రేవంత్ గొడ‌వ‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదే..!

గాంధీ భ‌వ‌న్ లో అడుగుపెడుతూనే కేసీఆర్ స‌ర్కారుపై బాంబు పేల్చాల‌నే వ్యూహంతోనే రేవంత్ రెడ్డి వచ్చారు. అనుకున్న‌ట్టుగానే పేల్చారు.. కానీ, అది పేలిందా లేదా, ఆ పేలుడు శ‌బ్ధ తీవ్రత ఏపాటిది అనేదే ఇప్పుడు చ‌ర్చించుకోవాల్సి వ‌స్తోంది. ఆ బాంబు ఏంట‌నేది తెలిసిందే. మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు ఎస్టీ కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రంతో ప్ర‌భుత్వోద్యోగం సంపాదించార‌నీ, ఆ లెక్క‌న కేటీఆర్ స‌తీమ‌ణి ఏ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారో చెప్పాల‌నీ, ఎస్టీల‌ను అవ‌మానించే విధంగా కేసీఆర్ కుటుంబం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు. ఈ అంశ‌మై తాను పోరాటం చేస్తాన‌నీ, వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కూడా స‌వాల్ చేశారు. అయితే, ఈ అంశాన్ని కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టుగా లేదు! దానిపై బాల్క సుమ‌న్ తో ఓ కామెంట్ చేయించి.. చేతులు దులిపేసుకున్నారు. కేసీఆర్ కుటుంబానికి కులం ఆపాదించడం అపరాధం అనే స్థాయిలో సుమన్ మాట్లాడేశారు.

అంతకుమించి అతిగా స్పందిస్తే అధికార పార్టీ ఇరుకున ప‌డే అవ‌కాశం ఉంది! దీన్ని కొనసాగిస్తే రేవంత్ కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని తెరాస భావిస్తుండొచ్చు. రేవంత్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తెరాస ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. స‌రే.. తెరాస వైపు నుంచి బ‌ల‌మైన ప్ర‌తిఘ‌ట‌న రాన‌ప్పుడు రేవంత్ ఆరోప‌ణ‌ల‌కు చాలా ప్రాధాన్య‌త ద‌క్కాలి క‌దా. తెరాసను అంత‌లా ఇరుకున పెట్టే బ‌ల‌మైన అంశాన్ని రేవంత్ రెడ్డి శోధించి సాధించి ప‌ట్టుకున్నారంటే, ఇది ఎందుకు అంత సంచ‌ల‌నం కావడం లేదు..? నిజానికి, ఇలాంటి అంశం ఇత‌ర రాష్ట్రాల్లో వెలుగు చూస్తే.. అధికార పార్టీపై మీడియా ర‌చ్చ‌ర‌చ్చ చేసేది. కానీ, తెలంగాణ‌లో రేవంత్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌ధాన మీడియా వర్గాలు కూడా పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు.

కాంగ్రెస్ పార్టీలో ఇత‌ర నేత‌లు కూడా రేవంత్ లేవ‌నెత్తిన ఈ పాయింట్ కు బ‌లంగా మ‌ద్ద‌తు తెలిపే విధంగా మాట్లాడుతున్న‌దీ లేదు. అలాగ‌ని, రేవంత్ రెడ్డి కూడా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. పాకాల హ‌రినాథ‌రావు వ్య‌వ‌హారాన్ని కోర్టుకు ఈడుస్తా అంటున్నారు. న్యాయ పోరాటం చేసి తీర‌తా అంటున్నారు. ఏదేమైనా, ప్ర‌స్తుతానికి కాంగ్రెస్ పార్టీ నేత‌లు దీన్ని ఓన్ చేసుకోక‌పోయినా.. మీడియా ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోయినా.. విష‌యం కోర్టు వ‌ర‌కూ వెళ్ల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. క‌నీసం ఇప్ప‌టికైనా కేసీఆర్ కుటుంబం నుంచి త‌మ వియ్యంకుడి వ్య‌వ‌హారంపై స‌రైన ప్ర‌తిస్పంద‌న లేక‌పోతే… రేవంత్ చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని ఒప్పుకున్న‌ట్టే అవుతుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.