ప్ర‌భుత్వ సంస్థ‌లంటే(తే)…..!!

ఎయిరిండియాకు పొద్దున్నే శ‌కునం బాగోలేదు. ఒకే రోజు మూడు చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి పాపం. ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఢీకొనే ప్ర‌మాదం తృటిలో త‌ప్ప‌డం అందులో మొద‌టిది. శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్‌ను విమానాల్లో ప్ర‌యాణించేలా నిషేధాన్ని ఎత్తేయాల్సి రావ‌డం రెండోది. తృణ‌మూల్ ఎంపీతో వివాదం కార‌ణంగా బ‌య‌లుదేరడం ఆల‌స్యమ‌వ‌డం మూడోదీ ఆఖ‌రుదీనూ. ఎవ‌రికీ ఎప్పుడూ త‌లొంచ‌ద్దని వేదాల కాలం నుంచి చెబుతూ వ‌స్తున్నారు. ఒక్క‌సారి వంచావో.. రెండోసారి.. మూడోసారీ వంచాల్సి వ‌స్తుంది. ఆపై అల‌వాటైపోతుంది. మ‌న ప్ర‌మేయం లేకుండానే ఒక‌రికి అణిగి మ‌ణిగి ఉండాల్సొస్తుంది. అవ‌స‌ర‌మున్న‌ప్పుడు ఒక‌లా లేన‌ప్పుడు మ‌రోలా ఉండ‌డం రాజ‌కీయ‌నాయ‌కుల‌కే సాధ్యం. ఎంపిక‌య్యేవ‌ర‌కూ ఓట‌రు దేవుళ్ళంటూ కాళ్ళ‌మీద కూడా ప‌డేందుకు సిద్ధ‌ప‌డే నేత‌లు ఎన్నిక‌ల్లో గెలుపు అనంత‌రం ఆ దేవుళ్ళ‌నే త‌న కాళ్ళ ద‌గ్గ‌ర‌కు తెచ్చుకుంటారు. ఎందుకంటే వారికిక ఓట‌ర్ల అవ‌స‌రం లేదు.

ఈ మూడు సంఘ‌ట‌న‌ల్లో ఒక‌టి ప్ర‌మాదం.. రెండోది బ‌లుపు… మూడోది అధికారం మ‌ద‌మ‌ని చెప్పాల్సిన అవ‌స‌రం వేరే అక్క‌ర‌లేదు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్ర‌యంలో ఒకే ర‌న్‌వేపైకి ఇండిగో..ఎయిరిండియా విమానాలొచ్చేశాయి. అదృష్ట‌వ‌శాత్తూ గ‌మ‌నించుకోవ‌డంతో పెనుప్ర‌మాద‌మే త‌ప్పింది. రెండు ఢీకొని ఉంటే జ‌రిగే ప్రాణ న‌ష్టం ఊహించ‌లేం.
అనంత‌రం, ఎయిరిండియా ఉద్యోగిని విమానంలో కొట్టిన ఘ‌ట‌న‌లో ర‌వీంద్ర జ‌డేజా లోక్ స‌భ‌లో అడ్డం తిరిగారు. త‌న‌పైనే హ‌త్యాయ‌త్నం చేసినట్లు మాట్లాడారు. నిన్న విమాన‌యాన శాఖ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తి రాజుపై ఇంచుమించుగా దౌర్జ‌న్యానికి దిగిన శివ‌సేన స‌భ్యులు తీరు చూసి, స‌భే నిశ్చేష్ట‌మైంది. ఎంతో ర‌భ‌స జ‌రిగినా వారిదే పైచేయి అయ్యింది త‌ప్ప ప్ర‌భుత్వం కిమ్మ‌న‌లేదు. అశోక్‌కే స‌ర్దిచెప్పారు మిన‌హా వారివైపు చూడ‌లేక‌పోయింది. ఈరోజు అంత గంద‌ర‌గోళం లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ర‌వీంద‌ర్ త‌న గైక్వాడిజాన్ని చూపారు. గైక్వాడ్ గిరి అనే కొత్త‌ప‌దం రౌడీయిజంలో పుట్టుకొచ్చేలా వ్య‌వ‌హ‌రించారు. నేను క్ష‌మాప‌ణ చెప్ప‌ను కాక చెప్ప‌న‌న్నారు. విమానాల్లో తిర‌గ‌కుండా పెట్టిన నిషేధాన్ని ఎత్తేయాల్సిందేన‌న్నారు. తీవ్ర చ‌ర్చోప‌చ‌ర్చ‌ల త‌ర‌వాత విమాన‌యాన శాఖ మంత్రే వెన‌క్కి త‌గ్గారు. ర‌వీంద్ర ముక్త‌స‌రిగా చెప్పిన సారీని స్వీక‌రించారు. గైక్వాడ్‌పై నిషేధాన్ని తొల‌గించాసంప్ర‌దాయానికి తెర‌దీశారు. స‌భ‌లో కొత్త గూండాగిరి స‌మాజంలోనే కాదు చ‌ట్ట‌స‌భ‌లో కూడా నెగ్గుతుంద‌ని ఈ సంఘ‌ట‌న నిరూపించింది. ఈ నిర్ణ‌యంతో త‌లొంచుకున్న ఎయిరిండియాకు అంత‌లోనే మ‌రో దెబ్బ‌.

తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ డోలా సేన్ డిమాండ్ కార‌ణంగా కోల్‌క‌తాలో ఎయిరిండియా విమానం బ‌య‌లుదేరడం 20 నిముషాలు ఆల‌స్య‌మైంది. ఆమె త‌ల్లికి అత్య‌వ‌స‌ర ద్వారం ప‌క్క‌నే సీటు కేటాయించాల‌ని కోర‌డం దీనికి కార‌ణ‌మైంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌క్రాల కుర్చీలో వ‌చ్చేవారికి ఆ సీటు కేటాయించ‌డం కుద‌ర‌ద‌ని సిబ్బంది తెల‌ప‌డంతో వివాదం మొద‌లైంది. ఎట్ట‌కేల‌కూ ఎయిరిండియా వాద‌నే నెగ్గిన‌ప్ప‌టికీ ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది త‌ప్ప‌లేదు. ప‌ట్టుద‌ల‌ల‌కు పోవ‌డం ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌కు హేతువ‌వుతోంది. అలో ల‌క్ష్మ‌ణా అంటూ రోదించే సామాన్యుడి అంశంలో కించిత్తైన చ‌లించని ప్ర‌భుత్వాలు.. ప్ర‌జా ప్ర‌తినిధుల ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి మెత్త‌బ‌డిపోతాయి. ఏమో భ‌విష్య‌త్తులో ఎవ‌రితో ఏ అవ‌స‌ర‌మొస్తుందో ఏమో! జాగ్ర‌త్త‌గా ఉంటే మేలు క‌దా అనే వైఖ‌రికి పార్టీల‌కు మేలు చేస్తుందేమో కానీ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేస్తుంది. దుష్ట సంప్ర‌దాయాల‌ను పెంచి పోషిస్తుంది. స‌మాజం మ‌రింత ప‌త‌న‌మైపోవ‌డానికి…. సారీ… అయిపోయింద‌న‌డానికి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ‌లు కావాలా!! పూర్తి మెజారిటీ ఉండి కూడా కేంద్రం శివ‌సేన ఎంపీకి లొంగిపోవ‌డం దేనికి సంకేత‌మో ఏలిన‌వారే సెల‌వివ్వాలి.

Subrahmanyam vs Kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.