నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు రావా..?

నాలుగు రాష్ట్రాలతో పాటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని .. అందులో ఒక్క ఇంచ్ సందేహం కూడా అవసరం లేదని… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆయన అంతటితో ఆగకుండా.. ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుంది.. ఎన్ని విడతల్లో ఎన్నికలు జరుగుతాయి.. ఎప్పుడు ఫలితాలొస్తాయో కూడా చెప్పారు. దానికి సాక్ష్యంగా.. తాను సీఈసీతో కూడా మాట్లాడానన్నారు. కానీ ఈ రోజు సీఈసీ ఓపీ రావత్ మాత్రం వేరేగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు ఆరు నెలల్లోగా నిర్వహించాల్సి ఉందన్నారు. నవంబర్, డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణ ఎన్నికలు నిర్వహిస్తామా లేదా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు.

ఎన్నికల షెడ్యూల్ విడదలయినట్లుగా కేసీఆర్ చేసిన ప్రకటన వివాదస్పదం అవుతోంది. కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎలా ప్రకటిస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ..సీపీఐ నేతలు.. ఎన్నికల సంఘాన్ని కలిశారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాసేపటికే… ఈసీ ఓ ప్రకటన చేసింది. నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణకు ఎన్నికలపై సందిగ్ధంలో ఉన్నట్లుగా ఓ ట్వీట్ చేశారు. తెలంగాణకు ఇప్పుడే ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమని సీఈసీ ఓపీ రావత్ ప్రకటించారు. 2002లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం…అసెంబ్లీ రద్దు చేసిన ఆరు నెలల లోపు ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉందన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ గడువు.. కొద్దిగా అటూ ఇటుగా ఈ ఏడాది చివరితో ముగిసిపోనుంది. దాంతో ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను రెడీ చేసింది. ఈవీఎంలు, వీవీ పాట్ మెషిన్ల ను సిద్ధం చేసుకుంటోంది.

ఇక వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరిగాయని.. కేసీఆర్ చాలా దీమాగా చెప్పారు. ఈసీని ఆదేశించడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఈసీని కేసీఆర్‌ అవమానించారన్నారు. ఈసీ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నప్పటికీ… తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిని ఇప్పటికే ఢిల్లీ పిలిపించారు. కేసీఆర్ ముందస్తుగా అన్నీ చక్క బెట్టుకునే అసెంబ్లీని రద్దు చేశారని.. విమర్శలు వస్తున్నాయి కాబట్టే.. ఈసీ అలాంటి ప్రకటన చేసింది కానీ… ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుగుతాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com