రివ్యూ: ఉంగ‌రాల రాంబాబు

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

సునీల్ నుంచి ప్రేక్ష‌కులు ఆశించేది కామెడీనే. కానీ ఆయ‌న అది త‌ప్ప మిగ‌తా అన్నీ చేసేస్తున్నాడు. ద‌ర్శ‌కులు కూడా ఇటీవ‌ల ఆయ‌న‌తో ఒకే ర‌క‌మైన సినిమాలు తీస్తున్నారు. అందుకే వ‌రుస ప‌రాజ‌యాలు. అయితే సునీల్‌తో క్రాంతిమాధ‌వ్ అన‌గానే అంద‌రిలో ఓ చిన్న ఆశ పుట్టింది. ఈసారైనా సునీల్‌ని కొత్త‌గా చూడొచ్చు, ఈయ‌న ఓ కొత్త క‌థ‌లో చూపిస్తాడ‌నేది ఆ ఆశ‌. కానీ ఆయ‌న మాత్రం `సునీల్‌తో అంద‌రూ ఒక‌లాంటి సినిమాలే తీసి, నేను మాత్రం అందుకు భిన్నంగా చేస్తే మాట రాదూ` అనుకొన్న‌ట్టున్నాడు. అందుకే ఆయ‌న రొటీన్ ప్ర‌య‌త్నానికే పూనుకొన్నాడు. కాదు కాదు… సునీల్ చేసిన సినిమాల్నే మ‌ళ్లీ పిండేసి క‌థ వండుకొన్నాడు. సునీల్ ఇటీవ‌ల చేస్తున్న సినిమాలే రుచీ ప‌చీలేకుండా ఉంటాయి. ఇక వాటిని కూడా పిండి ర‌సం తీశాక `ఉంగ‌రాల రాంబాబు`లాంటి సినిమాలు కాక ఇంకేమొస్తాయి? ఇంత‌కీ క‌థేంటో చూద్దాం…

* క‌థ‌

రాంబాబు (సునీల్) బాగా డ‌బ్బున్న ఇంట్లో పెరిగిన కుర్రాడు. 200 కోట్ల ఆస్తికి వార‌సుడున్న మాటే కానీ… త‌న తాత చ‌నిపోయాక ఆ ఆస్తుల‌న్నీ అప్పుల రూపంలో వెళ్లిపోతాయి. రాంబాబు రోడ్డుపైకి వ‌చ్చేస్తాడు. ఎలా బ‌త‌కాలా అని ఆలోచిస్తూనే బాదం బాబా (పోసాని) అనే ఓ బురిడీ బాబా ఆశ్ర‌మంలోకి అడుగుపెడ‌తాడు. రాంబాబు సూటూబూటూ చూసి గ‌ట్టి పార్టీ త‌గిలింద‌నుకొటాడు బాదం. నువ్వు మహ‌ర్జాత‌కుడివి అని న‌మ్మిస్తాడు. తీరా త‌న ద‌గ్గ‌ర ఏమీ లేద‌ని రాంబాబు చెప్ప‌డంతో వెళ్లి బాదం చెట్టుని నాటు అని పంపిస్తాడు. స్వామి చెప్పినట్టుగానే నాగుపాములు తిరుగాడే చోట చెట్టు నాటే ప్ర‌య‌త్నం చేస్తాడు రాంబాబు. ఇంత‌లో అక్క‌డే 200 కోట్లు విలువ చేసే బంగారం దొరుకుతుంది. దాంతో బాబానే స‌ర్వ‌స్వంగా భావిస్తాడు రాంబాబు. తాను ట్రావెల్స్ కంపెనీ పెట్టి ప్ర‌తి విష‌యం కూడా బాబా చెప్పిన‌ట్టే చేస్తుంటాడు. వ్యాపారంలో చికాకులొస్తుండ‌డంతో మ‌ళ్లీ బాబాని సంప్ర‌దిస్తాడు. ఫ‌లానా న‌క్ష‌త్రం ఉన్న అమ్మాయిని చేసుకొంటే నీకు క‌లిసొస్తుందంటాడు. ఆ న‌క్ష‌త్రంగ‌ల అమ్మాయి త‌న మేనేజ‌ర్ సావిత్రి (మియా జార్జ్‌) అని తెలిసి ఆమెని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలంటే మాత్రం త‌న తండ్రి రంగానాయ‌ర్ (ప్ర‌కాష్‌రాజ్‌) ఒప్పుకోవ‌ల్సిందే అంటుంది సావిత్రి. కేర‌ళ‌లో క‌మ్యూనిస్టు భావాల‌తో బ‌తికే రంగానాయ‌ర్‌ని ఒప్పించ‌డం అంత సుల‌భం కాదు. కానీ తాను ఒప్పిస్తాన‌ని అక్క‌డికి వెళ‌తాడు. మ‌రి అక్క‌డికెళ్లాక రాంబాబుకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి? రాంబాబు, సావిత్రిల పెళ్లి జ‌రిగిందా? ఇంత‌కీ రాంబాబుకి దొరికిన 200కోట్ల బంగారం ఎవ‌రిది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌

