త్వరలోనే ఏపి భాజపా అధ్యక్షుడి నియామకం

భాజపా అధిష్టానం కొన్ని రోజుల క్రితం తెలంగాణాతో సహా ఐదు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేసింది కానీ ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోలేకపోయింది. వారం రోజులలోనే కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కంబంపాటి హరిబాబు లేదా సోము వీర్రాజు పేర్లను మాత్రమే ఇంతవరకు పరిశీలిస్తున్న భాజపా అధిష్టానం, కొందరు రాష్ట్ర స్థాయి నేతల నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు మంత్రి పైడికొండల మాణిక్యాల రావు పేరును కూడా ఆ జాబితాలో చేర్చి, ఆయన అభిప్రాయం కోరగా అధ్యక్ష బాద్యతలు చేపట్టేందుకు ఆయన విముఖత చూపించినట్లు సమాచారం. కనుక మళ్ళీ కంబంపాటి హరిబాబు, సోము వీర్రాజు ఇరువురిలో ఎవరో ఒకరిని అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజులలోగానే దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది.

తెలంగాణాలో తెరాసతో భాజపాకి ఎటువంటి పొత్తులు, స్నేహసంబంధాలు లేవు కనుక అక్కడ అధ్యక్ష పదవి నియామకానికి పెద్దగా ఇబ్బందిపడలేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో తెదేపాతో కలిసిసాగుతున్నప్పటికీ దానితో అంత సయోధ్య లేకపోవడం చేత చాలా ఆచితూచి సరయిన వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎంపిక చేయవలసి వస్తోంది. తెదేపాను, తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న సోము వీర్రాజుని అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లయితే అది తెదేపాకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఇప్పటికే తెలంగాణాలో భాజపా నేతలు తెదేపాతో తెగతెంపులు చేసుకోబోతున్నట్లు ప్రకటించేశారు. తెదేపాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సోము వీర్రాజుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించినట్లయితే తెదేపాతో తెగతెంపులకే భాజపా మొగ్గు చూపుతోందని ప్రకటించినట్లవుతుంది.

ఎన్నికలకి ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉంది. రాష్ట్రంలో భాజపా చాలా బలహీనంగా ఉంది. తెగతెంపులు చేసుకొన్న మరుక్షణం నుంచి తెదేపా నేతలందరూ కూడా ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజ్, రైల్వే జోన్ తదితర హామీలను అమలుచేయకుండా భాజపా రాష్ట్ర ప్రజలని మోసం చేస్తోందని గట్టిగా ప్రచారం మొదలుపెట్టడం తధ్యం. కనుక ఇప్పటికిప్పుడు తెదేపాతో తెగ తెంపులు చేసుకొన్నట్లయితే ఆ ప్రభావం రాష్ట్ర భాజపాపై చాలా తీవ్రంగా ఉండవచ్చు. కనుక తెదేపాకి కూడా ఆమోదయోగ్యుడయిన ప్రస్తుత అధ్యక్షుడు కంబంపాటి హరిబాబునే కొనసాగించినా ఆశ్చర్యం లేదు. ఆ విధంగా చేసినట్లయితే యధాప్రకారం సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ తదితరులు యధాప్రకారం తెదేపా ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేసుకోవచ్చు.

కానీ వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో భాజపా బలపడాలంటే తప్పనిసరిగా సోము వీర్రాజు వంటి దూకుడు ప్రదర్శిస్తున్న వ్యక్తినే అధ్యక్షుడిగా నియమించుకోవలసి ఉంటుంది లేకుంటే వచ్చే ఎన్నికలలో కూడా టికెట్ల కోసం మళ్ళీ తెదేపా దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడవలసి వస్తుంది.

ఈ సందిగ్ధత కారణంగానే భాజపా అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికని ఇన్ని రోజులు వాయిదా వేసుకొస్తోంది కానీ ఇంకా ఆలస్యం చేస్తే పార్టీలోనే కొత్త సమస్యలు పుట్టుకు వచ్చే ప్రమాదం ఉంది కనుక వారం రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని లేదా పార్టీని బలోపేతం చేయగల అందరికీ ఆమోదయోగ్యుడయిన మరొకరిని ఎవరినయినా అధ్యక్షుడిగా నియమించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com