సోషల్‌ ‘వర్మ’ల జోరు

మీడియా మేనేజిమెంటు వున్నప్పుడు సోషల్‌ మీడియా మేనేజిమెంటు మాత్రం ఎందుకుండదంటున్నారు కొందరు ప్రముఖులు లేదా వారిని ఆశ్రయించుకున్న సాంకేతిక సిబ్బంది. మీడియాలో ఒకరు చేసింది మరొకరు అనుకరించినట్టే సోషల్‌ మీడియాలోనూ ఒకే తరహా కామెంట్లు క్లిప్పింగులు హౌరెత్తుతాయి, బోరెత్తుతాయి కూడా. అయితే ఈ క్రమంలో కొందరికి అనూహ్యమైన స్థాయిలో క్లిక్‌లు కామెంట్లు రావడం యాదృచ్చికమని చెప్పలేం. కొన్ని సంస్థలు క్లిక్‌లు లైక్‌లు పెంచడానికి ఆఫర్లు పంపుతుంటాయి. ఆ శక్తిగల వారు పెట్టుబడి పెట్టి వెంటపడి తమకు ప్రచారం పొందగలుగుతున్నారట. టీవీ చర్చలలో గాని ఇంటర్వ్యూలలో గాని కొద్ది మందిని బాగా ముందుకు తేవడం వారు ఏం మాట్లాడినా యు ట్యూబ్‌లో ప్రొజెక్టు చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ వరసలో పవన్‌ కళ్యాణ్‌ అనుకూల వ్యతిరేక స్వరాలకు ఎక్కువ ప్రచారం వుంటున్నది.

గతంలో రామ్‌గోపాల్‌ వర్మ ఒక్కరే వుంటే ఇప్పుడు ఎందరో వర్మలు, కర్మకొద్ది! ఈ ఎస్‌ఇవో విద్యలో ఆరితేరిన వారి మాయాజాలం, అలాగే ఛానళ్లలో కొందరి అత్యుత్సాహం ఇందుకు కారణమవుతున్నాయనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు పెద్ద పెద్ద ఛానళ్లు కూడా రేటింగులతో పాటు సైట్‌ విజిట్స్‌ ఎన్ని వున్నాయని చూసుకుంటున్నారు. మామూలు మీడియలతో పాటు సోషల్‌ మీడియాలోనూ పాత్ర వహించిన వ్యక్తిగా నేను కొన్ని పేర్లు ఉన్నఫలానా చెప్పగలను. కొన్ని ఇంటర్వ్యూలు ఎవరూ వూహించనంత వేగంగా స్పందన పొందడం చూస్తే ఆ పనికోసం కొందరు వున్నట్టు తెలిసిపోతుంది. మీడియా సిబ్బందిని సంతోషపెట్టి యాజమాన్యంతోనూ మంచిగా వున్న కొందరు ఎక్కువ ప్రచారం పొందుతున్నట్టు అర్థమవుతూనే వుంటంది. అది చూసి మళ్లీ కొందరు తయారవుతారు. వీటన్నిటి కారణంగా నిజమైన చ ర్చలు ప్రజాభిప్రాయం ఉద్యమాలు వగైరా మరుగునపడిపోతుంటాయి. కొందరు వ్యక్తులూ సెలబ్రటీలే నోళ్లలో నానుతుంటారు. వాస్తవానికి ఇప్పుడు తెలుగుమీడియాపై వున్నంత వొత్తిడి గతంలో లేదు. ఈ కారణం వల్ల యాజమాన్యాలు ముందే తలవంచుతుంటాయి. పులిమీద పుట్రలా మళ్లీ ఇవే సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇక ఏదైనా గ్యాసిప్‌ దొరికితే మరీ మంచిది. ఎడిటర్లు యాంకర్లలోనూ రిపోర్టర్లలోనూ కూడా కొద్ది మంది మినహా గతంలోని సీనియర్లు తగ్గుతున్న కొద్ది కాలక్షేపం అనివార్యమవుతున్నది. చాలాసార్లు చూడలేకపోతున్నామని వీక్షకులు మాలాటివారికి తటస్థపడినప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.