నంద్యాల ఫ‌లితం.. వైకాపా, టీడీపీల‌కు చెరో పాఠం!

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అనూహ్య మెజారిటీ సాధించింది తెలుగుదేశం. ఈ విజ‌యంతో టీడీపీ శ్రేణులు మాంచి జోష్ లో ఉన్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి నంద్యాల ప్ర‌జ‌లు ఓట్లేశార‌ని మంత్రులూ నేత‌లు చెబుతున్నారు. మ‌రోప‌క్క వైకాపా శిబిరం మూగ‌బోయింది. లోట‌స్ పాండ్ లోని జ‌గ‌న్ కార్యాల‌యం ఎన్నిక‌ల ఫ‌లితాలు మొద‌లైన కాసేప‌టికే ఖాళీ అయిపోయింది. ఓట్ల లెక్కింపు పూర్త‌వ‌కుండానే నంద్యాల వైకాపా అభ్య‌ర్థి శిల్పా కూడా ఇంటికెళ్లిపోయారు! ఇంత‌కీ… ఈ ఫ‌లితం ఎవ‌రికి ఎలాంటి పాఠాలు చెప్పింది..? విజ‌యం ద‌క్కించుకున్న తెలుగుదేశం నంద్యాల ఫ‌లితం నుంచి ఏం నేర్చుకోవాలి..? ప‌రాజ‌య భారం మోస్తున్న వైకాపా ఎలాంటి పాఠం నేర్చుకోవాలి..? నిజానికి, ఈ విజ‌యంతో విశ్రాంతి తీసుకునే ప‌రిస్థితి తెలుగుదేశానికీ లేదు.. వైఫ‌ల్య భారంతో నిరాశ‌లో మ‌గ్గిపోవాల్సిన ప‌రిస్థితి వైకాపాకీ లేదు! రెండు పార్టీల‌కూ రెండు పాఠాలు నేర్పుతోందీ నంద్యాల ఫ‌లితం.

తెలుగుదేశం విష‌యానికొస్తే… ఈ ఎన్నిక‌ల్లో భూమా నాగిరెడ్డిపై ఉన్న సానుభూతితోపాటు, తెలుగుదేశం పార్టీ చేప‌ట్టిన అభవృద్ధి ప‌థ‌కాలే విజ‌యాన్ని తెచ్చిపెట్టాయ‌ని చెప్పుకుంటున్నారు. నిజ‌మే, అభివృద్ధి పేరుతో వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను నంద్యాల నియోజ‌క వ‌ర్గంపై గుమ్మ‌రించారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు హుటాహుటిన చేప‌ట్టారు. ఈ ప‌నుల‌కు ఫ‌లిత‌మే నంద్యాల విజ‌య‌మంటున్నారు. 2019లో కూడా ఈ అభివృద్ధే మ‌రోసారి అధికారాన్ని క‌ట్ట‌బెడుతుంద‌ని ఆశిస్తున్నారు. అయితే, నంద్యాల స్థాయిలోనే రాష్ట్రంలో ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి జ‌రుగుతోందా అనేది టీడీపీ విశ్లేషించుకోవాలి. ఈ ఉప ఎన్నిక ఒకే నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగింది కాబ‌ట్టి, స‌ర్వ‌శ‌క్తులూ ఇక్క‌డే కేంద్రీక‌రించారు. అభివృద్ధి ప‌నుల‌ను స‌మీక్షించారు. కానీ, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు రాష్ట్రంలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లోనూ ఒకేసారి వ‌స్తాయి. అంటే, అన్నింటా నంద్యాల స్థాయి అభివృద్ధిని చూపించాల్సి ఉంటుంది. అంటే, రాబోయే ఈ ఏడాదిన్న‌ర కాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజ‌క వ‌ర్గాల అభివృద్ధిపై ఎంతో శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోతేగానీ, గ‌ట్టెక్కే ప‌రిస్థితి ఉండ‌ద‌నేది టీడీపీ నేర్చుకోవాల్సిన పాఠం. నంద్యాల ఫ‌లితం టీడీపీ ముందుంచిన‌ పెద్ద స‌వాల్ ఇది!

ఇక‌, వైకాపా విష‌యానికొస్తే… ప్ర‌జ‌ల్లో ఉన్న‌ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ఒడిసిప‌ట్ట‌డంలో విపక్ష నేత ఫెయిల్ అవుతున్నారు. టీడీపీ మీద ఉన్న వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లోంచి రావాలి. ప్ర‌త్నామ్నాయంగా వైకాపా అనేది ప్ర‌జ‌ల‌కే క‌నిపించాలి. కానీ, జ‌గన్ నిర్వ‌హిస్తున్న కేంపెయిన్ ఎలా ఉంటుందంటే… త‌న వ్య‌క్తిగ‌త భావోద్వేగాల్లోంచి ప్ర‌జ‌ల‌ను స్పందింప‌జేయాల‌ని చూస్తున్నారు! ఎంత‌సేపూ చంద్ర‌బాబు నాయుడిపై వ్య‌క్తిగ‌త దాడికే దిగుతూ వ‌చ్చారు. ఒక త‌ట‌స్థ ఓట‌రును ఆలోచింప‌జేసే విధంగా, ప్ర‌భావితం చేసే విధంగా ఆయ‌న ప్ర‌సంగాలు ఉండ‌టం లేదు. గ‌డ‌చిన మూడున్న‌రేళ్లుగా విప‌క్షంగా ఉంటున్న‌ వైకాపా ఏం సాధించింద‌నే ప్ర‌శ్న ఒక‌టి ఉంటుంది. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని మ‌ధ్య‌లోనే వ‌దిలేశారు. రాష్ట్రంలోని ఉద్దానం కిడ్నీ బాధితులు, తుందుర్రు ఆక్వా రైతుల స‌మ‌స్య‌లు, అగ్రిగోల్డ్ బాధితులు, రాజ‌ధాని నిర్వాసితులు.. ఇలాంటి ప్ర‌జా స‌మ‌స్య‌లపై త‌మ‌దైన ముద్ర వేసుకోలేక‌పోయారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున వైకాపా సాగించిన తిరుగులేని పోరాటం ఇదీ అని బ‌లంగా చెప్పుకునేందుకు ఏదీ లేకుండా చేసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కూడా కేవ‌లం చంద్ర‌బాబు విమ‌ర్శించ‌డంపైనే ఆధార‌ప‌డ్డారు. రాబోయేది మ‌న ప్ర‌భుత్వం అని చెబుతూనే వ‌చ్చారు. రాబోయేది వైకాపా ప్ర‌భుత్వ‌మే కావొచ్చు… కానీ, ఎలా రావాలి, ఎందుకు రావాలి, వ‌స్తే ఫ‌లానా మేలు జ‌రుగుతుందీ అనే చ‌ర్చను ప్ర‌జ‌ల్లో బ‌లంగా తీసుకెళ్ల‌లేక‌పోతున్నారు. అలా తీసుకెళ్లేందుకు కావాల్సిన కంటెంట్ కూడా వైకాపా ద‌గ్గ‌ర లేద‌నే చెప్పాలి! నంద్యాల ఎన్నిక నుంచి ఆ పార్టీ నేర్చుకోవాల్సిన పాఠం.. ప్ర‌తిప‌క్షంగా తాము సాధించింది ఏంట‌నేది ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవడం, తెలుగుదేశం పార్టీకి ప్ర‌త్యామ్నాయం తామే అని ప్ర‌జ‌ల‌కు అనిపించేలా చేయ‌డం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.