తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడాల్సిన అత్యంత నాణ్యమైన నెయ్యి స్థానంలో కెమికల్స్ వాడి ఘోరాపరచారానికి పాల్పడిన నిందితులు ఇప్పుడు బరి తెగిస్తున్నారు. సీబీఐ సిట్ చేసిన విచారణలో యానిమల్ ఫ్యాట్ వాడలేదని తేలిందని గోల గోల చేస్తున్నారు. అసలు కల్తీ జరగదేన్నట్లుగా చెప్పిందని ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అలాగే మాట్లాడుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నిందాపరిహారయాగం చేస్తున్నారు. ఇలాంటి వాటితో ప్రజల్ని మభ్య పెట్టగలమని వారు అనుకుంటున్నారు. భక్తుల్ని మోసం చేయవచ్చని అనుకుంటున్నారు. కానీ దేవుడ్ని మోసం చేయగలరా?.
కల్తీ దొంగలు ..బాధితులుగా వేషం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో దోషులుగా తేలాల్సిన వారు ఇప్పుడు బాధితుల వేషం వేయడంపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక భక్తులు తల్లడిల్లుతుంటే, అప్పటి అధికార యంత్రాంగం, కల్తీ చేసి డబ్బు సంపాదించుకున్నవారు మాత్రం ఇప్పుడు క్లీన్ చిట్ పేరుతో బరితెగించి మాట్లాడుతోంది. సీబీఐ పర్యవేక్షణలోని సిట్ ) విచారణలో యానిమల్ ఫ్యాట్ వాడలేదని తేలిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం కేవలం రాజకీయ మనుగడ కోసమే తప్ప, అందులో పరమార్థం లేదని స్పష్టమవుతోంది. ల్యాబ్ రిపోర్టుల్లో కల్తీ జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని భక్తుల మనోభావాలతో ఆడుకోవడం అత్యంత దారుణం.
నిందాపరిహార యాగాల వెనుక అసలు రంగు
టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వంటి నేతలు ఇప్పుడు నిందాపరిహార యాగాలు చేస్తూ తాము నిర్దోషులమని చెప్పుకోవడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉంది. అపరాధం జరిగినప్పుడు దేవుడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి, తమ రాజకీయ మురికిని కడుక్కోవడానికి ఆధ్యాత్మికతను వాడుకోవడం మరో ఘోర అపచారం. అసలు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాల్సిన బాధ్యతను గాలికొదిలేసి, అతి తక్కువ ధరకే కల్తీ నెయ్యి సరఫరా చేసే సంస్థలకు కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారన్న ప్రాథమిక ప్రశ్నకు మాత్రం వీరి దగ్గర సమాధానం లేదు.
సిట్ విచారణపై తప్పుడు ప్రచారం:
సిట్ విచారణలో అసలు నెయ్యే కాదని కెమికల్స్ వాడారని తేల్చింది. అలా వాడిన కెమికల్స్ కొన్నింటిని యానిమల్ ఫ్యాట్ తో తయారు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. కేవలం విచారణ ప్రక్రియలో ఉన్న అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ, సోషల్ మీడియా వేదికగా అబద్ధపు ప్రచారానికి వైసీపీ తెరలేపింది. ఘోరమైన కెమికల్స్, కల్తీ నెయ్యి వాడకం వల్ల శ్రీవారి ప్రసాదానికి ఉన్న పవిత్రత దెబ్బతిన్నది వాస్తవం. ఈ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి డైవర్షన్ గేమ్ ఆడినా, సామాన్య భక్తులు నమ్మే స్థితిలో లేరు. కేవలం ఒక నివేదికలోని వాక్యాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టాలని చూడటం వారి బరితెగింపునకు పరాకాష్ట.
దైవద్రోహానికి శిక్ష తప్పదు
రాజకీయాల్లో ప్రత్యర్థులను మోసం చేయవచ్చు, వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు.. కానీ ఏడుకొండల వాడిని మోసం చేయడం ఎవరి తరమూ కాదు. లడ్డూ విషయంలో జరిగిన అపచారానికి కారణమైన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, రాజకీయ విన్యాసాలు తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు కానీ, హిందూ సమాజం కళ్లలో మట్టి కొట్టాలని చూస్తే భవిష్యత్తులో గట్టి గుణపాఠం తప్పదు. దేవుడి సన్నిధిలో జరిగిన ఈ మహాపాపానికి కాలమే సమాధానం చెబుతుంది.


