రివ్యూ : ద‌క్షిణాది జేమ్స్‌బాండ్ ‘వివేకం’

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

కొట్టుకోవ‌డం, చంపుకోవ‌డం, నరుక్కోవ‌డం ఇవ‌న్నీ ప్ర‌తీ యాక్ష‌న్ సినిమాలోనూ ఉంటాయి. కాక‌పోతే.. దాన్ని స్టైలీష్‌గా చూపిస్తూ, దానికి ఇంకాస్త క్రియేటివిటీ జోడిస్తూ, ఆ కొట్టుకోవ‌డానికీ, చంపుకోవ‌డానికీ, కాల్చుకోవ‌డానికీ ఓ బ‌ల‌మైన కార‌ణం చూపెడితే… క‌చ్చితంగా యాక్ష‌న్ సినిమాల్ని చూస్తారు ఆద‌రిస్తారు. మ‌న తెర‌ల‌పై కథానాయ‌కుడు ఎప్పుడూ అరివీర భ‌యంక‌రుడే. కాక‌పోతే అత‌ని శ‌క్తుల్ని వాడుకోవ‌డానికీ చూపించుకోవ‌డానికి అంతే బ‌ల‌మైన ప‌రిస్థితులు చూపిస్తే బాగుంటుంది. అత‌న్ని ఢీ కొట్ట‌డానికి ఇంకా బ‌ల‌మైన శ‌త్రువుని సృష్టిస్తే.. ఇంకా బాగుంటుంది. అవ‌న్నీ ‘వివేకం’లో క‌నిపించాయి. ఈ సినిమాలో ఇంకేమున్నాయో తెలియాలంటే ఇంకాస్త లోతుల్లోకి వెళ్లాల్సిందే.

* క‌థ‌

ఏకే (అజిత్‌) ఇంటిలిజెన్స్ విభాగంలో ప‌నిచేస్తుంటాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా పోలీసుల‌కు, నిఘా వ్య‌వ‌స్థ‌ల‌కూ దొర‌క్కుండా త‌ప్పించుకొంటున్న తీవ్ర‌వాదుల్ని ప‌ట్టుకొని హ‌త‌మార్చ‌డం అత‌ని ప‌ని. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఓట‌మిని ఒప్పుకోడు. చావుతో కూడా పోరాడి గెల‌వ‌డం, బ‌త‌క‌డం నేర్చుకొన్నాడు. అత‌ని తెలివితేట‌ల ముందు ఎవ్వ‌రైనా బ‌లాదూరే! అలాంటి వ్య‌క్తిని, అలాంటి అధికారిని ఇంటిలిజెన్స్ విభాగం వెదుకుతూ ఉంటుంది. ఎందుకోసం..?? దాని ముందూ వెనుక‌ల క‌థేమిటి? ఏకే వృత్తి జీవితంలో ఎదురైన స‌వాళ్లు, ఎదుర్కోవాల్సివ‌చ్చిన శ‌త్రువులు ఎవ‌ర‌న్న‌దే `వివేకం` సినిమా.

* విశ్లేష‌ణ‌

చ‌ద‌రంగం ఆట‌లాంటి క‌థ ఇది. ఎత్తుగ‌డ‌లు ఎక్కువ‌. అయితే ఓ ఇబ్బంది ఉంది. చ‌ద‌రంగం ఆడేవాళ్ల‌కుండే ఆసక్తి చూసేవాళ్ల‌కూ ఉండాలంటే ఆ ఆట గురించి క్షుణ్ణంగా తెలిసుండాలి. లేక‌పోతే.. ఎందుకు ఆడుతున్నారో అర్థం కాదు. వివేకంలోనూ ఆ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. క‌థానాయ‌కుడు, ప్ర‌తి నాయ‌కుడు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు.. దాదాపుగా కంప్యూట‌ర్ భాష‌లో మాట్లాడేస్తుంటారు. ఓ మాట‌లో చెప్పాలంటే కంప్యూట‌ర్ కంటే అడ్వాన్స్‌గా ఉంటారు. ఆ తెలివితేట‌లు సామాన్య ప్రేక్ష‌కుల‌కు అర్థం అవుతాయా? స‌గ‌టు సినీ అభిమాని వాటిని ప‌ట్టుకోగ‌ల‌డా?? అనేదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఈ ఒక్క విష‌యం వ‌దిలేస్తే… ‘వివేకం’ అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో తీసిన సినిమా. బ‌హుశా క‌థానాయ‌కుడు అజిత్‌, ద‌ర్శ‌కుడు శివ‌ల ల‌క్ష్యం కూడా ఇదే కావొచ్చు. ఓ ద‌క్షిణాది జేమ్స్ బాండ్‌ని వాళ్లు తెర‌పై చూపిద్దామ‌నుకొన్నారు. ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. సినిమా అంతా రేసీగా సాగిపోతుంటుంది. క‌ళ్లు, మ‌న‌సు, చెవులూ… ఓకే చోట కేంద్రీక‌రించ‌క‌పోతే లాజిక్కులు మిస్ అయిపోతామేమో అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలో లాజిక్కుల‌తో పని లేదు. బాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలో లాజిక్కులు వెదుక్కొన్నామా, మానవ మాత్రుల‌కు సాధ్యం కాని విన్యాస‌లు జేమ్స్ బాండ్‌కి ఎలా సాధ్య‌మ‌య్యాయో ఆలోచించామా?? మ‌న తెర‌పై, మ‌న‌వాళ్లు ఓ సినిమా తీస్తే.. ఎందుకు లాజిక్కులు. కాబ‌ట్టి.. వాటిని కాస్త ప‌క్క‌న పెట్టి ఆలోచించాల్సిందే.

