మెయిళ్లు కుట్రయితే..పెనుమాక సభ సంగతి?

అమరావతికి రుణం రాకుండా ప్రపంచ బ్యాంకుకు బూటకపు మెయిల్స్‌ పంపించారని ప్రభుత్వం ఆరోపించింది. రాజధానిని అడ్డుకునే రాజకీయ కుట్రల జాబితాలో దీన్నిచేర్చి యనమల రామకృష్ణుడు వంటి సీనియర్‌ మంత్రి కూడా ప్రకటనలు చేశారు. నిజంగా వీటితోనే ప్రపంచ బ్యాంకు ఆగిపోతుందా? గతంలో వెనక్కు పోయినప్పుడు ఏ మెయిల్స్‌ అడ్డుపడ్డాయి? వంటి ప్రశ్నలకు వారు సమాధానమివ్వరు. ఇచ్చినా నమ్మడం కష్టం.

ఎక్కడో ప్రపంచ బ్యాంకుకు దొంగ పేర్లతో మెయిల్సు కథ పక్కనపెడదాం.మంగళవారం(27వ తేదీ) తాడేపల్లి మండలం పెనుమాకలో రైతుల నిరసనతో ప్రభుత్వ టెంటు కూలిపోవడం కూడా కుట్రే అనాలా? భూ సమీకరణలో భూములివ్వని రైతుల అభ్యంతరాలు తీసుకోవడానికి అధికారులు వచ్చారు. అయితే వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు మాత్రం సిద్ధపడలేదట. అభ్యంతరాలు నమోదు చేసుకోవద్దని మౌఖికంగా ఆదేశాలివ్వడంతో రాసుకోనూలేదు. హైకోర్టు ఆదేశం ప్రకారం వచ్చిన మీరు ఇలా చేస్తే చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని రైతుల తరపున వచ్చిన న్యాయవాదులు సుధాకరరెడ్డి,నిర్మల, డా.కన్నారావు నాయుడు వంటి వారు సిఆర్‌డిఎ డిప్యూటీ కలెక్టర్‌ రాధాకృష్ణయ్యను ప్రశ్నించారు.

అలాచేసే అధికారం లేదంటూనే ఆయన అనుకున్న కార్యక్రమం నడిపించడానికి ప్రయత్నించారు. భూములివ్వకపోతే నష్టపోతారని బెదిరించడం వల్ల ్ల మీరు శిక్షను అనుభవించాల్సివస్తుందని న్యాయవాదులు ఆయనను హెచ్చరించారట. ఏమైనా సరే వ్యతిరేకులైన రైతుల అభిప్రాయాలు నమోదు చేయడానికి అధికారులు తిరస్కరించడంతో అక్కడ ఉద్రిక్తత పెరిగింది.టెంటు కూలింది. ఈ సమయంలోనే స్థానిక ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి కుర్చీలు ఎత్తి పారేయడంతో తనపై కేసు పెట్టారు. ఆయనే సభ జరగకుండా అడ్డుకున్నారని కేసులో పేర్కొన్నారు. ఆయన మీద కేసు పెట్టొచ్చు గాని రైతులు, లాయర్ల మాటేమిటి? న్యాయమైన అభ్యంతరాలు చట్టబద్దమైన హక్కులను ఉపయోగించుకోవడం కూడా అడ్డుపడ్డం అంటే ఎలా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.