కాంగ్రెస్ స్థాయిని పెంచి మాట్లాడుతున్న తల‌సాని..!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేద‌నీ, ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా తెరాస‌లో చేరిపోతార‌నీ, తెరాస త‌ప్ప రాష్ట్రంలో మ‌రో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తి అంటూ ఏదీ ఉండ‌కూద‌న్న ల‌క్ష్యంతో అధికార పార్టీ వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. ప‌ట్టుబ‌ట్టి మ‌రీ కాంగ్రెస్ ఎల్పీని లేకుండా చేసింది. ప్ర‌తిప‌క్షం అనేది ఉంటే… ఎప్ప‌టికైనా బ‌ల‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌న్న వ్యూహంతో బ‌ల‌హీన ప‌రుస్తూ వ‌చ్చింది. ఎప్పుడేతే భాజ‌పా తెలంగాణ మీద ఫోక‌స్ పెంచిదో… అప్ప‌ట్నుంచీ నెమ్మ‌దిగా ప్ర‌తిప‌క్షం ప్రాధాన్య‌త గుర్తించే క్ర‌మంలో తెరాస నేత‌లు మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు. ఈ మ‌ధ్య‌నే, ఓ కార్య‌క్ర‌మంలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… ప్ర‌శ్నించే గొంతు ఉండాల‌న్నారు. ఇవాళ్ల‌… తెరాస మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స్పందిస్తూ రాష్ట్రంతో తెరాస‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే అవుతుంద‌న్నారు.

భాజ‌పాలో ప్ర‌స్తుతం కొంత‌మంది నేత‌లు చేరుతున్నార‌నీ, ఆ పార్టీ కూడా చేరిన‌వారిని చూసి బ‌లోపేతం అయిపోయామ‌ని గొప్ప‌లు పోతోంద‌నీ, కానీ ప్ర‌స్తుతం భాజ‌పాలోకి వెళ్తున్న‌వారంతా అవుట్ డేటెట్ రాజ‌కీయ నాయ‌కుల‌ని విమ‌ర్శించారు త‌ల‌సాని. మోత్కుప‌ల్లి, విజ‌య‌శాంతి లాంటి లీడ‌ర్ల వ‌ల్ల ఏం ఉప‌యోగ‌మ‌న్నారు. సొంత కేడ‌ర్ లేని నాయకుల్ని ఎంత‌మంది తీసుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. తెలంగాణ‌లో తెరాస‌కు ప్ర‌త్యామ్నాయం ఎప్ప‌టికైనా ఉంటే కాంగ్రెస్ ఉంటుంద‌న్నారు. ఆ పార్టీకి గ్రామీణ స్థాయి నుంచి ఓటు బ్యాంకు ఉంద‌నీ, భాజ‌పాకి అది లేద‌న్నారు. రాష్ట్రంలో ఎప్ప‌టికైనా కాంగ్రెస్ స్ట్రాంగ్ అనీ, భాజ‌పాకి ఆ స్థాయికి రాలేద‌నీ, ఓటు బ్యాంకును పెంచుకోవ‌డం వారికి చేత‌గాద‌ని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు.

తామే నంబ‌ర్ వ‌న్ అనీ, రెండో స్థానం కోసం కాంగ్రెస్, భాజ‌పాలు కొట్టుకుంటున్నాయ‌ని ఈ మ‌ధ్య అన్నారు. ఇవాళ్లేమో… కాంగ్రెస్ కి రెండో స్థానం ఇచ్చేశారు. తెరాస‌కు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తి లేద‌ని చెప్పుకొచ్చి… ఇవాళ్ల కాంగ్రెస్సే ఎప్ప‌టికైనా ప్ర‌త్యామ్నాయం అంటున్నారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ శ్రేణుల‌కు విన‌సొంపుగా ఉంటుంది! మొత్తానికి, రాష్ట్రంలో భాజ‌పా కార్య‌క‌లాపాలు పెంచిన త‌రువాత‌, తెరాస‌లో తెలియ‌ని ఒక గుబులు ఎక్క‌డో ఉంద‌నేది త‌ల‌సాని వ్యాఖ్య‌ల్లో క‌నిపిస్తోంది. దాంతోనే కాంగ్రెస్ పార్టీ స్థాయిని పెంచే విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజానికి, రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఉండి… ప్ర‌తిప‌క్షాన్ని కూడా దెబ్బ‌తీసే రాజ‌కీయాలు మానుకుని ఉంటే, ఇవాళ్ల భాజపాకి రాష్ట్రంలో ఇంత స్పేస్ ఉండేది కాదేమో. కాంగ్రెస్ కూడా బ‌ల‌హీన‌మైపోయింది కాబ‌ట్టి, ఎదిగేందుకు కావాల్సిన బేస్ ఇక్క‌డ ఏర్ప‌డుతుంద‌నే న‌మ్మ‌కాన్ని భాజ‌పాకి క‌లిగించ‌డంతో తెరాస పాత్ర కూడా ఉంద‌న్న‌ది వాస్త‌వం. బ‌ల‌హీన శ‌త్రువుని ఇంకా బ‌ల‌హీనం చేసి, బ‌ల‌మైన శ‌త్రువును కొని తెచ్చుకున్న‌ట్ట‌యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com