15వ ఆర్థిక సంఘం పేరుతో భాజ‌పా భారీ వ్యూహం..!

ఆంధ్రాపై కేంద్ర నిర్ల‌క్ష్యం చూస్తూనే ఉన్నాం. విభ‌జ‌న చ‌ట్ట ప్ర‌కారం రావాల్సిన నిధులు ఇవ్వ‌లేదు. నాలుగేళ్ల‌పాటు తాత్సారం చేసి, అన్నీ ఇచ్చేశామని ఇప్పుడు లెక్క‌లు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి వ‌సూలు చేస్తున్న నిధులు పెద్ద మొత్తంలో ఉంటున్నాయ‌నీ, వాటిలో కొద్ది భాగ‌మే ఇస్తూ.. చాలా ఇచ్చార‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారంటూ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఆవేద‌న కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన స‌మ‌స్య కాదు. తెలంగాణ‌లో కూడా ఇదే పరిస్థితి. సీఎం కేసీఆర్ కూడా కేంద్రం తీరుపై ఆవేద‌న చెందుతున్నారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య కూడా ఇదే అంశ‌మై లెక్క‌ల‌తో స‌హా మాట్లాడారు. కేంద్రానికి పెద్ద మొత్తంలో ప‌న్నుల రూపంలో నిధులు వెళ్తున్నాయనీ, కానీ రాష్ట్రానికి కేంద్రం నుంచి వ‌స్తున్న‌వి చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయ‌ని ఆయ‌న కూడా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీంతోపాటు, ప్ర‌స్తుతం ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి వ్య‌క్త‌మౌతున్న ఆందోళ‌న ఏంటంటే.. 15వ ఆర్థిక సంఘం చేయ‌బోతున్న సిఫార్సులు. ప్ర‌స్తుతం 14వ ఆర్థిక సంఘం సూచ‌న‌లు అమ‌ల్లో ఉంది. దీని గ‌డువు 2020తో పూర్త‌వుతుంది. ఆ త‌రువాత‌, రాబోయే 15వ ఆర్థిక సంఘాన్ని ఇప్ప‌టికే నియ‌మించారు. అయితే, దీన్లో వీరు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న ప్ర‌మాణాలే ద‌క్షిణాది ప‌ట్ల భాజ‌పా అనుస‌రిస్తున్న వివ‌క్ష‌ను మ‌రింత‌గా ఎత్తి చూపేలా ఉన్నాయి. ఇప్పుడు దీనిపై క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య స్పందించారు. అంద‌రం క‌లిసి పోరాడ‌దామంటూ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ఇదే అంశ‌మై ప‌ది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు లేఖ రాసి, క‌లిసి పోరాడ‌దాం అని స్ప‌ష్టం చేశారు. కేర‌ళ విష‌యానికొస్తే.. ఏప్రిల్ 10న ద‌క్షిణాది రాష్ట్రాల ఆర్థిక‌మంత్రుల స‌మావేశం కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో 15వ ఆర్థిక సంఘం అల‌జ‌డికి కార‌ణ‌మౌతోంది. ద‌క్షిణాది ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ తీసే విధంగా ఈ ఆర్థిక సంఘం కొత్త ఫార్ములా ఉండ‌బోతోంది!

కాస్త వివ‌రంగా చెప్పాలంటే… ఇంత‌వ‌ర‌కూ 1971 జ‌నాభా లెక్క‌ల్ని ప్రాతిపదిక‌గా తీసుకుని ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తూ వ‌స్తోంది. 1971 లెక్క‌ల్నే ఎందుకు తీసుకుంటారంటే… దేశంలో కుటుంబ నియంత్ర‌ణ పెద్ద ఎత్తున అమ‌ల్లోకి వ‌చ్చింది అప్ప‌ట్నుంచే కాబట్టి. రాష్ట్రాలకు నిధుల పంపిణీ విష‌యంలో జ‌నాభా సంఖ్య కీల‌క ప్రాతిప‌దికగా ఉంటుంది. త‌ల‌స‌రి ఆదాయం, రాష్ట్రాల‌ ఆర్థిక వ‌న‌రుల ల‌భ్య‌త వంటి అంశాల‌ను కూడా లెక్క‌ల్లోకి తీసుకుంటారు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణించి, ఆయా రాష్ట్రాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కేంద్ర నిధుల కేటాయింపుల‌పై ఒక ఫార్ములాను ఆర్థిక సంఘం త‌యారు చేస్తుంది. ఇక‌, 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం ఇచ్చిన సూచ‌న‌లు ఏంటంటే… ఈసారి 2011 జ‌నాభా లెక్క‌లను ప్రాతిప‌దిక‌గా తీసుకోవాల‌ని చెప్పింది. దీని వ‌ల్ల ప్ర‌మాదం ఏంటంటే… ఏ రాష్ట్రాలు అయితే ఇంతవరకూ జ‌నాభాను త‌గ్గించుకుంటూ వ‌చ్చాయో వాటికి నిధులు త‌గ్గుతాయి. కుటుంబ నియంత్ర‌ణ పాటించ‌కుండా జ‌నాభాను పెంచుకున్న రాష్ట్రాల‌కు కేంద్ర కేటాయింపులు పెరుగుతాయి.

