రివ్యూ: అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ

తెలుగు360 రేటింగ్: 2.25/5

‘న‌మ్మ‌కం’ చాలా గొప్ప‌ది!
దాని గొప్ప‌ద‌న‌మేంటో…. ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ ప్రారంభ స‌న్నివేశాల్లోనే శ్రీ‌నువైట్ల కొన్ని డైలాగుల రూపంలో బ‌లంగా చెప్పాడు.
శ్రీ‌నువైట్ల‌పై కూడా అదే న‌మ్మకం. ఆగ‌డు లాంటి డిజాస్ట‌ర్ చేసిన శ్రీ‌ను… దూకుడులాంటి సూప‌ర్ హిట్ ఇవ్వ‌క‌పోతాడా అని..
మిస్ట‌ర్ లాంటి అట్ట‌ర్ ఫ్లాప్ సినిమా తీసిన శ్రీ‌ను.. ఢీ, రెఢీ లాంటి స్క్రిప్టు రాసుకోక‌పోతాడా అని.
ర‌వితేజ కూడా అదే న‌మ్మాడు.
మైత్రీ మూవీస్ ఇంకాస్త బ‌లంగా న‌మ్మింది.
మ‌రి శ్రీ‌ను న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడా? ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ల‌ని గెలిపించ‌గ‌లిగాడా?

క‌థ‌

అమ‌ర్ (రవితేజ‌) చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల్ని దూరం చేసుకుంటాడు. త‌న బాల్య‌మంతా జైల్లోనే గ‌డిచిపోతుంది. జైలు నుంచి బ‌య‌ట‌ప‌డిన అమ‌ర్‌… త‌న కుటుంబాన్ని నాశ‌నం చేసిన‌వాళ్ల‌పై ప‌గ తీర్చుకోవాల‌నుకుంటాడు. కానీ… త‌న‌లో ఓ డిజార్డ‌ర్ ఉంటుంది. ఒక్కోసారి అక్బ‌ర్ లా, ఇంకోసారి ఆంటోనీలా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. అమ‌ర్ అమ‌ర్‌లా ఉన్న‌ప్పుడే త‌న పగ గుర్తొస్తుంది. అక్బ‌ర్‌, ఆంటోనీలా మారిన‌ప్పుడు మాత్రం గుర్తుండ‌దు. ఇలా ఎందుకు జ‌రుగుతుంది? అమ‌ర్‌లో ఉన్న ఆ ఇద్ద‌రూ ఎవ‌రు? ఎందుకు వ‌స్తున్నారు? త‌న ప‌గ‌ని ఎలా తీర్చుకున్నాడు. అమ‌ర్ కి ప‌రిచ‌య‌మైన పూజ (ఇలియానా) ఎవ‌రు? ఆమెకున్న గ‌త‌మేంటి? ఇవ‌న్నీ తెలియాలంటే ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌

క‌థానాయ‌కుడికి ఓ బ‌ల‌మైన ప్ర‌తీకారం ఉంటుంది. త‌న‌లో అంతే బ‌ల‌మైన మాన‌సిక రుగ్మ‌త ఉంటుంది. త‌న బ‌ల‌హీన‌త‌ల్ని కప్పిపుచ్చుతూ… త‌న ప్ర‌తీకారం ఎలా తీర్చుకున్నాడ‌న్న‌ది ఈ క‌థ‌లోని కోర్ పాయింట్‌. బ‌హుశా ఈ ఐడియాకే ర‌వితేజ ఫ్లాటైపోవ‌డం, మైత్రీ మూవీస్ అడ్వాన్స్ ఇచ్చేయ‌డం జ‌రిగి ఉంటుంది. అయితే ఆ పాయింట్‌ని ఎలా తీయాలో అలా తీయ‌కుండా, ఎలా తీయ‌కూడ‌దో అలా తీసి.. అనుక్ష‌ణం ప్రేక్ష‌కుల్ని చిత్ర‌వ‌ధ‌కు గురిచేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ‘ఇది రివైంజ్ కాదు.. రిట‌ర్న్ గిఫ్ట్‌’ అంటుంటాడు హీరో. ఆ రివైంజ్‌.. ఆడియ‌న్స్ పైనా?? అనే అనుమానం బ‌లంగా వేస్తుంటుంది.

