ఆర్ఆర్ఆర్… రాజమౌళి కొత్త సినిమా గురించి అనౌన్స్ చేయగానే ఎవరి పేరు ముందు వస్తుంది… ఎన్టీఆర్‌దా? రామ్చరణ్దా? అంటూ ఆలోచించారు గానీ ఎన్టీఆర్ పేరు రామారావుగా మారిన సంగతి ఎవరూ గుర్తించలేదు. తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు… అన్నీ స్వర్గీయ నందమూరి తారక రామారావే. నటనలో, పోలికల్లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న యంగ్ టైగర్ పేరు కూడా నందమూరి తారక రామారావే. యంగ్ టైగర్ని చాలామంది ముద్దుగా తారక్ అంటుంటారు. కొందరు ఎన్టీఆర్ జూనియర్ అన్నారు. కొన్ని సినిమాల్లో ఎన్.టి. రామారావుగా పేరు పడింది. కానీ, ఫస్ట్ టైమ్ రాజమౌళి అతణ్ణి రామారావుగా పరిచయం చేశాడు. కొత్త సినిమా ప్రకటనలో! ఆర్ ఫర్ రాజమౌళి.. ఆర్ ఫర్ రామారావు… ఆర్ ఫర్ రామ్ చరణ్… ఆయనది రైమింగ్ కలసి వస్తుందనే ఆలోచన కావొచ్చు. ఏది ఏమైనా ఎన్టీఆర్ పేరు ‘రామారావు’గా మారింది.
పేరు మారిన మరో హీరో నారా రోహిత్. స్వర్గీయ ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తమ్ముడి కుమారుడే ఈ హీరో. వీళ్ళ ఇంటి పేరుకి పెద్ద చరిత్ర వుంది. చంద్రబాబుది 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం మరి! అటువంటి ఇంటి పేరుని ఈ హీరో పక్కన పెట్టాడు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ నిర్మాణంలో నారావారి అబ్బాయి పాలు పంచుకున్నాడు. సినిమాకి సమర్పకుడు ఆయనే. టైటిల్ కార్డ్స్‌లో పేరు ‘రోహిత్’గా మాత్రమే పడింది. ‘నారా’ కనిపించలేదు. ఇంటిపేరుని పక్కన పెట్టాలని ఎందుకు నిర్ణయించుకున్నారో?