నం గ‌ట్టిగా చేశాన‌ని వెంక‌య్య నాయుడు అన్నారు.

ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ప్ర‌సంగంలో ఎక్కువ‌గా వినిపించింది ఇదే. ప్ర‌ధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని కొనియాడ‌టంతోపాటు, కేంద్రమంత్రిగా తాను ఆంధ్రాకు చేసిన మేలేంట‌నేది చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌పై తాను రాజ‌కీయాలు చేయ‌లేక‌పోయినా.. ఆంధ్రా కోసం చేయాల్సిన సాయం చేస్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఉప రాష్ట్రప‌తిగా చ‌ట్ట స‌భ‌ల తీరును మార్చాల‌నే స‌త్సంక‌ల్పంతో ఉన్నాన‌ని చెప్ప‌డం త‌ప్ప‌… వెంక‌య్య ప్ర‌సంగ‌మంతా మాజీ కేంద్ర‌మంత్రి ధోర‌ణిలోనే ఎక్కువ‌గా సాగింద‌ని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.