ఈ క‌థ‌లో ఉన్న దుర్మార్గం ఏమిటంటే…. ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జ‌రిగి ఉంటుందో, అమ‌ర్ ఎవ‌రో, అక్బ‌ర్ ఎవ‌రో, ఆంటోనీ ఎవ‌రో, అస‌లు ఇలియానా అలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తుంటో… అంద‌రికీ ముందే తెలిసిపోతుంది. ద‌ర్శ‌కుడు మాత్రం అలా తెలిసిపోయిన పాయింట్‌నే ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జెప్పాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు. మ‌ధ్య‌లో క‌ట్ షాట్లు, ఫ్లాష్ బ్యాక్ సీన్లూ వేస్తూ, ఎఫ్ బీ ఐ ఆఫీస‌ర్ చేత ఇన్విస్టిగేష‌న్ చేయిస్తూ.. ‘వెనుక ఏం జ‌రిగిందో తెలుసా?’ అన్నంత బిల్డ‌ప్ ఇస్తుంటాడు. ‘అరె… అదంతా మాకు తెలిసిపోయిందిరా..’ అన్నా వినిపించుకోడు. చిక్కు ముడి ముందే విప్పేసి.. ఆ త‌ర‌వాత తీరిగ్గా అస‌లు ఈ చిక్కు ముడి ఎలా ప‌డిందంటే… అంటూ మ‌ళ్లీ వేసుకుంటూ వెళ్ల‌డం ఏ త‌రహా స్క్రీన్ ప్లేనో శ్రీ‌నువైట్ల‌కే తెలియాలి.

బ‌హుశా క‌ల్యాణ్ రామ్ న‌టించిన‌ `అత‌నొక్క‌డే` అనే సినిమా ప్రపంచం అంతా చూసినా శ్రీ‌నువైట్ల ఒక్క‌డే చూసి ఉండ‌డు. హీరో హీరోయిన్లు చిన్న‌ప్పుడే విడిపోవ‌డం, త‌మ‌కు అన్యాయం చేసిన‌వాళ్ల‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకోడం అక్క‌డి పాయింటే. దానికి `ఐడెంటిటీ డిజార్డ‌ర్‌` జోడించాడంతే. అద్దం ప‌గిలితే… అమ‌ర్ అయిపోవ‌డం, మంట గుర్తొస్తే… ఒక పాత్ర‌లోంచి మ‌రో పాత్ర‌లోకి జంప్ అయిపోవ‌డం- ఎంత రీజ‌న్ లెస్‌గా అనిపిస్తాయో, తెర‌పై అంత సిల్లీగా తీశాడు ద‌ర్శ‌కుడు. ఓ మామూలు రివైంజ్ డ్రామాకు అమెరికా నేప‌థ్యం, స్ప్రిట్ ప‌ర్స‌నాలిటీ జోడించి నేనేదో కొత్త పాయింట్ రాసుకున్నా అని సంబ‌ర‌ప‌డిపోయాడు శ్రీ‌ను. దాన్ని త‌న‌దైన స్టైల్‌లో తీయాల‌న్న తాప‌త్ర‌యంతో ‘వాటా’ లాంటి ఎపిసోడ్లు పేర్చుకుంటూ వెళ్లాడు. శ్రీ‌ను సినిమాలో కామెడీ చాలా బాగుంటుంది. అత‌ని సెన్సాఫ్ హ్యూమ‌ర్ స‌న్నివేశాల్ని నిల‌బెడుతుంటుంది. కానీ.. ఈ సినిమాలో అవేం క‌నిపించ‌లేదు. ‘వాటా’ ఎపిసోడ్ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. పోనీ న‌వ్వించిందా అంటే అదీ లేదు. క్రికెట్ బెట్టింగ్ సీన్‌, చివ‌ర్లో ఇన్వెస్టిగేష‌న్ కామెడీ రెండూ తేలిపోయాయి. అయిపోయిన మ్యాచ్‌కి ఎవ‌డైనా బెట్టింగ్ వేసుకుంటాడా? తెర‌పై మ్యాచ్ చూపించాల‌నుకున్న‌ప్పుడు ఛాన‌ల్ లోగో కింద‌ ‘లైవ్’ ఉందో లేదో కూడా చూసుకోరా?? శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు ఇదో మ‌చ్చుతున‌క‌.

ఈ సినిమా నూటికి నూరుపాళ్లూ అమెరికాలో తీశాం అని చిత్ర‌బృందం గొప్ప‌గా చెప్పుకుంది. కానీ హైద‌రాబాద్‌లోని లోక‌ల్ సెవెన్ స్టార్ హోటెళ్ల‌లో సీన్లు లాగించేసి, వెనుక బ్లూ మేట్‌లు పెట్టి చాలా క‌వ‌ర్ చేశారు. అదంతా నిర్మాత‌ల ట్రిక్కు. కాక‌పోతే.. ఈ క‌థ‌ని అమెరికాలోనే ఎందుకు తీయాలి? అనే ప్ర‌శ్న క‌థ వింటున్న‌ప్పుడే నిర్మాతలు వేసుకుంటూ ఇలా చీటింగ్ చేయాల్సిన అవ‌స‌ర‌మే ఉండేది కాదు.

