రివ్యూ: ఛ‌లో

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

లైన్ అనుకోవ‌డం క‌థ రాసుకోవ‌డం రెండూ వేరు. క‌ల‌కీ వాస్త‌వానికీ ఉన్నంత తేడా ఉంటుంది. లైన్లు విన‌డానికి బాగుంటాయి… అలా విన‌డానికి బాగున్నవ‌న్నీ తెర‌పై సినిమాగా తీయ‌లేం. దానికి నేర్పు, ఓర్పు, కూర్పు ఇవి మూడూ అత్య‌వ‌స‌రం. ఓ చిన్న లైన్‌ని ప‌ట్టుకుని థియేట‌ర్లో ప్రేక్ష‌కుల్ని రెండుగంట‌ల పాటు కూర్చోబెట్ట‌డం క‌త్తిమీద సామే. అందులోనూ తొలి చిత్ర ద‌ర్శ‌కుడికి. ఆ సాహ‌సం `ఛ‌లో`లో క‌నిపించింది. ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల అల్లుకొన్న‌ది ఓ సామాన్య‌మైన లైన్‌. రెండు ఊర్లు, వాళ్ల‌మ‌ధ్య గొడ‌వ‌లు, అందులో చిగురించిన ఓప్రేమ‌క‌థ‌… ఇదీ స్థూలంగా `ఛ‌లో`. మ‌రి దాన్ని ఈ కొత్త ద‌ర్శ‌కుడు ఎంత వ‌ర‌కూ డీల్ చేయ‌గ‌లిగాడు? ఈ లైన్‌ని క‌థ‌గా మ‌ల‌చి, సినిమాగా తీసి మెప్పించ‌డంలో ఎంత వ‌ర‌కూ స‌క్సెస్ అయ్యాడు?

* క‌థ‌:

ముందే చెప్పుకున్న‌ట్టు ఇది రెండు ఊర్ల క‌థ‌. అటు తెలుగువాళ్లు, ఇటు త‌మిళం వాళ్లు. మ‌ధ్య‌లో ఓ కంచె. తెలుగువాళ్లు త‌మిళ ఊర్లోకి అడుగుపెట్ట‌కూడ‌దు. త‌మిళం వాళ్లు తెలుగు ఊరి వైపుకి రాకూడ‌దు. వ‌చ్చారంటే.. గొడ‌వే. అలాంటి చోట ఓ కాలేజీ. ఆ కాలేజీలో మాత్రం తెలుగు, త‌మిళ బేధం లేదు. గొడ‌వల్లేవు. అక్క‌డ రూల్స్ అంత స్ట్రిక్టు మ‌రి. ఆ కాలేజీలోకి అడుగుపెడ‌తాడు హీరో (నాగ‌శౌర్య‌). త‌న‌కేమో గొడ‌వ‌లంటే పిచ్చి. ఇద్ద‌రు కొట్టుకుంటుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాడు. స‌రిగ్గా అవే ల‌క్ష‌ణాలు హీరోయిన్ (ర‌ష్మికా మ‌డ‌న్నా)లోనూ ఉంటాయి. అందుకే ఇద్ద‌రూ ప్రేమించేసుకుంటారు. కానీ అక్క‌డే అస‌లు గొడ‌వ‌. ఆమె త‌మిళం.. హీరో తెలుగు. దాంతో మ‌ళ్లీ గొడ‌వ‌లు షురూ అవుతాయి. ఈ గొడ‌వ‌ల మ‌ధ్య త‌న ప్రేమ‌ని ఎలా బ‌తికించుకున్నాడ‌న్న‌దే క‌థ‌.

