అర్జున్ రెడ్డి ట్రైల‌ర్ : ఈసారి ఎమోష‌న్‌తో కొట్టాడు


అర్జున్ రెడ్డి ప్ర‌స్తావ‌న ఎప్పుడొచ్చినా… ఘాటు ముద్దు సీన్లే గుర్తొస్తాయి. ఇది వ‌ర‌క‌టి ప్ర‌చార చిత్రాల్లో లిప్ లాక్‌ల‌తో అద‌ర‌గొట్టేశాడు అర్జున్‌రెడ్డి. అస‌లు ఈ సినిమాపై ఫోక‌స్ అమాంతం పెరిగిపోయిందంటే దానికి లిప్ లాక్‌లే ప్ర‌ధాన కార‌ణం. ట్రైల‌ర్‌లో ఇంకెన్ని ఘాటు సీన్లు ఉంటాయో అని ఆశ‌ప‌డ్డారంతా. అయితే.. అంచ‌నాల‌కు భిన్నంగా ఎమోష‌న‌ల్ ట్రైల‌ర్ క‌ట్ చేశాడు ద‌ర్శ‌కుడు. సాధార‌ణంగా ట్రైల‌ర్‌లో బోల్డ‌న్ని షాట్స్ ఉంటాయి. సినిమాలో కంటెంట్‌ని చెప్పీ, చెప్ప‌కుండా క‌ట్ చేస్తారు. అయితే.. అర్జున్ రెడ్డి ట్రైల‌ర్‌లో దాదాపుగా ఓ సీన్ మొత్తం చూపించేశాడు ద‌ర్శ‌కుడు. క్లాస్ రూమ్ లో మేడ‌మ్‌కి అర్థం కాకుండా.. అచ్చ‌మైన తెలుగులో మిగిలిన స్టూడెంట్స్‌కి త‌న ల‌వ‌ర్ గురించి అర్జున్ రెడ్డి వార్నింగ్ ఇచ్చే సీన్ అది. సినిమా ఎంత ల‌వ‌బుల్‌గా ఉండ‌బోతోందో.. ఈ సీన్ చూస్తే అర్థం అవుతుంది. ప్రేమ‌, అల్ల‌రి, కోపం, విర‌హం, విషాదం – అర్జున్ రెడ్డి సినిమా వీటి చుట్టూనే తిర‌గ‌బోతోంద‌న్న హింట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. విజ‌య్ దేవ‌ర‌కొండ తెలంగాణ యాస‌లో మ‌ళ్లీ అద‌ర‌గొట్టేశాడు. పెళ్లి చూపులు, ఫిదాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నీ తెలంగాణ యాస‌లో మాట్లాడాయి. ఆసెంటిమెంట్‌ని అర్జున్ రెడ్డి కూడా కొన‌సాగించ‌బోతున్నాడ‌ని అర్థ‌మైంది. మొత్తానికి టీజ‌ర్ హాట్ హ‌ట్‌గా ఉంటే, ట్రైల‌ర్ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగింది. అయినా… ఈ సినిమాపై అంచ‌నాలేం త‌గ్గ‌వు. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com