ఈ సినిమాలో విల‌న్ ఎవ‌రు? అనేది పెద్ద ట్విస్ట్ అనుకొన్నాడు ద‌ర్శ‌కుడు. కాక‌పోతే… అది స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఎప్పుడో క‌నిపెట్టేస్తాడు. తెలివిగా వ్య‌వ‌హ‌రించి, క‌థ‌ని కొత్త మ‌లుపులు తిప్పాల్సిన చోట ద‌ర్శ‌కుడు మామూలు స్థాయిలోనే ఆలోచించాడు. విల‌న్‌ని రివీల్ చేసే స‌న్నివేశం, క్లైమాక్స్‌లో కాజ‌ల్‌ని అడ్డుపెట్టుకొని అజిత్‌ని గెల‌వాల‌నుకొనే ప‌న్నాగం.. ఇవ‌న్నీ ఫ‌క్తు ద‌క్షిణాది స్టైల్‌లోనే సాగే సీన్లు. పైగా చొక్కా విప్పి కొట్టుకోవ‌డం కూడా ఇక్క‌డి స్టైలే. సినిమా అంతా ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో ఆలోచించిన శివ‌.. కొన్ని చోట్ల మాత్రం స‌హ‌జ సిద్ధ‌మైన ల‌క్ష‌ణాల్ని వ‌దులుకోలేకపోయాడు. అక్ష‌ర హాస‌న్‌ని వేటాడే ఎపిసోడ్‌, హీరో – విల‌న్ల మైండ్ గేమ్ ఈ సినిమాని మ‌రో స్థాయిలో చూపించాయి. మొత్తానికి మేకింగ్ ప‌రంగా, టేకింగ్ ప‌రంగా వంక పెట్ట‌లేని విధంగా వివేకం సినిమాని తీర్చిదిద్దారు.

* న‌టీన‌టులు

అజిత్ సినిమాకు అజిత్ కోస‌మే వేళ్తారు ఆయ‌న అభిమానులు. అందుకే ఈ సినిమాని అభిమానులు కోరుకొన్న‌ట్టు పూర్తిగా అజిత్ భుజాల‌పై వేసి న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. అజిత్ వ‌న్ మాన్ షో అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. ఓ స్టార్ హీరో త‌ప్ప ఈ క‌థ‌ని ఇంకెవ్వ‌రూ డీల్ చేయ‌లేరు. చేసినా.. జ‌నాలు న‌మ్మ‌లేరు. అందుకే అజిత్ కి ఈ సినిమా న‌ల్లేరుపై న‌డ‌కే అయ్యింది. కాజ‌ల్‌ది టిపిక‌ల్ హీరోయిన్ రోల్ కాదు. డ్యూయెట్ల కోసం రాసుకొన్న పాత్ర కాదు. ఆ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు క‌థ‌కు త‌గిన‌ట్టు వాడుకొన్నాడు. ఆఖ‌ర్లో ‘మౌస్ వాయిస్‌’తో స‌హా! వివేక్ ఓబెరాయ్‌ని చూడ‌డం కొత్త‌గానే అనిపించినా.. ఆ పాత్ర‌లో ‘నెగిటీవ్‌’ ముద్ర లేని న‌టుడ్ని ఎంచుకొంటే బాగుండేది. అక్ష‌ర హాస‌న్ పాత్ర చిన్న‌దే. కానీ.. క‌థ‌కు ఆమె కూడా మూల‌మే.

* సాంకేతికంగా

ఇది పూర్తిగా టెక్నిక‌ల్ టీమ్ సినిమా. వాళ్ల ప్ర‌తిభ అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. మేకింగ్ స్టైలీష్ గా ఉంది. సినిమా అంతా విదేశాల్లోనే. కాబ‌ట్టి ఆ లొకేష‌న్లు కొత్త‌గా క‌నిపిస్తాయి. స్టంట్ మాస్ట‌ర్ల‌కు ప‌ని ఎక్కువ దొరికింది. శివ ఈ క‌థ‌ని యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా చూపించాల‌నుకొన్నాడు. అయితే.. యాక్ష‌న్ డోసు బాగా ఎక్కువైంది. మ‌న ఊహ‌కు అంద‌ని విన్యాసాలు తెర‌పై జ‌రిగిపోతుంటాయి. స్క్రీన్‌పై గ్రాఫిక్సు క‌నిపించి మ‌రింత క‌న్‌ఫ్యూజ్ చేస్తుంటాయి.

* ఫైన‌ల్ ట‌చ్ : జేమ్స్ బాండ్ త‌ర‌హా సినిమాల్ని ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు, అజిత్ అభిమానుల‌కు.. ఈ సినిమా నిజంగా పండ‌గ‌లాంటిదే. త‌మిళంలో అజిత్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అది చాలు.. ఈ సినిమా అక్క‌డ నిల‌బ‌డిపోవ‌డానికి. మ‌రి తెలుగు ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తార‌న్న‌ది చూడాలి.

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.