న‌టీన‌టులు

మూడు పాత్ర‌లూ చేసింది ఒక్క‌డే అని ముందే తెలిసిపోయిన‌ప్పుడు, తెర‌పై క‌నిపిస్తోంది మూడు పాత్ర‌లు కాదు, ముగ్గురూ ఒక్క‌డే అని హింట్ దొరికేసిన‌ప్పుడు అవి మూడు పాత్ర‌లైనా ముఫ్ఫై మూడు పాత్ర‌లైనా వెరైటీ క‌నిపించ‌దు. అక్బ‌ర్‌లా ర‌వితేజ హిందీ మాట్లాడుతుంటే… మ‌రీ రోత‌గా అనిపిస్తుంది. ఆంటోనీ పాత్ర‌లోకి మారినప్పుడు అవ‌స‌ర‌మైన దానికీ, కాని దానికీ ప‌ళ్లు ఇకిలిస్తుంటే.. అంతే ఇబ్బందిగా ఉంటుంది. ర‌వితేజ‌లోని ఎన‌ర్జీని ద‌ర్శ‌కుడు స‌రిగా వాడుకోలేద‌నిపిస్తుంది. ఒక్క అమ‌రే… డీసెంట్‌గా ఉన్నాడు. ఇలియానా బొద్దుగా మారింది. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తొలి సీన్ల‌లో ఒక‌లా, చివ‌రి సీన్ల‌లో మ‌రోలా ఉంది. సునీల్ మ‌రీ బొద్దుగా ఉన్నాడు. ‘నీకో స్టెప్ ఇస్తాం లేవ‌య్యా..’ అని ఈ సినిమాలో పాత్ర‌కి ఒప్పించి ఉంటారు. క‌మెడియ‌న్‌గా ఉంటే.. ఎన్ని దెబ్బ‌లు తినాలో (ఆఖ‌రికి హీరోయిన్‌తో కూడా) సునీల్‌కి మ‌ళ్లీ తెలిసొచ్చుంటుంది. ఉండ‌డానికి కామెడీ గ్యాంగ్ చాలానే ఉంది. వాళ్ల‌లో వెన్నెల కిషోర్‌కే కాస్త న‌వ్వించే అవ‌కాశం ద‌క్కింది. విల‌న్లు హీరో చేతిలో చావ‌డానికే ఈ పాత్ర‌లు ఒప్పుకున్న‌ట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వ‌ర్గం

త‌మ‌న్ వందో సినిమా ఇది. ఆ ప్ర‌త్యేక‌త ఏమీ ఈ పాట‌ల్లో క‌నిపించ‌లేదు. నిజానికి పాట‌ల‌కు అంత స్కోప్ కూడా లేదు. స‌న్నివేశం బ‌లంగా ఉన్న‌ప్పుడు నేప‌థ్య సంగీతంలోనూ త‌న మార్క్ చూపించాల‌ని ద‌ర్శ‌కుల‌కు అనిపిస్తుంటుంది. అంత అవ‌కాశం శ్రీ‌నువైట్ల ఇవ్వ‌లేదు. సినిమాని ఎంత రిచ్‌గా తీయాలో అంత రిచ్‌గానూ తీశారు నిర్మాతలు. ఈ విష‌యంలో మిగిలిన సాంకేతిక నిపుణుల స‌హ‌కారం బాగా అందింది. క‌థ‌, క‌థ‌నం విష‌యంలో శ్రీ‌నువైట్ల మ‌రోసారి త‌డ‌బ‌డ్డాడు. వ‌రుస వైఫ‌ల్యాల త‌ర‌వాత బ‌ల‌మైన క‌థ‌తో రావాల్సిన శ్రీ‌ను… డిజార్డ‌ర్ క‌థ‌తో వ‌చ్చి.. డిస్ట్ర‌బ్ చేశాడు. కామెడీ ట్రాకులు, సెటైర్లు వీటిని న‌మ్ముకున్న శ్రీ‌ను.. క‌నీసం వాటికి కూడా న్యాయం చేయ‌లేక‌పోయాడు.

తీర్పు

మ‌రోసారి ‘న‌మ్మ‌కం’ అనే పాయింట్ ద‌గ్గ‌రకి వ‌ద్దాం. వ‌రుస ప‌రాజ‌యాల‌తో త‌ల్ల‌డిల్లిపోతున్న శ్రీ‌నుని అటు ర‌వితేజ‌, ఇటు మైత్రీ మూవీస్ ఇద్ద‌రూ న‌మ్మారు. వాళ్ల న‌మ్మ‌కాన్ని మంచి క‌థతో నిల‌బెట్టాల్సిన శ్రీ‌నువైట్ల‌.. క‌థ విష‌యంలోనే దొరికిపోయాడు. విష‌యం త‌క్కువ – హంగు ఎక్కువ అనే త‌న పాత ప‌ద్ధ‌తిలోనే సినిమా తీసి… ఆ న‌మ్మ‌కాన్ని కోల్పోయాడు.

ఫినిషింగ్ ట‌చ్‌: ‘చ‌మ‌డాల్ తీస్తాయ్‌… భ‌గా భ‌గాకీ మ‌ర్తాయ్‌…’

తెలుగు360 రేటింగ్: 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com