త‌లాక్ బిల్లుపై కాంగ్రెస్ కి మిగిలింది ఈ సంతృప్తే..!

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారంతో ముగిశాయి. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం అనుకున్న ట్రిపుల్ త‌లాక్ బిల్లు లోక్ స‌భ‌లో ఆమోదం పొందింది. కానీ, రాజ్య‌స‌భ‌లో మాత్రం చ‌ర్చ‌నీయాంశంగానే మిగిలిపోయింది. త‌లాక్ బిల్లులో కొన్ని మార్పులు చేయాల‌ని, య‌థాప్ర‌కారం ఆమోదం కుద‌ర‌దు అంటూ కాంగ్రెస్ స‌హా కొన్ని పార్టీలు ప‌ట్టుబట్టాయి. ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే ఆమోదం పొందాల‌నీ, ఇప్ప‌టికే ఆల‌స్య‌మౌతోందంటూ భాజ‌పా వాదించింది. ముస్లిం మ‌హిళ‌ల‌కు మేలు జ‌రుగుతుంటే కాంగ్రెస్ అడ్డుకుంటోంద‌న్న కోణం నుంచే భాజ‌పా నేత‌లు విమ‌ర్శిస్తూ వ‌చ్చారు. ఇదే ప‌రిస్థితి శుక్ర‌వారం నాడు కూడా స‌భ‌లో క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో స‌భ వాయిదా ప‌డింది. అయితే, వ‌చ్చే స‌మావేశాల్లో ఇది త‌ప్ప‌కుండా ఆమోదం పొందుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు అనంత్ కుమార్‌. స‌భ‌ను వాయిదా వేస్తున్న స‌మ‌యంలో ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు కొన్ని నీతి వాక్యాలు చెప్పారు. స‌భా స‌మ‌యాన్ని ఇలా దుర్వినియోగం చేయ‌డం త‌గ‌దంటూ క్లాస్ తీసుకున్నారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ కోరుకున్న‌ది ఇదే. ఈ స‌మావేశాల వ‌ర‌కూ బిల్లు పాస్ కాకుండా రాజ్య‌స‌భ‌లో అడ్డుకోవాల‌నుకుంది, అడ్డుకుంది! నిజానికి, అధికార పార్టీ భాజ‌పా కోరుకున్న‌ది కూడా ఇదే అనొచ్చు..! ఇప్పుడీ బిల్లుపై పార్ల‌మెంటు బ‌య‌ట చాలా చ‌ర్చ‌కు ఆస్కారం వారికి ద‌క్కింది. అంతెందుకు… స‌భ వాయిదా ప‌డిన వెంట‌నే పెద్ద సంఖ్య‌లో ముస్లిం మ‌హిళ‌లు పార్ల‌మెంటు ముందు ధ‌ర్నా చేశారు. ‘కాంగ్రెస్ వాది మ‌హిళా విరోధి’ అంటూ నినాదాలు చేశారు. ముస్లిం మ‌హిళ‌ల‌కు జీవితాల‌ను ఉద్ధ‌రించేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తుంటే, కాంగ్రెస్ మోకాల‌డ్డుతోందంటూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. భాజ‌పా ఆశిస్తున్న‌ది కూడా ఇదే క‌దా! తాము ముస్లిం మ‌హిళ‌ల‌కు చాలా చేస్తున్నామని చెప్ప‌డంతోపాటు… కాంగ్రెస్ త‌మ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకుంటోంద‌న్న అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి బాగా తీసుకెళ్లాల‌న్న‌దే వారి ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

ఎలాగూ ఈ నెలాఖ‌రుకు మ‌ళ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఉంటాయి. 29న ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశపెట్టేసి.. వెంట‌నే బ‌డ్జెట్ ఉంటుంద‌ని అంటున్నారు. ఆ మ‌ర్నాడే ట్రిపుల్ త‌లాక్ బిల్లును మ‌రోసారి స‌భ‌లోకి తెస్తారు. అయితే, ఈలోపుగా ఆర్డినెన్స్ తెచ్చేస్తారు అనే ఊహాగానాలు కూడా ఢిల్లీ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. నిజానికి, ఆ అవ‌స‌రం ఏముంది..? మ‌హా అయితే మ‌రో 25 రోజులు వేచి చూడాలి. లోక్ స‌భ ఇప్ప‌టికే ఆమోదించేసింది, సుప్రీం కోర్డు మార్గ‌ద‌ర్శ‌కాలు ఉండ‌నే ఉన్నాయి. కాబ‌ట్టి, ఆర్డినెన్స్ తేవాల్సిన‌ అవ‌స‌రం క‌నిపించ‌డం లేదు. అయితే, ఈ లోగా భాజ‌పాకి కావాల్సిన స‌మ‌యం దొరికింది. మీడియా వేదిక‌గా కాంగ్రెస్ స‌ర్కారుపై చేయాల్సిన ఆరోప‌ణ‌లు ఎన్నైనా చేసుకోవ‌చ్చు క‌దా! ఇంత‌కీ, ఈ క్ర‌మంలో రాజ్య‌స‌భ‌లో బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ ఏం సాధించింది..? ఆ పార్టీ కోరుతున్నది కూడా ఆ మూడేళ్ల శిక్ష అనే అంశంలో చిన్న స‌వ‌ర‌ణే. అది చేస్తే తామూ ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని కూడా చెప్పారు. కానీ, మొత్తంగా త‌లాక్ బిల్లునే కాంగ్రెస్ వ్య‌తిరేకిస్తోంద‌న్న భావ‌న బ‌య‌ట‌ ప్ర‌చారంలోకి వ‌స్తోంది. ఈ బిల్లును అడ్డుకోవ‌డం ద్వారా కేవ‌లం తమ పంతాన్ని మాత్ర‌మే కాంగ్రెస్ నెగ్గించుకుంది. అంతేగానీ… రాజ‌కీయంగా ఎలాంటి ల‌బ్ధి పొంద‌క పోగా విమ‌ర్శ‌లు పాలౌతోంద‌ని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.