ప్రొ.నాగేశ్వర్: కాంగ్రెస్, టీడీపీ పొత్తు టీఆర్ఎస్‌కు ఇబ్బందేనా..?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. టీ టీడీపీలో గతంలో మోత్కుపల్లి నర్సింహులు లాంటి వాళ్లు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలనే ఓ వాదన తీసుకొచ్చారు. కానీ వాళ్లు ఇప్పుడు పార్టీలో లేరు. టీఆర్ఎస్ తో ఉండే అవకాశం లేదు కాబట్టి… టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. దీనికి పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు.

కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలెంత ఉన్నాయి..?

తెంలగాణలో కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందో లేదో ప్రకటన రావాలంటే.. ఏపీలో కూడా ఆ పొత్తులు ఉంటాయో, లేదో తేలాలి. ఆంధ్రలో పొత్తు లేకుండా.. తెలంగాణలో మాత్రమే టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధపడుతుందా..? అనేది ప్రధానమైన సందేహం. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే… ఆంధ్రప్రదేశ్ లో ఏమని చెప్పుకుంటారు..?. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు అంగీకరించకపోవచ్చు. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా.. కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికీ అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది.అందుకే టీడీపీ అంగీకరించదు. కానీ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు సానుకూలత ఉంది. తెలంగాణకు లేఖ ఇచ్చింది మేమే గనుక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ చెప్పుకోవచ్చు. ఇద్దరమూ టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్నాము కదా అని చెప్పుకోవచ్చు. అందుకని.. రెండు రాష్ట్రాల్లో పొత్తులపై సంతృప్తికరమైన సమాధానం దొరికే వరకూ.. కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖరారు కాదు. అయితే ఏపీలో ప్రత్యేక హోదా ఇష్యూ వచ్చిన తర్వాత పరిస్థితి కొంచెం మారింది. రాష్ట్రాన్ని విభజన అంశం కాస్త తెర వెనక్కి వెళ్లింది. 2019 ఎన్నికల్లో ప్రత్యేకహోదా ఎన్నికల ఎజెండా మారి.. ప్రజలకు అదే ప్రత్యేకమన ఇష్యూగా మారితే… కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్, అందుకు సహకరించిన పార్టీ బీజేపీ. ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ ఇస్తానంటోంది. బీజేపీ ఇవ్వనంటోంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రత్యేకహోదా సాధిస్తామని టీడీపీ వాదన వినిపించే అవకాశం ఉంది. ఎందకంటే.. కేంద్రంలో టీడీపీ అధికారంలోకి రాదు… కాంగ్రెస్ వస్తేనే.. ప్రత్యేకహోదా వస్తుందన్న భావన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే.. కాంగ్రెస్ తో పొత్తుకు అవకాశం ఉంటుంది.

టీఆర్ఎస్ సింహంలా సింగిల్‌గా వెళ్లడం లేదు..!

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయన్న వార్తలపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. మేము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం..సింహం ఎప్పుడూ సింగిల్ గానే వెళ్తుందని కేటీఆర్ ప్రకటిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ఒంటరిగా ఓల్డ్ సిటీలోకి పోవడం లేదు. చాలా చోట్లకు ఒంటరిగా పోవడంలేదు. ఎంఐఎంతో అవగాహనతోనే వెళ్తున్నారు. ఇక బీజేపీతో అవగాహనతోనే ఉన్నట్లుగా కనబడుతోంది. కేసీఆర్ ను లోక్ సభ వేదికగా ప్రధాని మోదీ ప్రశంసిస్తారు.. ఇక్కడకు వచ్చే కేంద్రమంత్రులు, ఇతర నేతలు కూడా ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా టీఆర్ఎస్ వైఖరి అదే రకంగా ఉంది. నోట్ల రద్దు, జీఎస్టీ , జమిలీ ఎన్నికలు సహా అన్ని విధానాలకూ మద్దతు తెలిపారు. చివరికి మోడీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా మద్దతివ్వలేదు. బీజేపీతో ఎన్డీఏ కూటమిలో ఉన్న శివసేన కూడా ఓటింగ్ కు దూరంగా ఉంది. టీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. టీఆర్ఎస్ ఎందుకు గైర్హాజరైంది. తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చలేదు. హైకోర్టును కూడా విభజించలేదు. ఏమీ ఇవ్వని కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాసం వస్తే.. దాన్ని టీడీపీ ప్రతిపాదించింది కాబట్టి..మేం మద్దతివ్వలేదన్నారు. అవిశ్వాసాన్ని ఎవరు ప్రతిపాదించారన్నది కాదు ముఖ్యం… దాన్ని అనేక పార్టీలు సమర్థించాయి. స్పీకర్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. 9 పార్టీలు అవిశ్వాస తీర్మానాలిచ్చాయి. వాటిని అంగీకరించారు. ముందు ఇచ్చిన వారితో చర్చను ప్రారంభింపచేస్తామని స్పీకర్ తెలిపారు. అందువల్ల ఇది టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం కాదు. అందువల్లే మద్దతివ్వలేదనే వాదన కూడా కరెక్ట్ కాదు. దీన్ని బట్టి చూస్తే.. టీఆర్ఎస్ ఒంటరిగా ఎన్నికలకు పోతుందనడం కూడా కరెక్ట్ కాదు.

