తెలంగాణ ప్రజలు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి పదకొండు ఏళ్లు పూర్తయ్యాయి. ఉద్యమ పార్టీ చేతుల నుంచి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి అధికారం వచ్చింది. పాలకులు ఎవరు ఉన్నా ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంపడమే ప్రధానం అయింది. అయితే బతుకుల్ని బాగు చేసేందుకు, చేసుకునేందుకు అవసరమైన పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పిస్తేనే కొంత సార్థకత ఉంటుంది. ఆ దిశగా తెలంగాణ ఈ పదకొండేళ్లలో మెరుగైన పురోగతి సాధించిందని అనుకోవచ్చు.
నీళ్లు, నిధులు, నియామకాల్లో సంతృప్త స్థాయి
తెలంగాణ ఉద్యమానికి పునాది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ విషయంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించామన్న సంతృప్తి కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పంటల విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇతర పంటల్లోనూ ముందడుగు వేస్తోంది. ఇప్పుడు నీటి కొరత లేదు. తెలంగాణ ఎగువ రాష్ట్రం కావడంతో పై వాళ్లు దోచుకుంటున్నారన్న బాధ కూడా లేదు. దిగువ రాష్ట్రం ఏపీతో అప్పుడప్పుడూ రాజకీయాల కోసం గొడవలు పడుతున్నా ప్రజలు పట్టించుకోవడంలేదు. ఉద్యోగ నియామకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. కొన్నాళ్ల పాటు ఈ అసంతృప్తి ఉండేది. ఇప్పుడు అది లేదు. నిధుల కొరత లేదు. పంచడానికి ఎన్ని నిధులు వచ్చినా సరిపోవు ఆ కోణంలో పక్కన పెడితే తెలంగాణకు ఆదాయం దండిగా ఉన్నట్లే.
అభివృద్ధి దిశగా ముందడుగు
తెలంగాణ పదకొండేళ్లలో అనూహ్యంగా ముందడుగు వేసిందని చెప్పక తప్పదు. హైదరాబాద్ పూర్తి స్థాయిలో మారిపోయింది. గ్లోబల్ సిటీగా మారుతోంది. శరవేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ కు వంద కిలోమీటర్ల వరకూ ఇప్పుడు హైదరాబాద్ గానే పరిగణిస్తున్నారు. పరిశ్రమలు ఇతర జిల్లాలకు వ్యాపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుతో ఇన్స్టంట్గా ఎవరికీ లాభం రాదు కానీ..అనుకూలతలు ఉపయోగించుకుని ముందడుగు వేస్తే ప్రజల బతుకులు మారుతాయి. ఆ దిశగా తెలంగాణ ముందడుగు వేసింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణగా నిలిచింది.
ప్రత్యేక రాష్ట్ర ప్రయోజనాల దిశగా సాగుతున్నట్లే !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలసి ఉండటం వల్ల ఇంకా మేలు జరిగి ఉండేదని ఎవరైనా విశ్లేషించవచ్చు కానీ.. జరగాల్సింది జరిగిపోయింది. ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత ఇప్పటికి జార్ఖండ్, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలు దారిన పడలేదు. ఆయా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ మెరుగైన స్థితిలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పక తప్పదు. రాజకీయ పరంగా ఆలోచిస్తే.. ఎవరి గోల వారిది. అప్పట్లోనే బాగుంటుందని కొంత మంది..ఎట్లున్న తెలంగాణ ఎట్లయిపోయిదంని కొంత మంది రాజకీయాలు చేస్తూటారు. కానీ.. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అద్భుత ప్రగతిని. సాధిస్తోంది. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం దిశగా వెళ్తోంది.