భాజ‌పా అధ్య‌క్షుడిని ఇలా ఎంపిక చెయ్యాల‌ట‌!

భాజ‌పా లాంటి జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్య‌క్షుడిని ఏ ప్రాతిప‌దిక ఎంపిక చెయ్యాలో తెలీదా..? రాష్ట్రంలో ప‌రిస్థితులు మ‌నం చెబితే త‌ప్ప వారికి అర్థం కావ‌ని అనుకుంటే ఎలా..? మ‌నం సూచించినవారికే అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చేంత‌గా ప్ర‌భావితం చేయాల‌నుకుంటే ఎలా..? ఇంత‌కీ ఈ ‘మ‌నం’ ఎవ‌రంటే.. మీడియాలో ఒక వ‌ర్గం! ఇంకా చెప్పాలంటే… ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార పార్టీకి అండ‌దండ‌గా నిలుస్తున్న వ‌ర్గం. ఇంత‌కీ ఇప్పుడీ చ‌ర్చ ఎందుకంటే… ఏపీ భాజ‌పాకి కొత్త అధ్య‌క్షుడుని ఎంపిక చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎందుకంటే, ఎంపీ కంభంపాటి హ‌రిబాబును కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటే, ఆయ‌న స్థానాన్ని మ‌రో నాయ‌కునితో భ‌ర్తీ చేయాల‌న్న‌ది అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు. వెంక‌య్య నాయుడు ఉప రాష్ట్రప‌తి అయ్యే స‌రికి, ఏర్ప‌డిన ఖాళీని ఇలా భ‌ర్తీ చేసేందుకు భాజ‌పా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, త‌రుణంలో ఓ వ‌ర్గం మీడియాలో వ‌చ్చిన క‌థ‌నం ఎలా ఉందంటే… రాష్ట్ర అధ్య‌క్షుడిని ఎలా ఎంపిక చేసుకోవాల‌నేది భాజ‌పాకి పాఠం చెబుతున్న‌ట్టుగా ఉంది!

త్వ‌ర‌లోనే అమిత్ షా ఆంధ్రాకి రానున్నారు. రాష్ట్ర భాజ‌పా అధ్య‌క్షుడిగా ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే అంశంపై విజ‌య‌వాడ‌లో ఓ స‌మావేశం ఏర్పాటు చేసి, పార్టీ నేత‌ల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు. దీనికి ఇంకా టైమ్ ఉంది. అయితే, రాష్ట్ర బాధ్య‌త‌ల అప్ప‌గింత అంశ‌మై ఇప్ప‌టికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వారిపై స‌ద‌రు మీడియా విశ్లేష‌ణ ఎలా ఉందంటే… ముందుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురించి చూద్దాం! రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఆయ‌నా ఉన్నార‌నే ప్ర‌చారం ఉంది. అయితే, ఈయ‌న‌కు తెలుగుదేశం పార్టీతో విభేదాలు ఉన్నాయి కాబ‌ట్టి… ఆయ‌న్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌చ్చు అని ఆ క‌థ‌నంలో చెప్పారు. ఈ రేసులో ఉన్న మరో నేత క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ! ఆయ‌న పార్టీలోకి వ‌చ్చి ఎక్కువ కాలం కాలేదు కాబ‌ట్టి, ఆయ‌న‌కి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే అసంతృప్తులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని వారే విశ్లేషించేశారు.

ఇక‌, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి గురించి చూద్దాం! పార్టీ బాధ్య‌త‌లు ఆమెకి అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌నీ, ఎన్టీఆర్ కుమార్తెగా ఆ ఇమేజ్ కూడా భాజ‌పాకి ఉప‌యోగ‌ప‌డొచ్చ‌ని ఆ మ‌ధ్య క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, పార్టీ ప‌ట్ల ఆమె నిబ‌ద్ధ‌త‌ను శంకించే ఉదాహ‌ర‌ణ‌లు చూపారు. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌ల్లో జ‌రిగిన వెంక‌య్య అభినంద‌న స‌భ‌ల‌కు పురందేశ్వ‌రి రాలేద‌ట‌! అత్యున్న‌త ప‌ద‌వికి ఎన్నికైన తెలుగు నాయ‌కుడిని అభినందించుకునే ఈ సంద‌ర్భాల‌కు ఆమె గైర్హాజ‌రు అయ్యార‌నేది కార‌ణం చూపుతున్నారు. టీడీపీతో ఆమెకి విభేదాలున్నాయ‌నే కోణాన్ని కూడా ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేశారు. సో.. వీరంద‌రికీ అవ‌కాశాలు లేవ‌ని చెబుతూనే… భాజ‌పా నిర్ణ‌యం అనూహ్యం ఉండొచ్చ‌ని చెప్పారు.

ఇంత‌కీ ఈ క‌థ‌నాల ప‌ర‌మార్థం ఏంటంటే… తెలుగుదేశంతో విభేదాలున్న నాయ‌కుల‌ను, లేదా భ‌విష్య‌త్తులో తెలుగుదేశం మాట‌ను జ‌వ‌దాటే అవ‌కాశం ఉన్న నేత‌ల‌నూ ఆంధ్రా భాజ‌పా అధ్య‌క్షులుగా నియ‌మించ‌కూడ‌దు! టీడీపీతో అత్యంత అనుకూలంగా ఉంటూ, ఆ పార్టీ అదుపాజ్ఞ‌ల్లో ఉండేవారికే రాష్ట్ర ప‌ద‌వి ఇవ్వాలనేది వారి సూచ‌న‌. తెలుగుదేశం పార్టీకి భాజ‌పాతో దోస్తీ అవ‌స‌రం కాబ‌ట్టి, ఆ ఆవ‌శ్య‌క‌త‌ను అట్నుంచి ఇటు.. అంటే, రాష్ట్రంలో భాజాపాకి టీడీపీ మాత్ర‌మే దిక్కు అనేట్టు ఎస్టాబ్లిష్ చేయ‌డమే ఆ మీడియా వ‌ర్గం ఆలోచ‌న‌గా చెప్పుకోవ‌చ్చు! అయినా, ఆంధ్రాలో రాజ‌కీయాలేంటో, వాటి మధ్యలోంచి పార్టీని ఎలా పైకి తీసుకురావాలో అమిత్ షా, మోడీ ద్వ‌యానికి తెలీదా! వెంక‌య్య నాయుడిని ఉప‌రాష్ట్రప‌తి చేసిన వైనాన్ని మ‌ర‌చిపోతే ఎలా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.