తెలుగు సాహిత్యంలో ప్రసిద్ది పొందిన రచన ‘చిల్లర దేవుళ్లు’. దాశరథి రంగాచార్య నవలకు 1970లో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం దక్కింది. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటి తెలంగాణ జీవన చిత్రం.. ఈ నవల. తెలుగు సాహిత్యం, అందులోనూ తెలంగాణ సాహిత్యం గురించి అధ్యయనం చేయాలనుకొనే వాళ్లు తప్పకుండా చదవాల్సిన నవల ఇది. అప్పట్లో ఇదే పేరుతో సినిమా కూడా తీశారు. ఇప్పుడు మరోసారి ఈ నవలను వెండి తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఓ నిర్మాత ఈ నవలకు సంబంధించిన రైట్స్ తీసుకొనే ప్రయత్నంలో ఉన్నార్ట. తెలంగాణకు చెందిన దర్శకుడే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
‘చిల్లర దేవుళ్లు’ మాత్రమే కాదు. కొన్నిసుప్రసిద్ధ నవలలు సినిమాలుగా రాబోతున్నాయి. గురజాడ ‘కన్యాశుల్కం’ నవల ఓ ఓటీటీ కోసం సిరీస్ గా తీశారు. ప్రియదర్శి ఇందులో కీలక పాత్రధారి. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైదానం లాంటి పాపులర్ నవలలూ ఇప్పుడు సినిమాలుగా తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటీటీలో ఇలాంటి రచనలకు ఎక్కువ స్కోప్ ఉంది. ఆమధ్య వచ్చిన ‘కొండపొలం’ కూడా నవలా చిత్రమే. కాకపోతే కమర్షియల్ గా ఆడలేదు. లేదంటే మరిన్ని నవలలు సినిమాలుగా వచ్చేవి.
