రాష్ట్ర విభజన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను రగిల్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి రాయలసీమకు సాగునీరు, పారిశ్రామికాభివృద్ధి వంటి కీలక రంగాల్లో చేసిందేమీ లేని ఆ పార్టీ నేతలు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ప్రత్యేక రాయలసీ ‘ కార్డును తెరపైకి తెస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంపై విషం చిమ్ముతూ, డబ్బులన్నీ అక్కడే ఖర్చు చేస్తున్నారంటూ సీమ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అమరావతి – ఉమ్మడి ఆస్తి, విద్వేషం వద్దు
అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందినది కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆర్థిక వనరు. అక్కడ సృష్టించే ప్రతి రూపాయి, సంపద రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కనీస సత్యాన్ని విస్మరించి, కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజధానిని ఒక సాకుగా చూపుతున్నారు. ఇప్పటికే ఒకసారి ముక్కలైన రాష్ట్రాన్ని, మళ్లీ తమ స్వార్థ రాజకీయాల కోసం ముక్కలు చేసేందుకు సిద్ధపడటం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట .
అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది?
ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గానీ, ఉపాధి కల్పనలో గానీ వైసీపీ సర్కార్ ఘోరంగా విఫలమైంది. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను గాలికొదిలేసి, ఇప్పుడు సీమ ముసుగులో కొత్త నాటకానికి తెరతీసింది. గత ఎన్నికల్లో సీమ ప్రజలు వైసీపీకి కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగే సీట్లే ఇచ్చి తగిన బుద్ధి చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని నేతలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆ ఫలితాలు నిరూపించినా, వైసీపీ నేతలు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు.
ప్రజలను తక్కువగా అంచనా వేయొద్దు
కల్లిబొల్లి కబుర్లు చెప్పి, ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవచ్చని భావించడం ఆ పార్టీ నేతల భ్రమ మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి విద్వేషాలు రగిలిస్తే జనం హర్షించరు. ప్రాంతీయ చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకునే ఇటువంటి సంకుచిత రాజకీయాలకు కాలం చెల్లింది. కానీ వారి విభజన రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి.


