‘అజ్ఞాత‌వాసి’ ర‌న్ టైమ్ కంగారు!

ర‌చ‌యిత‌లే ద‌ర్శ‌కులైతే ఓ స‌మ‌స్య క‌నిపిస్తుంటుంది. ‘ర‌న్ టైమ్‌’. ప్ర‌తీ స‌న్నివేశాన్నీ ప్రేమ‌తో రాసుకుంటారు క‌దా, చివ‌ర్లో ఎడిట్ చేయ‌డానికి మ‌న‌సొప్ప‌దు. త్రివిక్ర‌మ్‌కీ ఈ స‌మ‌స్య ఉంది. త‌న సినిమాలు లెంగ్తీగా ఉంటాయి. అజ్ఞాత‌వాసి సినిమా కూడా లెంగ్త్ ఎక్కువైంద‌ని తెలుస్తోంది. సోమ‌వారం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. నిడివి చూస్తే.. 2 గంట‌ల 42 నిమిషాల వ‌ర‌కూ వ‌చ్చింద‌ట‌. ఇప్ప‌ట్లో ఇది `భారీ సినిమా`నే అనుకోవాలి. రెండు గంట‌లు, రెండుంపావు గంట‌ల‌కు అల‌వాటు ప‌డుతున్నారు జ‌నాలు. సినిమా ఎంత బాగున్నా… లెంగ్త్ మ‌రీ ఎక్కువేతే బోర్ కొట్టే ప్ర‌మాదం ఉంది. విడుద‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. చివ‌రి నిమిషాల్లో ట్రిమ్ చేసుకోవొచ్చు. కానీ… త్రివిక్ర‌మ్ ఓ ప‌ట్టాన ట్రిమ్ చేయ‌డానికి ఒప్పుకోడు. ప్ర‌తీ డైలాగూ వినిపించాల్సిందే అంటాడు. మ‌రి ఈసారి ఈ స‌మ‌స్య నుంచి ఎలా గ‌ట్టెక్కుతాడో అనిపిస్తోంది. నిర్మాత మాత్రం ‘క‌నీసం ప‌ది నిమిషాలు ట్రిమ్ చేయండి’ అని అడుగుతున్నార్ట‌. త్రివిక్ర‌మ్ నుంచి ఎలాంటి స‌మాధానం రావ‌డం లేద‌ని తెలుస్తోంది. చివ‌రి సారి ఈ సినిమాని ప‌వ‌న్‌కి చూపించి, అప్పుడు నిడివి విష‌యంలో ప‌వ‌న్ ఏం చెబుతాడో చూద్దామ‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నాడ‌ట‌. ప‌వ‌న్ క‌త్తిరించ‌మంటే స‌రి.. లేదంటే.. 2 గంట‌ల 43 నిమిషాల సినిమానీ చూసేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.