గోవ‌ధ‌పై కేంద్రం నిషేధం

కేంద్రం తాననుకున్న దిశ‌గా అడుగులు వేస్తోంది. గోవ‌ధ‌పై నిషేధాన్నివిధించింది. సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిప్ర‌కారం ఆవులు, గేదెలను మాంసం దుకాణాలకు అమ్మకూడదు. రైతులకు మాత్రమే విక్రయించాలి. అదీ గుర్తింపు కార్డులున్న రైతులకు మాత్రమే అమ్మాలి. భూములున్న రైతులు మాత్రమే వీటిని కొనుగోలు చేయాలి. గిత్తలను అమ్మనేకూడదు. ఎద్దులు, ఆవులు, గేదెలు, కోడెలతో పాటు ఒంటెల అమ్మకాలు ఇష్టానుసారంగా చేయ‌కూడదు. ఈ నిషేధ‌ చట్టం రాబోయే మూడు నెలల్లో అమల్లోకి వ‌స్తుంది. మరింత పేపర్ వర్క్ జరగాల్సి ఉండటంతో అమల్లోకి రావడానికి సమయం పడుతుందన్నారు. అమ్మకాలు, కొనుగోళ్లు చేసే వారు కచ్చితంగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి. ఈ కొత్త చట్టాన్ని దివంగత పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే రూపొందించారు. సుప్రీం కోర్టు సూచనల‌తో ఈ నిషేధ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలో పొందుపర్చిన నిబంధనల ప్ర‌కారం ఆవును కొనుగోలు చేయాల‌నుకునే వారు ఐదు ఆధారాల‌ను చూపించాలి. రెవెన్యూ కార్యాల‌యంలోనూ, ప‌శు వైద్యునికీ, ప‌శువుల మార్కెట్లోనూ వీటిని అందించాలి. వ‌ధించ‌డానికి కాద‌నీ, వ్య‌వ‌సాయానికి వాటిని ఉప‌యోగిస్తామ‌ని వారి ముందు నిరూపించారు. జంతువ‌ధ నిరోధ‌క చ‌ట్టం 1960కి అనుగుణంగా కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. ప‌ర్యావ‌ర‌ణం కోసం నిరంత‌రం త‌పించిన అనిల్ ద‌వే చేసిన ఈ చ‌ట్టం స‌క్ర‌మంగా అమ‌లైతే అంత‌కు మించి ఆయ‌న ఆత్మ‌కు శాంతి ఏముంటుంది.

ప‌శువుల్ని వ‌ధిస్తున్నారంటూ కొన్నేళ్ళుగా దేశ‌వ్యాప్తంగా దాడులు చోటుచేసుకోవ‌డం ఈ చ‌ట్ట రూప‌క‌ల్ప‌న‌కు బాట‌లు వేసింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. విదేశాల‌కు ప‌శు మాంసం ఎగుమ‌తి చేసే ప్ర‌ధాన దేశాల జాబితాలో స్థానం ద‌క్కించుకున్న భార‌త్‌కు ఈ చ‌ట్టం అమ‌లు స‌వాలే. అల్ క‌బీర్ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న క‌బేళాల నిర్వ‌హ‌ణ మాటేమిటి? ఆవుల వ‌ధ‌ను నియంత్రిచ‌డానికి చ‌ట్టంలో ఎలాంటి నిబంధ‌న‌లు రూపొందించారు అనే అంశంపైనే ఈ చ‌ట్టం ప‌టిష్టంగా అమ‌లు చేయ‌గ‌ల‌రా లేదా అనే విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంది.
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.