పట్టించుకోవాల్సిన క్యారెక్టర్‌ను కాదని జీవీఎల్ నిరూపించుకున్నారా..?

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఏమైనా మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే.. ఆయన అధికార ప్రతినిధి కాబట్టి .. దాన్ని పార్టీ అభిప్రాయంగా అందరూ పరిగణిస్తారు కాబట్టి. ఇదే గౌరవాన్ని.. నమ్మకాన్ని జీవీఎల్ నరసింహారావు.. ఆంధ్రప్రదేశ్‌లో అడ్డంగా పోగొట్టుకున్నారు. కొంత కాలంగా… ఏపీ ప్రభుత్వంపై అడ్డదిడ్డమైన ఆరోపణలు చేస్తూ.. నిరూపించమంటే.. “ఇదిగో కోర్టుకు వెళ్తాం.. అదిగో సీబీఐ విచారణ” చేయిస్తామని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్న ఆయన… చంద్రబాబు అమెరికా పర్యటనపైనా… లేనిపోని అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. దాని కోసం.. తన క్రెడిబులిటినీ తాకట్టు పెట్టారు.

చంద్రబాబునాయుడుకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం లేదని.. అంతా ఉత్తుత్తి ప్రచారమే చేసుకుంటున్నారని.. జీవీఎల్ మొదటగా ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి పంపిన ఆహ్వానాన్ని బయపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం అనుమానాలెందుకులే అని.. లేఖను బయటపెట్టింది. ఆ తర్వాత ఆ లేఖపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. చివరికి చంద్రబాబునాయుడు.. అమెరికా వెళ్లిన తర్వాత కూడా.. ఇక్కడ అసలు చంద్రబాబు పాల్గొనే కార్యక్రమ వివరాలేవీ వెబ్‌సైట్లలో లేవని ట్వీట్లు చేశారు. కానీ ఆయన… అనుకున్నట్లుగా.. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ముందుగా ప్రచారం జరిగినట్లు.. పెట్టుబడి లేకుండా చేసే సాగు గురించి ప్రపంచ దేశాలకు.. తన అనుభవాన్ని వివరించారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఓ ముఖ్యమంత్రికి దొరికిన అరుదైన గౌరవంగా అందరూ భావిస్తున్నారు. కానీ జీవీఎల్ ఎందుకు.. చంద్రబాబు పర్యటనపై.. ఇంత దారుణంగా.. తనకు మాత్రమే చేతనైనంత అబద్దాలతో.. కట్టుకథలతో.. ఇంకా తన భాషలో చెప్పాలంటే.. ఓ “భ్రమ రాజకీయాన్ని” ఎందుకు సృష్టించారు.

జీవీఎల్ నరసింహారావు వ్యక్తిగతంగా చేసిన అబద్దపు.. దొంగ ప్రచారం కాదు అది. నిజంగా తెలిసే.. ఓ ముఖ్యమంత్రి ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాన్ని ప్లాన్డ్‌గా చేశారనుకోవాలి. ఇంతకు ముందు చాలా ఆరోపణలు చేశారు. కానీ.. వాటికి మీడియా కానీ.. ఇతరులు కానీ.. ఓ గౌరవం ఇచ్చారు. ఏమో… జీవీఎల్ నిజమే చెబుతూ ఉండవచ్చని.. కానీ ఓ తెలుగువాడు.. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతూంటే.. దాన్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నం జీవీఎల్ ఎందుకు చేయాలి..? నరేంద్రమోడీకి అలాంటి ఆహ్వానం రాలేదని.. ఫీలయ్యారా..? లేక.. తాను గత నలభై ఏళ్లుగా ఏపీలో లేను.. ఏపీ ఎలా అయిపోయినా పర్వాలేదు… చంద్రబాబును దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారా..? ఎలాగూ ఏపీతో సంబంధాలు లేవు కాబట్టి.. ఇక్కడ చంద్రబాబుపై నైతికంగా బురదజల్లి.. మోడీ, షాల ప్రాపకంతో ఉత్తరాతిలో రాజకీయ జీవితం గడిపేద్దామనకున్నారా..? కారణం ఏదైనా కానీ… ఏపీ రాజకీయాలకు సంబంధించిన వరకు.. ఇక జీవీఎల్ పట్టించుకునే క్యారెక్టర్ కాదని మాత్రం తేలిపోయింది…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]