త‌లాక్ బిల్లును టీడీపీ కూడా వ్య‌తిరేకిస్తోందా..!

తెలుగుదేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ధ్య పొత్తు బలాన్ని ప్ర‌శ్నించే విధంగా ఈ మ‌ధ్య చాలా సంద‌ర్భాలు క‌నిపిస్తున్నాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం పెట్టిన కొర్రీలు చూశాం. ఇంకోప‌క్క‌, రాష్ట్రంలో సోము వీర్రాజు ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక విమ‌ర్శ చేస్తూనే ఉన్నారు. పొత్తు వ‌ల్లే రాష్ట్రంలో భాజ‌పా న‌ష్ట‌పోతోంద‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో శాసించే ప‌రిస్థితిలో తాము ఉంటామ‌నీ.. కొంత హ‌డావుడి చేస్తున్నారు. ఏపీ నేత‌లు టీడీపీతో సంబంధం లేకుండా ఢిల్లీకి వెళ్లి, ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య స‌మ‌క్షంలో పోల‌వ‌రం గురించి చ‌ర్చించిన సంగ‌తీ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్థావ‌నార్హ‌మే. ఇక, చంద్రబాబుకి ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం లేదన్నది కూడా ఎప్పట్నుంచే వ్యక్తమౌతున్న విమర్శ. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ట్రిపుల్ త‌లాక్ బిల్లుపై కూడా టీడీపీ వాద‌న ఇంకోలా ఉంద‌నే అభిప్రాయం ఢిల్లీ వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మౌతోంది.

ట్రిపుల్ త‌లాక్ బిల్లును అత్యంత ప్రతిష్ఠాత్మ‌కంగా కేంద్రం తీసుకుంది. లోక్ స‌భ‌లో పాస్ అయింది. కానీ, ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో ప‌రిస్థితిపైనే కొంత స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. కాంగ్రెస్ తో స‌హా అన్నాడీఎంకే వంటి పార్టీలు ఈ బిల్లులో కొన్ని మార్పుల‌కు గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నాయి. ముఖ్యంగా మూడేళ్ల జైలు శిక్ష నిబంధ‌న‌ను మార్చాల‌ని అంటున్నాయి. ఒక మ‌హిళ‌కు త‌లాక్ చెప్పినా కూడా విడాకులు తీసుకున్న‌ట్టు కాదు కాబ‌ట్టి, ఆమె భ‌ర్త‌ను మూడేళ్ల‌పాటు ఎలా జైలు పాలు చేస్తార‌నీ, ఆ కుటుంబానికి జీవ‌నాధారం ప‌రిస్థితి ఏంటనే ప్ర‌శ్న వ్య‌క్త‌మౌతోంది. ఈ క్లాజుపై కొంత చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, భాజ‌పా స‌ర్కారు తీసుకొచ్చిన ఈ బిల్లుపై ప్ర‌తిప‌క్షాలు స‌హ‌జంగానే ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకుని వ్య‌తిరేకిస్తున్నాయి. కానీ, మిత్ర‌ప‌క్షాల నుంచి కూడా కొంత వ్య‌తిరేక స్వ‌రం వినిపిస్తూ ఉండ‌టం విశేషం. భాజ‌పా మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన కూడా ఈ బిల్లుపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. దాంతోపాటు టీడీపీ కూడా దీనిపై కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో టీడీపీకి చెందిన కొంద‌రు ఎంపీలు ఆఫ్ ద రికార్డ్ మీడియాతో మాట్లాడుతూ… త‌లాక్ బిల్లులో మూడేళ్ల జైలు శిక్ష క్లాజుపై కొంత ఆలోచించాల్సి ఉంద‌నీ, దీనిపై త‌మ వ్య‌తిరేకత‌ను కూడా వ్య‌క్తం చేస్తామంటూ చెప్పార‌ట‌! ఈ బిల్లుపై క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేస్తున్నామ‌నీ, అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేసేందుకు సిద్ధ‌మౌతున్నామ‌ని అన్నార‌ట‌. భాజ‌పాకి మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ నుంచి కూడా ఇలాంటి స్వ‌రం వినిపించ‌డం విశేషం. నిజానికి, టీడీపీ ఇలాంటి అభిప్రాయంతో ఉంద‌నే విష‌యంపై ఇప్ప‌టికే జాతీయ మీడియాలో కొన్ని క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి.

సోము వీర్రాజుగానీ, పురందేశ్వ‌రిగానీ, ఏపీకి చెందిన ఇత‌ర క‌మ‌ల‌నాధులుగానీ… తెలుగుదేశం విష‌యంలో అవ‌కాశం దొరికితే చాలు విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌లు పెంచేస్తున్నారు. అయినాస‌రే, టీడీపీ నుంచి ధీటైన స‌మాధానం రావ‌డం లేదు. ఎందుకంటే, కేంద్రంతో చాలా అవ‌స‌రాలు ఉన్నాయి కాబ‌ట్టి, కొంత సామ‌ర‌స్య ధోర‌ణి త‌ప్ప‌దు అన్న‌ట్టుగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. కానీ, ఇప్పుడీ ట్రిపుల్ త‌లాక్ బిల్లు విష‌యంలో త‌మ వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేయ‌డం ద్వారా… రాష్ట్రంపై వివిధ అంశాల విష‌యంలో భాజపా అనుస‌రిస్తున్న ధోర‌ణికి వ్య‌తిరేకంగా ఇలా స్పందించామ‌నే సంకేతాలు ఇవ్వాల‌నేది టీడీపీ ఉద్దేశంగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.