టీడీపీ సంప్రదాయక ఓటు బ్యాంక్ టీఆర్ఎస్‌ను భయపెడుతోందా..?

ఇక పొత్తులు నైతికమా.. అనైతికమా అన్న విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఎన్నికల్లో పొత్తులనేవి నైతిక అంశాలకు సంబంధించినవి కావు. రాజకీయ అవసరాలు, సందర్భాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుంటారు. సంకీర్ణ రాజకీయాల్లో పొత్తులు నైతికమా, అనైతికమా అనేది సాధ్యం కాదు. అయినా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటోందంటే… టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. తెలంగాణలో టీడీపీ ఇంత బలహీనపడినా… ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉండటం టీఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తోంది. 2014 తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు… టీడీపీని సీమాంధ్ర పార్టీగా ప్రచారం చేసినప్పుడు.. చంద్రబాబును ఆంధ్రపక్షపాతిగా చూపినప్పుడు కూడా.. తెంలగాణలో టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. అందువల్ల టీడీపీ ఎంత బలహీనపడ్డా.. ఆ పార్టీ ఓటింగ్ ఆ పార్టీకి ఉంటుంది. అది కాంగ్రెస్ కు కలసి వస్తుంది.

విపక్షాలన్నీ కలిస్తే టీఆర్ఎస్‌కు ముప్పేనా..?

టీడీపీని బలహీన పరిచినా, టీడీపీ, కాంగ్రెస్ కలవకుండా చేసినా.. తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లు టీఆర్ఎస్ కు ఓటు వేసే అవకాశం ఉంది. ఒక్కసారి టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే.. తెలంగాణలోని సీమాంధ్రుల ఓట్లు… కాంగ్రెస్ – టీడీపీ కూటమికి పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇస్తానంటున్న పార్టీ.. అదే ఇవ్వనంటున్న బీజేపీతో..టీఆర్ఎస్ రహస్య అవగాహనకు వచ్చింది. అందుకే సీమాంధ్రులు… టీఆర్ఎస్ కు ఓటు వేసే అవకాశం ఉండకపోవచ్చు. ఈ రాజకీయ సమీకరణాలు తమకు నష్టం కలిగిస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే విపక్షం ఏకమవడం కూడా .. టీఆర్ఎస్ కు ఆందోళనకరమే. సెంటిమెంట్ తీవ్రంగా ఉన్నా.. 2014లో టీఆర్ఎస్ బొటాబొటి మెజార్టీ వచ్చింది. విపక్షాలన్నీ ఏకమైతే పరిస్థితి ఎలా ఉంటుందో…యూపీలో చూస్తున్నాం. అత్యంత బలమైన బీజేపీ కూడా… ఓటమి బాటలో ఉంది. ఇక్కడ కూడా.. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, కోదండరాం పార్టీలు కూడా కలిస్తే.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవుతుంది. అదే జరిగితే తమకు నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.

కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుండా చేయలనేదే టీఆర్ఎస్ ఆలోచన..!

ఇటీవల టీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతలను ఆంధ్ర ఏజెంట్లని విమర్శించడం ప్రారంభించారు. ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ పై విమర్శలు చేయడానికి కూడా కారణమిదే. అదే విధంగా.. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఏకమవుతున్నాయి. ఈ సారి బీజేపీకి వ్యతిరేకంగా.. దళితులు, ముస్లింల ఓట్లు ఏకపక్షంగా విపక్ష పార్టీలకు పడే చాన్సులున్నాయి. విపక్షాలన్నీ ఏకమైతే.. ఆ ఓట్లన్నీ అటే పడతాయి. తెలంగాణలోనూ వీరి సంఖ్య గణనీయంగా ఉంది. అంటే మోడీని వ్యతిరేకించే సెక్షన్లు కూడా.. టీఆర్ఎస్ ను వ్యతిరేకించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే ఓ ప్రచారం ప్రారంభించింది. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే..మోడీ వేసినట్లేనన్న ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోకుండా.. పెట్టుకున్నా.. తీవ్రంగా ప్రశ్నించేలా.. టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు సిద్దం చేసుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com