మేకింగ్ ఆఫ్ మహాకూటమి..! తెలంగాణలో ద్విముఖ పోటీలేనా..?

తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా వేలు పెట్టుకుండా.. మిగతా వ్యవహారాలన్నింటినీ చంద్రబాబు సాలిడ్‌గా డీల్ చేస్తున్నారు. అంతా టీ టీడీపీ నేతలపై పెట్టేసి ఆయన విజయవాడ వెళ్లిపోయారు. కానీ పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ మాత్రం.. ఇచ్చి వెళ్లారు. ఎప్పుడు ఏం చేయాలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దాని ప్రకారం.. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదు. కానీ మహాకూటమిలో భాగంగా ఉంటుంది. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీ మాత్రమే. ఆ కూటమి టీడీపీ, సీపీఐ, కోదండరాం తెలంగాణ జనసమితితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా భాగంగా ఉంటుంది. కలసి వస్తే.. సీపీఎంను కూడా కలుపుకుంటారు. కానీ సీపీఎం మాత్రం జనసేనతో పొత్తు కోసం.. ఇప్పటికీ… ఎదురు చూస్తూ ఉంది.

ఎన్నికల కోసం చంద్రబాబు టీ టీడీపీకి మూడు కమిటీల్ని నియమించారు. వాటి పని ప్రారంభించాయి. పొత్తుపై సంప్రదింపులకు ఎల్‌.రమణ నేతృత్వంలో ఏడుగురితో కమిటీ వేశారు. ఈ పనుల్లో ఎల్.రమణ తీరిక లేకుండా మంతనాలు జరుపుతున్నారు. సీపీఐ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టీడీపీతో కలిసి సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. సంఖ్యాపరంగా ఎక్కువగా కోరుకోమని.. గెలిచే స్థానాలే అడుగుతామని ఆయన చెప్పారు. దీంతో తెలంగాణలో టీడీపీ, సీపీఐ పొత్తు ఖరారైంది. అదే సమయంలో.. మహా కూటమి కావాలనుకుంటున్నామని చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ఇంకా తమతో కలిసి వచ్చే పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతామన్నారు. రెండు రోజుల పాటు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి.. మహాకూటమికి ఓ రూపు తెస్తామని ఎల్.రమణ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌తోనూ పొత్తుపై సంప్రదింపులు జరుపుతామని రమణ స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో టీ టీడీపీ నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ తమకు ఇచ్చారని రమణ స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ కోసం చంద్రబాబు అవసరమైన చోట ప్రచారంలో కూడా పాల్గొంటారని ఎల్.రమణ ధీమా వ్యక్తం చేశారు. కోదండరాం తెలంగాణ జనసమితి కూడా.. పొత్తులపై ఆసక్తితో ఉంది. టీడీపీ నేతలతో ఆయన ఓ విడత ఇప్పటికే చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనధికారికంగా.. కూటమిపై కసరత్తు పూర్తయినా.. పద్దతి ప్రకారం నిర్మించుకుంటూ రావాలనుకుంటున్నారు సంప్రదింపులు జరుపుతున్నారు. రెండు, మూడు రోజుల్లో మహాకూటమి పై క్లారిటీ వస్తుంది. ఈ వ్యవహారాల్లో చంద్రబాబు పాత్ర ఎక్కడా బహిరంగంగా ఉండదు. అంతా గాడ్ ఫాదర్‌లా పర్యవేక్షిస్తారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. వచ్చే ఎన్నికల్లో.. బహుముఖ పోటీలు ఉండవని.. కేవలం టీఆర్ఎస్ వర్సెస్… మహాకూటమి అన్నట్లుగానే సాగుతుందని రాజకీయ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com