వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో రామాయణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీశాయి. శ్రీరాముడిని ఒక ప్రాంతానికి పరిమితం చేస్తూ, పురాణ గాథలకు విపరీత అర్థాలు ఆపాదిస్తూ ఆయన మాట్లాడిన తీరు కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో మెజార్టీ ప్రజలు ఆరాధించే దైవాలను కించపరచడం మేధావి లక్షణం అనిపించుకోదని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
వైరుధ్యాల మేధావితనం
కొద్ది రోజుల క్రితం తన తల్లి అంత్యక్రియలను క్రైస్తవ పద్ధతిలో నిర్వహించినప్పుడు ప్రకాష్ రాజ్‌ను కొందరు ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ.. తాను నాస్తికుడనైనా తన తల్లి విశ్వాసాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన వివరణ ఇచ్చారు. తల్లి నమ్మకాన్ని అంతలా గౌరవించే వ్యక్తి, మరి సమాజంలో మెజార్టీ ప్రజలు నమ్మే దేవుడిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. తన ఇంటి విషయానికి వస్తే ఒక న్యాయం, ఇతరుల విశ్వాసాల విషయానికి వస్తే మరో న్యాయం అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరును నెటిజన్లు ఎండగడుతున్నారు.
విమర్శా.. విద్వేషమా?
ఏదైనా సిద్ధాంతాన్ని లేదా రాజకీయ పార్టీని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ, ఒక మతం మూలాలను, వారు పూజించే దేవుళ్లను అవహేళన చేయడం విమర్శ కిందికి రాదు. రామాయణం వంటి ఇతిహాసాలను తప్పుగా చిత్రీకరించడం ద్వారా ఆయన సాధించాలనుకుంటున్న మేధోమథనం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక దేవుడు నచ్చకపోతే మౌనంగా ఉండే హక్కు ఉన్నప్పటికీ, ఆ దేవుడిని లేదా ఆ దైవాన్ని నమ్మే ప్రజలను కించపరిచే హక్కు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలో భాగం కాదు.
బాధ్యత మరిచిన నటుడు
కళాకారుడిగా ప్రకాష్ రాజ్‌కు ఎంతో గౌరవం ఉంది. కానీ, బాధ్యతాయుతమైన పదవిలో లేకపోయినా, సమాజంపై ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యక్తిత్వాన్ని బయట పెడుతోంది. కేవలం వార్తల్లో నిలవడానికో లేదా ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సామాజిక సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మేధావి అంటే సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా ఆలోచనలు రేకెత్తించాలి కానీ, ఇలాంటి అనవసర వివాదాలకు ఆజ్యం పోయకూడదు. కానీ ప్రకాష్ రాజ్ చేస్తోందే అది.
