మాఫియాకు ప్రాణబలి- ప్రజలపై పోలీసుహింస

కొద్దివారాల కిందట చిత్తూరు జిల్లా ఏర్పేడు దగ్గర ఇసుక మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి లారీ నడిపి ప్రాణాలు తీయడం సంచలనం కలిగించింది. మంత్రి లోకేశ్‌తో సహా దాన్ని సర్దుబాటు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. అప్పటికే మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తిరుగుబాటు జండా ఎగరేశారు గనక ఆయన అనుయాయులని చెప్పి బయిటకు పంపేశారు. తర్వాత కేసు ఏమైందో ఇంకా తెలియదు. తెలంగాణలోనూ ఇలాగే కొన్ని ప్రమాదాలు ఆత్మహత్యలపై అనుమానాలు బలంగా వున్నాయి. అయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గనక జరిగిపోతున్నది. ఇటీవల సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ల గ్రామంలోనూ ఇలాటి ఘటనే జరిగింది. వేగంగా పోయే క్రమంలో ఇసుక లారీ భూమన్న అనే స్కూటరిస్టును ఢికొని అతని మరణానికి కారణమైంది. దాంతో కోపగించిన అక్కడి ప్రజలు వాహనం దగ్ధం చేశారు.అలా చేయడం పొరబాటైనా పరిస్థితి తీవ్రతను గమనించేబదులు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వారిపైనా కోపం చూపించారు. ఆ వెంటనే పోలీసులు గ్రామాలలో ప్రవేశించి అనేకమందిని కొట్టి బలవంతంగా తీసుకుపోయారు. తమను కొట్టారు గనకనే ఇలా చేయవలసి వచ్చిందని ఎస్‌పి అధికారికంగా వివరణ ఇచ్చారు! అయితే వాస్తవానికి మాఫియాను మరెవరూ ప్రశ్నించకుండా చేయడానికే ఇంత అమానుషంగా హింసించారని స్థానికులు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అక్రమంగా ఇసుక దోచుకుంటున్న వారిని వదలిపెట్టి ప్రమాదంపై స్పందించిన ప్రజలను దళితులను అంతగా హింసించ వలసిన అవసరమేమిటి? వారు ఎంతో తీవ్రంగా కొట్టిన కారణంగానే జైలులో వుంచుకోవడానికి కూడా అధికారులు నిరాకరించారని మీడియా వార్తలు ఇచ్చింది. సిరిసిల్ల అంటే మంత్రి కెటిఆర్‌ నియోజకవర్గం. మరి అక్కడ ఇంతటి ఘోరకలి జరిగితే ఆయన స్పందించడం అవసరం కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.