ప్ర‌గ‌తి నివేద‌న‌… స‌ర్కారుకి అవ‌స‌ర‌మా, పార్టీకి అవ‌స‌ర‌మా..?

సెప్టెంబర్ 2 నిర్వహించాలనుకున్న ప్రగతి నివేదన సభకు తెరాస భారీ ఏర్పాట్లు చేస్తోంది. హైద‌రాబాద్ లోని కొంగ‌ర్ క‌లాన్ ప్రాంతంలో నిన్న‌నే భూమి పూజ చేశారు. ఇవాళ్ల సీఎం స్వ‌యంగా ఏర్పాట్ల‌పై స‌మీక్షిస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రులూ ఎమ్మెల్యేలు ఇదే ప‌నిలో ఉన్నారు. దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఇంత పెద్ద బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌లేద‌న్న‌ట్టుగా ప్ర‌గ‌తి నివేద‌న ఉండాల‌ని ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగేళ్ల కేసీఆర్ పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నదే ఈ స‌భ ముఖ్యోద్దేశం అంటున్నారు. అయితే, ఆగ‌స్టు 15న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వప‌రంగా కొన్ని విష‌యాల‌ను మాత్ర‌మే చెప్ప‌గ‌లిగార‌నీ, పార్టీప‌రంగా తెరాస చేసిందీ 2019 త‌రువాత చెయ్య‌బోతున్న‌దీ చెప్పేందుకు ఈ స‌భ అంటున్నారు. ఇంకోటి, నాలుగున్న‌రేళ్ల పాల‌న‌పై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కి స‌మాధానం కూడా ఈ వేదిక మీద నుంచే ఉంటుంది అంటున్నారు!

అంతా బాగానే ఉందిగానీ… ఇంత‌కీ ఈ ప్ర‌గ‌తి నివేదన స‌భ తెలంగాణ ప్ర‌భుత్వ అవ‌స‌ర‌మా..? తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ అవ‌స‌ర‌మా అనేదే చ‌ర్చ‌నీయాంశం! చేసిన కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌త్యేకంగా స‌భ‌లు పెట్టి మరీ ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన అవ‌స‌రం ఏముంటుంది..? ప్ర‌భుత్వం పాల‌న బాగుంటే… ఆ ప్ర‌తిఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందుతాయి క‌దా! దాంతో పాల‌న ఎలా ఉందో ప్ర‌జ‌ల‌కు స‌హజంగానే ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. దానికి ప్ర‌త్యేకంగా నివేదిక‌లంటూ ఎందుకు..? ప్ర‌భుత్వం ఎలా పాలిస్తోందో ప్ర‌జ‌ల‌కు నివేదిక‌లు ఇవ్వ‌క్క‌ర్లేదు, ప్రభుత్వ పనితీరును వారు గ‌మ‌నిస్తూనే ఉంటారు క‌దా! ప్ర‌జ‌ల‌కు ప్రతీదీ అర్థ‌మౌతూనే ఉంటుంది. అయినా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని తీర్చ‌డం, వాటికోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డమే క‌దా ప్ర‌భుత్వాల బాధ్య‌త‌. ‘ఇదిగో మేం మీకోసం చాలా చేశాం’ అంటూ సొంత ప్రోగ్రెస్ కార్డుల‌ను చూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది..?

ఈ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌… పార్టీగా తెరాస అవ‌స‌రంగానే క‌నిపిస్తోంది. ఈ స‌భ‌లో కొత్త సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌లు ఉండొచ్చ‌నీ, ఓ ముప్పై మంది వ‌ర‌కూ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న కూడా ఉంటుంద‌నే ప్ర‌చారం పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఇదంతా తెరాస అవసరం. ఇక‌, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు బాగా తొంద‌ర‌ప‌డుతున్న‌దే కేసీఆర్! సాధ్యాసాధ్యాల‌పై సందిగ్ధం ఎలా ఉన్నా… ఆయ‌న సిద్ధ‌ప‌డుతున్న తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఓప‌క్క ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ఏర్పాట్లు చేస్తూనే… ఈరోజు ఢిల్లీకి మ‌ళ్లీ బ‌య‌లుదేరుతున్నారు! ఇప్పుడెందుకంటే… రాష్ట్రానికి సంబంధించి ఇష్యూస్ పై మాట్లాడ‌టానికి వెళ్తున్నారు అని అంటున్నారు! నిజానికి, ఈ మ‌ధ్య‌నే క‌దా ఢిల్లీ వెళ్లొచ్చింది? అప్పుడు కూడా అవేగా మాట్లాడింది. రాష్ట్రంలో ఇంత భారీ బ‌హిరంగ స‌భ ముందుపెట్టుకుని… తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రాజ‌కీయాల‌కు తప్ప వేరే అంశాలకు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని ఎవరైనా అనుకుంటారా..? సో… ఈ ప్ర‌గ‌తి నివేద‌న స‌భలో ప్ర‌భుత్వ అవ‌స‌రం కంటే… తెరాస రాజ‌కీయ అవ‌స‌రాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయనే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com