ఈ లెక్క‌న ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి రూ. 34 వేల కోట్లు న‌ష్టం వ‌స్తుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఏపీతో సహా కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో జ‌న సంఖ్య నియంత్ర‌ణ‌లో ఉంది, నిర‌క్ష‌రాస్య‌త త‌గ్గించుకున్నాయి, మ‌హిళా విద్య పెరిగింది. ఇక, ఉత్త‌రాది రాష్ట్రాలు ఈ విష‌యాల్లో నిర్ల‌క్ష్యం చేసుకుంటూ వ‌చ్చాయి. అంటే, నిర్ల‌క్ష్యంతో పెంచుకున్న జ‌నాభా సంఖ్య వ‌ల్ల ఇప్పుడు ఉత్త‌రాది రాష్ట్రాల‌కు నిధుల కేటాయింపుల‌ను పెంచ‌బోతున్నారు. నిర్దిష్ట ల‌క్ష్యంతో ద‌క్షిణాదిలో అన్నీ స‌క్ర‌మంగా ఉన్నందుకు నిధుల‌ను త‌గ్గించ‌బోతున్నారు.

దీని వెన‌క ఉన్న రాజ‌కీయ వ్యూహం ఏంటంటే.. భాజ‌పాకి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో జ‌నాభా సంఖ్య త‌క్కువ‌గా ఉంది. అడ్డ‌గోలుగా జ‌న‌సంఖ్య పెరిగిన ఉత్త‌రాది రాష్ట్రాల్లో భాజ‌పా బ‌లంగా ఉంది. అందుకే, 2011 లెక్క‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని భాజ‌పా చెబుతోంది. దాని వ‌ల్ల తాము బ‌లంగా ఉన్న రాష్ట్రాలపై మ‌రింత ప్రేమ‌ను కురిపిస్తారు. త‌మ‌కు అవ‌స‌రం లేద‌నుకుంటున్న ద‌క్షిణాది రాష్ట్రాల్లో జ‌న సంఖ్య సాకుగా చూపుతూ కేంద్రం ఇవ్వాల్సిన వాటిలో కోత‌లు విధిస్తారు. ఇదొక్కటే కాదు.. పార్ల‌మెంటులో నియోజ‌క వ‌ర్గాల సంఖ్య ఎంత ఉండాల‌నేది కూడా 2011 జ‌నాభా లెక్క‌ల్నే ప్రాతిప‌దిక‌గా తీసుకోవాల‌ని భాజ‌పా ఆలోచిస్తోంద‌ట‌. అంటే ఏంటి అర్థం..? ఉత్త‌రాదిలో పార్ల‌మెంటు స్థానాల సంఖ్య మ‌రింత‌ పెంచుకోవ‌డం వ‌ల్ల ల‌బ్ధి పొందే ఎత్తుగ‌డ ఇది. ఇదే జ‌రిగితే యూపీలో మ‌రిన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఏపీ తెలంగాణ, క‌ర్ణాట‌క‌, కేర‌ళ, త‌మిళ‌నాడులో ఉన్న‌వి కూడా త‌గ్గుతాయి.

ద‌క్ష‌ణాది రాష్ట్రాల ప‌ట్ల భాజ‌పా ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రించేందుకు సిద్ధ‌మౌతోంది. దీంతో ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ కేంద్రంపై పోరాడాల్సిన అనివార్యత క‌నిపిస్తోంది. అందుకే, ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల్లో కొంత క‌ద‌లిక మొద‌లైంది. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ద‌క్షిణాదిని ఇన్ని ర‌కాలుగా దెబ్బ కొట్టేందుకు భాజ‌పా ప్ర‌య‌త్నించ‌డం చాలా దారుణం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను ఒకేలా చూడాలి. కానీ, త‌మ‌కు పట్టున్న రాష్ట్రాలూ, అనువుగా ఉన్న రాష్ట్రాలకు మాత్ర‌మే ల‌బ్ధి చేకూర్చేలా ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా భాజ‌పా వ్యూహ ర‌చ‌న క‌నిపిస్తోంది. ఎన్న‌డూ లేని నియంతృత్వ ధోర‌ణి భాజ‌పా హాయంలో పెచ్చరిల్లిన ఛాయలు ఈ మధ్య చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.