ఓన‌మాలు, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజులాంటి మంచి సినిమాలు చేసిన క్రాంతిమాధ‌వ్ నుంచి పాచిపోయిన ఫార్ములా క‌థ వ‌స్తుంద‌ని ఎవ‌రైనా ఊహిస్తారా? చేసి చేసి క‌థానాయ‌కుల‌కే విసుగొచ్చిన పాత్ర‌ని సునీల్ మ‌రోసారి చేస్తాడ‌ని, అది మ‌నం చూస్తామ‌ని ఎవ‌రైనా అనుకొంటారా? కానీ `ఉంగ‌రాల రాంబాబు`తో అదే జ‌రిగింది. సినిమా మొత్తం అంజ‌నం వేసి వెదికినా ఒక్క‌టంటే ఒక్క స‌న్నివేశంలోనూ కొత్త‌ద‌నం క‌నిపించ‌దంటే అతిశ‌యోక్తి కాదు. క‌ట్ చేస్తే పాట‌లు, క‌ట్ చేస్తే ఫైట్లు. పాత్ర‌ల తీర్చిదిద్దిన విధానంలోనే లోపాలున్న‌ప్పుడు ఇక న‌టీన‌టులు ఎంత చేసినా ఏం ప్ర‌యోజ‌నం? సునీల్‌, ప్ర‌కాష్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌…. ఇలా అంద‌రూ చేసుకొంటూ వెళ్లిపోయారు. కానీ ఆ పాత్ర‌లు మాత్రం రుచిప‌చీ లేకుండా తెర‌పై ద‌ర్శ‌న‌మిస్తాయి. క‌థ‌లో కొత్త‌ద‌నం లోపించిన విష‌యం ఒక్క‌టే కాదు.. క‌థ‌నంలో కూడా లోపాలే. ఏ పాత్ర ఎప్పుడు తెర‌పై క‌నిపిస్తుందో, ఎప్పుడు మాయ‌మై మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుందో అర్థం కాదు. ఉన్న‌ట్టుండి క‌థ దుబాయ్‌కి వెళుతుంది. ఆ వెంట‌నే కేర‌ళ వెళుతుంది. మ‌రోప‌క్క 200 కోట్ల బంగారం త‌న‌దే అంటూ రౌడీ ఆశిష్ విద్యార్థి తిరుగుతుంటాడు. అది తీసుకొన్న హీరో క‌ళ్ల ముందే ఉన్నా, త‌న ఆస్తినంతా వేరొక‌రికి రాసిస్తున్నా చూస్తూ అలా ఉండిపోతాడు. ఇలా ఏదీ కూడా క‌థ‌కి అతికిన‌ట్టుగా అనిపించ‌దు. పాత క‌థ‌ని కూడా ఎక్క‌డో ఒక చోట ఏదో ర‌కంగా కాస్త ఆస‌క్తిగా చెప్పే ఆస్కారం ఉంటుంది. కానీ ద‌ర్శ‌కుడు ఆ విష‌యంలోనూ విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌థమార్థంలోనే స‌న్నివేశాల‌న్నీ తేలిపోయాయి. దాంతో బ‌య‌టికొచ్చి బ‌తుకుజీవుడా అనుకొనేవాళ్లు చాలామంది. కానీ క్రాంతిమాధ‌వ్ ఎక్క‌డో ఒక చోట ఏదో ఒక చిన్న మేజిక్ అయినా చేయ‌క‌పోతాడా అని కూర్చున్న‌వాళ్లు మాత్రం దొరికిపోయిన‌ట్టే. ద్వితీయార్థంలో స‌న్నివేశాలు క‌మ్యూనిస్టు రంగు పులుముకోవ‌డంలో కాస్త కొత్త‌ద‌నం క‌నిపిస్తుంది మిన‌హా , వాటి సారం మాత్రం అరిగిపోయిన ఫార్ములాకి మ‌క్కీకి మ‌క్కీకి. సునీల్ ఇలాంటి క‌థల్ని ఇక‌నైనా ప‌క్క‌న పెట్టాల్సిందే.

* న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌

ఒక చెత్త పాత్ర‌లో ఎంత చేసినా ఏం ప్ర‌యోజ‌నం. సునీల్ విష‌యంలో అదే జ‌రిగింది. త‌న ప్ర‌య‌త్న లోపం లేకుండా పాత్ర కోసం ఏం కావాలో అందంతా చేస్తుంటాడు సునీల్‌. కానీ ఫ‌లితం మాత్రం క‌నిపించ‌దు. మియా జార్జ్ అందంగా క‌నిపించింది. త‌న పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించింది. బాదం బాబాగా పోసాని, రంగానాయ‌ర్‌గా ప్ర‌కాష్‌రాజ్ బాగా న‌టించారు. ఇక మిగిలిన పాత్ర‌ల గురించి చెప్పుకోవ‌ల్సినంత ఏమీ లేదు. సాంకేతిక‌రంగా సినిమా దారుణంగా ఉంది. మొద‌ట ద‌ర్శ‌కుడి నుంచే మొద‌లుపెట్టాలి. క‌థ‌, క‌థ‌నాలు ఏమాత్రం అత‌క‌లేదు. మాట‌లు అంతంత‌మాత్ర‌మే. ఛాయాగ్ర‌హ‌ణం మాత్రం బాగుంది. సంగీతం ప‌రంగా ఒక్క‌టంటే ఒక్క పాట కూడా క్యాచీగా లేదు. బీజీఎమ్ కూడా నామ‌మాత్ర‌మే. కూర్పు కూడా కుద‌ర్లేదు. నిర్మాణ విలువ‌లు ఫ‌ర్వాలేదు.

* ఫైన‌ల్ ట‌చ్: రాంబాబు పాతోడే.. అత‌డి ఉంగరాలూ పాత‌వే

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close