గ‌వ‌ర్న‌ర్ తో జ‌గ‌న్ భేటీ.. .టీడీపీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం నాడు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు. అయితే, రొటీన్ కు భిన్నంగా… త‌న అధికార వాహనాన్ని వ‌దిలేసి, వెంట ఎమ్మెల్యేల‌నుగానీ ఇత‌ర కీల‌క అనుచ‌రుల‌నిగానీ తీసుకెళ్ల‌కుండా, వేరే వాహ‌నంలో ఆయ‌న ఒక్క‌రే వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. జ‌గ‌న్ పై ఉన్న కేసుల విచార‌ణ‌పై హైకోర్టు స్పందించిన వెంట‌నే జ‌గ‌న్ ఇలా వెళ్ల‌డంపై తెలుగుదేశం నేతలు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎవ‌ర్ని క‌లిసినా మీడియా ముందుకు వచ్చి చెప్పే జ‌గ‌న్‌, గ‌వ‌ర్న‌ర్ తో ఎందుకు భేటీ అయ్యార‌నేది మాత్రం సీక్రెట్ గా ఉంచాల్సిన అవ‌స‌రం ఏముందంటూ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌శ్నించారు.

స‌హచ‌ర శాస‌న స‌భ్యుల‌ను వ‌దిలేసి, మీడియా మిత్రుల‌కు కూడా చెప్ప‌కుండా గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందో జ‌గ‌న్ వివ‌రించాలంటూ దేవినేని డిమాండ్ చేశారు. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎవ‌రో ఎక్స్‌, వై, జ‌డ్ అయితే తాము ప‌ట్టించుకునే వాళ్లం కాద‌నీ, రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప్ర‌జ‌ల‌ను ఏం ఉద్ధించాల‌న్న ఉద్దేశంతో రాజ్ భ‌వ‌న్ కు వెళ్లారంటూ దేవినేని విమ‌ర్శించారు. ‘గ‌తంలో రాజ్ భ‌వ‌న్ కు వెళ్లిన ప్ర‌తీసారీ మీడియా ముందు మాట్లాడావు క‌దా.. ఇప్పుడు ఎందుకు ముఖం చాటేశావ్’ అంటూ ఆయ‌న నిల‌దీశారు. జ‌గ‌న్ కేసుల‌పై రోజువారీ విచార‌ణ ఇక‌పై ఉంటుంద‌నే అవ‌కాశం ఉంద‌ని తేల‌డంతో క‌ల‌వర‌పాటు మొద‌లైంద‌నీ, అందుకే హుటాహుటిన గ‌వ‌ర్నర్ ద‌గ్గ‌ర‌కి వెళ్లారంటూ మ‌రికొంత‌మంది టీడీపీ నేత‌లు కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాదు, హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో పాద‌యాత్ర గురించిగానీ, న‌వ‌ర‌త్న ప‌థకాల హామీ గురించి కొన్నాళ్ల పాటు మాట్లాడ‌వ‌ద్దు అంటూ వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ సూచించిన‌ట్టు త‌మ‌కు తెలుస్తోంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

టీడీపీ విమ‌ర్శ‌ల‌పై వైసీపీ నుంచీ స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. హైకోర్టు తీర్పు నేప‌థ్యంలోనే గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కు జ‌గ‌న్ వెళ్లి ఉంటార‌నీ, ఎందుకంటే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయ‌నీ, ఆయ‌న ద్వారా ఏదైనా రాయ‌బార ప్ర‌య‌త్నం చేసి ఉండొచ్చ‌నేది కొంత‌మంది అభిప్రాయం. మొత్తానికి, గ‌తానికి భిన్నంగా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం, ఆ ర‌హ‌స్య భేటీ గురించి ఆయ‌న వివ‌రించ‌క‌పోవ‌డం, వైసీపీ వ‌ర్గాలూ స్పందించ‌క‌పోవ‌డం… ఒకింత ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు, ఇదే అంశంపై గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి కూడా ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కి రాక‌పోవ‌డంతో మ‌రింత చ‌ర్చ‌నీయంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.