* విశ్లేష‌ణ‌:

క‌థ పైన చెప్పుకున్నంత సీరియెస్‌గా ఉండ‌దు. దాని టెంపోనే `కామెడీ`తో మిక్స్ చేశాడు ద‌ర్శ‌కుడు. వెంకీకి మార్కుల‌న్నీ అక్క‌డే ప‌డిపోతాయి. త్రివిక్ర‌మ్ స్కూల్ నుంచి వ‌చ్చాడు క‌దా, ఎక్క‌డ ఎలాంటి కామెడీ పంచ్‌లు పేల్చాలో బాగా అర్థ‌మైంది. అది ఈ సినిమాకి ప్ల‌స్ అయ్యింది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌లోనే బోల్డంత ఫ‌న్ ఉంది. పైగా కాలేజీ సీన్లు. అక్క‌డ తెలుగు, త‌మిళం గొడ‌వ. కాబ‌ట్టి ద‌ర్శ‌కుడికి ఓ కొత్త నేప‌థ్యం దొరికిన‌ట్టైంది. అందుకే తొలి స‌గం చెల‌రేగిపోయాడు. సీన్లు.. ఫ‌న్నీగా సాగిపోతాయి. హీరో, హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ కూడా స‌ర‌దాగా ఉంటుంది. హీరోయిన్ స్లిప్పులు రాసుకుని కాలేజీకి వెళ్ల‌డం, మందుతాగి హీరోతో గొడ‌వ పెట్టుకోవ‌డం… ఇవ‌న్నీ ఆ క్యారెక్ట‌ర్‌ని బాగా ఎలివేట్ చేయ‌డంలో దోహదం చేశాయి. ఓ ద‌శ‌లో హీరోని సైడ్ చేసి హీరోయిన్ కామెడీ చేసేస్తుంటుంది. స‌త్య అండ్ కో న‌వ్వులు పంచ‌డంలో పోటీ ప‌డ‌డంతో తొలి స‌గం అస‌లు టైమే తెలియ‌కుండా న‌డిపించేశాడు.

ద్వితీయార్థంలో `త‌ప్ప‌ని` ప‌రిస్థితుల్లో కంచె, దాని వెనుక గొడ‌వ‌, రెండు ఊర్ల స‌మ‌స్య‌లు, ఫ్లాష్ బ్యాక్ కావాల్సివ‌చ్చింది.
దాంతో స్వ‌త‌హాగానే క‌థ‌లో, క‌థ‌నంలో వేగం త‌గ్గింది. వినోదం మిస్ అయ్యింది. ద‌ర్శ‌కుడు సీరియెస్ మూడోకి వెళ్లిన‌ప్పుడ‌ల్లా.. మ‌న చేతుల్లోకి సెల్‌ఫోన్లు ప్ర‌త్య‌క్ష‌మైపోతుంటాయి. అయితే.. ఇక్క‌డ మ‌రోసారి వెంకీ త‌న తెలివితేట‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. త‌న బ‌లం వినోద‌మ‌ని గ్ర‌హించి.. వెన్నెల కిషోర్‌ని రంగ ప్ర‌వేశం చేయించాడు. `పంట‌`ల కామెడీ పండింది.. సినిమాలో మ‌ళ్లీ వినోదం క‌లిసింది. వెన్నెల కిషోర్ అనే పాత్ర ఈ సినిమాలో, మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్‌లో లేక‌పోతే… టోట‌ల్‌గా ఈ సినిమా గాడి త‌ప్పేసేది. మొద‌టి స‌గంలో చూపించిన వినోదం కూడా మ‌ర్చిపోయి ప్రేక్ష‌కుడు థియేట‌ర్ నుంచి భారంగా బ‌య‌ట‌కు వ‌చ్చేవాడు. క్లైమాక్స్ ద‌గ్గ‌ర ఏం చేయాలో ద‌ర్శ‌కుడికి అర్థం కాలేదు. దాన్ని కూడా ఫ‌న్నీగా మార్చాల‌న్న కుతూహులం ప్ర‌ద‌ర్శించి… కంగాళీ చేసేశాడు. మ‌రీ ఇంత తూ.తూ మంత్రంగా తేల్చి పారేస్తాడ‌ని.. ఫ‌స్టాఫ్ చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడి ఊహ‌కు కూడా రాదు. చిన్న లైన్‌ని ప‌ట్టుకొని అప్ప‌టి వ‌ర‌కూ ప‌క‌డ్బందీగా న‌డిపించిన ద‌ర్శ‌కుడు… ఇక్క‌డ మాత్రం దారుణంగా ప‌ట్టు త‌ప్పేశాడు. క్లైమాక్స్ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఇంకా బాగా ఆలోచిస్తే… త‌ప్ప‌కుండా `ఛ‌లో` ఇంకా మంచి సినిమాగా మిగిలేది.

