గద్ద‌ర్ రంగంలోకి దిగ‌బోతున్నారా..?

ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్ తాజాగా ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇంత‌కాలం త‌న ఊపిరిగా శ్వాసించిన మావోయిస్టు పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంత‌కాలం త‌న పాట‌తో అణ‌గారిన వ‌ర్గాల్లో చైత‌న్యం నింపిన గ‌ద్ద‌ర్ ఇక‌పై రాజ‌కీయ పోరాటానికి దిగుతున్నార‌ని స‌మాచారం. ఇక‌పై గ‌ద్ద‌ర్ పోరాడే వేదిక మారుతుందిగానీ.. పోరాటం కాద‌న్న విష‌యాన్ని ఆయ‌నే స్ప‌ష్టం చేశారు. రాజకీయాలంటే అంత‌గా న‌మ్మ‌కం లేని గ‌ద్ద‌ర్ సుదీర్ఘ ప్ర‌జాపోరాటాల త‌రువాత ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌ను ఎంచుకోవ‌డం ఆయ‌న జీవితంలో కీల‌క మలుపుగా చెప్పుకోవాలి. 2014 ఎన్నిక‌ల్లోనే ఆయ‌న పార్లమెంటుకు పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. త‌న పాట‌తో తెలంగాణ స‌మాజాన్ని ఉద్య‌మంలో ఉరికేలా చేసిన గ‌ద్ద‌ర్ పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హించాల‌ని ప‌లువురు మేధావులు ఆయ‌న మీద ఒత్తిడి చేశారు. కానీ, ఆయ‌న మాత్రం ఈ సూచ‌న‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు.

గద్ద‌ర్ అస‌లు పేరు.. గుమ్మడి విఠల్ రావు. కానీ, లోక‌మొత్తం గ‌ద్ద‌ర్‌గానే సుప‌రిచితుడు. గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం నిజామాబాద్‌ జిల్లా ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. చిన్న‌ప్ప‌టి నుంచి 1969 మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో గ‌ద్ద‌ర్ చురుగ్గా పాల్గొన్నారు. జ‌నాన్ని చైత‌న్యం చేసేందుకు బుర్ర‌క‌థ‌ను మాధ్య‌మంగా ఎంచుకున్నారు. జ‌నాల్లోకి చొచ్చుకెళ్లారు. స్వ‌త‌హాగా క‌వి కావ‌డంతో జ‌న‌బాహుళ్యంలో విరివిగా వాడే ప‌దాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేసేవాడు. గ‌ద్ద‌ర్‌పాటంటే ప‌ల్లె జ‌నాలు ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. ఆయ‌న పాట‌ల కేసెట్లు, సీడీలు ల‌క్ష‌ల్లో అమ్ముడుపోయేవి.

మావోయిస్టు పార్టీకి అనుబంధంగా జ‌న‌నాట్య‌మండ‌లిపై ఎన్నో పాటలు పాడారు. ఇది స‌హించ‌లేని కొంద‌రు 1997లో ఆయ‌న‌పై గ్రీన్ టైగ‌ర్స్ పేరిట కొంద‌రు కాల్పులు జ‌రిపారు. విచిత్రమేంటంటే.. ఆ కేసులో నిందితులెవ‌ర‌న్న‌దీ.. ఇప్ప‌టికీ తెలియ‌లేదు. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే గ‌ద్ద‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేయించింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్య‌మం తీవ్ర‌త‌ర‌మైన నేప‌థ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఆయ‌న తెలంగాణ‌కే మ‌ద్ద‌తు ప‌లికారు. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో త‌న వంతుగా పోరాడారు. త‌న పాట‌తో ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించారు. సూటిగా చెప్పాలంటే.. ఉద్య‌మాన్ని గ‌ద్ద‌ర్ పాట‌కు ముందు, త‌రువాత అని కూడా చెప్ప‌వ‌చ్చంటే అతిశ‌యోక్తి కాదు. జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్ పొద్దు మీద పాట యువ‌త‌ను ఉద్య‌మంలో మ‌రింత ఉత్సాహంగా పాల్గొనేలా చేసింది.

త‌రువాత, తెలంగాణ క‌ల సాకార‌మైంది. ఆయ‌న్ను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయ‌మ‌ని చాలామంది మేధావులు సూచించినా.. అప్ప‌ట్లో ఆయ‌న ముందుకురాలేదు. ప్ర‌స్త‌త ప‌రిస్థితుల్లో ఆయ‌న పార్ల‌మెంటుకు పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం అధికార పార్టీకి ఎదురుదెబ్బే కానుంది. తాను కోరుకున్న తెలంగాణ ఇది కాద‌ని, అణ‌గారిన వ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా తాను రాజ‌కీయ వేదిక‌పైకి రాబోతున్న‌ట్లు గ‌ద్ద‌ర్ చెప్ప‌క‌నే చెప్పారు. ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్టు పాజిటివ్ సంకేతాలే వెలువ‌డుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.