నిబద్ధతకు అర్థం..సమర్థతకు నిలువుటద్దం..! కేటీఆర్‌కు సముచిత గౌరవం..!

తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావును కేసీఆర్ నియమించారు. ఆయన కుమారుడు కాబట్టి.. వారసత్వంగా ఈ పదవి అప్పగించారని.. చాలా మంది అనుకుంటారు కానీ.. కేటీఆర్ రాజకీయ పయనం చూసిన మొదటి నుంచి పరిశీలించిన వారికి… ఇది సరైన అభిప్రాయం కాదని అనుకుంటారు. ఎందుకంటే.. కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ… టీఆర్ఎస్‌లో కార్యకర్త స్థాయి నుంచే ఎదిగారు. అంచెలంచెలుగా… తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ ఎదిగారు కానీ.. ఒక్కసారిగా ఎగిరి వచ్చి.. వర్కింగ్ ప్రెసిడెంట్ కాలేదు.

ఉద్యమంలో సిపాయి… పార్టీలో కార్యకర్త..!

సొంత ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాలనుకుని.. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించాలనుకున్నప్పుడు.. కేటీఆర్…అమెరికా చదువులతో… భవిష్యత్ వెదుక్కంటున్న సగటు యువకుడే. అమెరికాలో లక్షల జీతం తీసుకుంటూ… అందరితో లైఫ్‌లో సక్సెస్ అయ్యావని ప్రశంసలు అందుకుంటున్న సాధారణ యువకుడే. కానీ తన తండ్రి తెలంగాణ కోసం.. సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం చూసి.. తండ్రి చేస్తున్న ఉద్యమంలో..అశ్రువులు ధారబోస్తున్న యువతను… చూసి స్ఫూర్తి పొందారు. అంత మంది తెలంగాణ యువత స్వరాష్ట్రం కోసం పోరాడుతూంటే.. కేసీఆర్ కుమారుడిగా తాను.. అమెరికా వ్యక్తిగత బాగు చూసుకోవడం మంచిది కాదనుకున్నారు. అందుకే…అప్పట్లోనే ఏడాదికి రూ. అరవై లక్షలకుపైగా వచ్చే జీతాన్ని వదులుకుని ఉద్యమంలోకి వచ్చారు. తండ్రితో పాటు నడుస్తున్న వేలాది మంది యువతలో ఒకరిగా.. ఉద్యమకారునిగా మారిపోయారు. లాఠీదెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లారు. అంతిమంగా కేసీఆర్ కుమారునిగా కన్నా.. తెలంగాణ ఉద్యమకారుని.. ప్రజల మనసులో చోటు సంపాదించారు.

రాజకీయ సమర్థతకు మారు పేరు కేటీఆర్..!

తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా.. కేటీఆర్ సమర్థతకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. రాజకీయంగా కేటీఆర్.. సిరిసిల్లలో మొదటి సారి రెండు వందల ఓట్ల తేడాతోనే గెలిచారు. కానీ.. నిన్నామొన్నటి ఎన్నికల్లో ఆయన మెజార్టీ.. 90వేలకు దగ్గరగా ఉంది. అంటే.. ప్రజలకు కేటీఆర్ ఎంత సేవ చేశారో అర్థం చేసుకోవచ్చు. పదేళ్లకు ముందు సిరిసిల్లకు ఉరిసిల్ల అనే పేరు ఉండేది. ఇప్పుడు.. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. చేనేతలకు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఇప్పుడు… ఆనందంగా బతుకుతోంది అంటే.. కేటీఆర్ సమర్థతే కారణం. రాజకీయంగా కేసీఆర్ అప్పగించిన పనులను.. ఎప్పటికప్పుడు సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు అప్పగించినా సక్సెస్ చేసి చూపించారు. సీమాంధ్రులు అత్యధికంగా ఉన్న గ్రేటర్ పరిధిలో… అసాధ్యం అనుకున్న విజయాలను అటు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ.. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సాధించి చూపించారు.

క్లాస్‌కి క్లాస్.. మాస్‌కి మాస్ కేటీఆర్..!

సూటుబూటు వేసుకుని.. అమెరికన్ యాక్సెంట్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడి పరిశ్రమలను తీసుకు రావడంతో.. కేటీఆర్ చూపించే “క్లాస్” ఎలా ఉంటుందో… ప్రజా రాజకీయంలో ప్రత్యర్థులకు ఎంత ఘాటుగా సమాధానం చెప్పాలనే విషయంలోనూ.. అంతే “మాస్”తనం చూపిస్తారు కేటీఆర్. కీలక శాఖల మంత్రిగా… గత ప్రభుత్వ హయాంలో.. ఎన్నో విజయాలు సాధించారు. ఐటీ మంత్రిగా పరిశ్రమలను ప్రొత్సహించారు. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో వికాసం తీసుకొచ్చారు. రెండు పరస్పరమైన భిన్న శాఖలను అత్యంత సమర్థంగా నిర్వహించారు. అందుకే.. అటు ప్రభుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ ఆయన నాయకత్వానికి అంతకంతకూ ఆదరణ పెరిగింది..!

కొత్త బాధ్యతలతో సవాళ్లు…!

కేటీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇది ఆయనకు వారసత్వంగా దక్కినది కాదు.. ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే వచ్చింది. ఈ పదవిలో చేధించాల్సిన సవాళ్లు.. కేటీఆర్‌కు చాలా ఎదురు కానున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు కాబట్టి… ఇక తెలంగాణ బాధ్యతలు ఆయనకే. ముందు ముందు వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు… ప్రభుత్వంలో ముఖ్య బాధ్యతలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి.. రెట్టించిన ఉత్సాహంతో… మరింతగా… తన ప్రతిభను, సామర్థ్యాన్ని తెలంగాణ సమజహితానికి ఉపయోగిచే అవకాశం వస్తోంది..! ఆల్ ది బెస్ట్ కేటీఆర్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.