ఉత్త‌మ్ పై హైక‌మాండ్ కి మ‌రో ఫిర్యాదు చేస్తార‌ట‌..!

ఏదో ఒక పాయింట్ దొరికితే చాలు… ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకునేందుకు టి. కాంగ్రెస్ నేత‌లు సిద్ధంగా ఉంటార‌ని ఎప్ప‌టిక‌ప్పుడు నిరూప‌ణ అవుతూనే ఉంటుంది! తెలంగాణ నేత‌లకు సుదీర్ఘ కాలంపాటు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయించ‌గ‌లిగే మంత్ర‌దండం ఏంట‌నేది హైక‌మాండ్ కి కూడా అర్థం కాని ప్ర‌శ్నే! పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై టి. పార్టీలో ఎంత‌మంది గుర్రుగా ఉంటున్నారో తెలిసిందే. ఏ చిన్న అంశం దొరికినా దాన్ని పెద్ద‌ది చేసి, ఢిల్లీకి ఫిర్యాదులు చేసే వ‌ర‌కూ వెళ్లిపోతుంది. తాజాగా అలాంటి ఓ అంశాన్నే నేప‌థ్యంగా చేసుకుని ఉత్త‌మ్ పై హైక‌మాండ్ కు ఫిర్యాదు చేసేందుకు కొంత‌మంది నేత‌లు తీవ్ర ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నార‌ట‌..!

ఈ మ‌ధ్య‌నే సూర్యాపేట‌లో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ… మాజీ మంత్రి దామోద‌ర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు! రేవంత్ తోపాటు కాంగ్రెస్ లో చేరిన ప‌టేల్ ర‌మేష్ రెడ్డి అసంతృప్తికి గుర‌య్యారు. వెంట‌నే పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ కుంతియాను క‌లిసి… తానూ పార్టీ కోసం చాలా శ్ర‌మిస్తున్నాన‌నీ, ఉత్త‌మ్ ఇలా టిక్కెట్లు ప్ర‌క‌టించేస్తే ఎలా అని గోడు వెళ్ల‌బోసుకున్నార‌ట‌. ఆ మ‌ధ్య బ‌స్సుయాత్ర‌లో కూడా ఒక ఉత్సాహంలో గెలిపించాలంటూ కొంత‌మంది పేర్లు ఉత్త‌మ్ చెప్పేశారు. అప్పుడు కూడా ఇలానే అసంతృప్తులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉంది. ఈలోగా ఇప్పుడే ఫ‌లానా నాయ‌కుల‌కు టిక్కెట్లు అంటే పార్టీకి ఇబ్బందే. ఎందుకంటే, ఆశావ‌హులు ఇప్ప‌ట్నుంచే నిరాశ చెందుతారు. పార్టీకి వ్య‌తిరేకంగా మారిపోతారు క‌దా.

ఇదే పాయింట్ మీద ఉత్త‌మ్ పై మ‌రోసారి ఫిర్యాదుకు ఓ వ‌ర్గం నేత‌లు అసంతృప్తుల‌ను ఐక్యం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదే అంశ‌మై గ‌తంలోనూ ఉత్త‌మ్ కు హైక‌మాండ్ సున్నితంగా క్లాస్ తీసుకుంద‌ట‌! అయినాస‌రే, ఆయ‌న తీరు మార‌లేద‌నీ, త‌న‌కు న‌చ్చిన‌వారికి టిక్కెట్లు అంటూ ప్ర‌క‌టించ‌డ‌మేంటంటూ మ‌రోసారి హైక‌మాండ్ దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం జ‌రుగుతోందని ఆ పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఉత్త‌మ్ పై ఫిర్యాదులు కాంగ్రెస్ కి కొత్త కాదు! దీని అనూహ్య‌మైన చ‌ర్య‌లూ మార్పులూ ఉండ‌వు. కాక‌పోతే, దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను ఎలా సాధించాల‌నేది హైక‌మాండ్ కి అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితిని ప‌దేప‌దే తీసుకొస్తున్నార‌ని చెప్పుకోవ‌చ్చు! ఇంకోటి… అభ్య‌ర్థుల‌ను ముంద‌స్తుగా ప్ర‌క‌టించినా, ఎన్నిక‌ల ముందే ప్ర‌క‌టించినా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తులు వ్య‌క్త‌మ‌వడం ఖాయ‌మ‌నే సంకేతాలు చాలా స్ప‌ష్టంగా ఉన్నాయి. ఒక‌రి నాయ‌క‌త్వంలో పార్టీ న‌డిస్తే… ఇలాంటి ప‌రిస్థితులు రాకుండా ముందునూ చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. కానీ, టి. కాంగ్రెస్ లో అంద‌రూ బాసులే క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com