* న‌టీన‌టులు

నాగ‌శౌర్య ఏ లోపం చేయ‌లేదు. తన జోష్‌తో, టైమింగ్ తో సినిమాని న‌డిపించేశాడు. ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కంటే హుషారుగా క‌నిపించాడు. ర‌ష్మిక ఈ సినిమాకి మ‌రో ప్ల‌స్ పాయింట్‌. చాలా ఫ్రెష్‌గా క‌నిపించింది. న‌ట‌న బాగుంది. లుక్స్ ప‌రంగానూ ఆక‌ట్టుకుంది. త‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కుతాయి. సెకండాఫ్‌లో ర‌ష్మిక‌ని ఓ గ‌దిలో బంధించేశారు. దాంతో ఆ క్యారెక్ట‌ర్‌ని ద‌ర్శ‌కుడు పూర్తిగా వాడుకునే అవ‌కాశం లేక‌పోయింది. స‌త్య‌, వెన్నెల కిషోర్ ఈ సినిమాకి క‌నిపించ‌ని మూల స్థంభాలు. వాళ్ల కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. మిగిలిన వాళ్లంతా.. ఓకే అనిపిస్తారు.

* సాంకేతికంగా

టెక్నిక‌ల్‌గా మంచి టీమ్ కుదిరింది. పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. చూసీ చూడంగానే.. పాట వినీ విన‌గానే న‌చ్చేస్తుంది. మిగిలిన‌వ‌న్నీ ఓకే అనిపిస్తాయి. ఆర్‌.ఆర్ ద‌గ్గ‌రా మ‌హ‌తి ఏమాత్రం ఇబ్బంది ప‌డ‌లేదు. కెమెరా వ‌ర్క్ నీట్‌గా ఉంది. ద‌ర్శ‌కుడి బ‌లం వినోదం… అది పంచాల్సిన చోట‌.. త‌న పెన్ను బాగా ప‌రుగులు పెట్టింది. ఎమోష‌న్స్ కొన్ని చోట్ల ఫోర్డ్స్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ద‌గ్గ‌ర రాజీ ప‌డ‌కుండా ఉండి ఉంటే… వెంకీ ప్రామిసింగ్ ద‌ర్శ‌కుల జాబితాలో ఈ పాటికే చేరిపోయి ఉండేవాడు.

* తీర్పు

ఛ‌లో ఓ ప్ర‌యాణం అనుకుంటే…. ప్రారంభం అద‌ర‌గొట్టేసింది. మ‌ధ్య‌లో కాస్త గ‌తుకులు ఎదుర‌య్యాయి. వెన్నెల కిషోర్ వ‌చ్చి… హైవేగా మార్చాడు. క్లైమాక్స్ లో మాత్రం ఏదారిలో వెళ్లాలో తెలీక ద‌ర్శ‌కుడు గంద‌ర‌గోళానికి గుర‌య్యాడు. కానీ ఒక్క‌టి ఈ ‘ఛ‌లో’.. హ‌లోలా కాదు.. ‘ఛ‌లో’ అన్నందుకైనా ఒక్క‌సారి వెళ్లి రావాల్సిందే.

ఫినిషింగ్ ట‌చ్‌: చ‌ల్ చ‌లే చ‌లో….

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com