వినాయ‌క్ ఊసు తీయ‌డం లేదేలా..?

వినాయ‌క్ – ఎన్టీఆర్‌ల అనుబంధం ప్ర‌త్యేకమైంది. ఎన్టీఆర్‌ని స్టార్ గా మ‌లిచింది… వినాయ‌క్ సినిమా ఆదితోనే. సాంబ బాగానే ఆడింది. అదుర్స్ అయితే ఎన్టీఆర్ కామెడీ టైమింగ్‌ని కొత్త కోణంలో చూపించింది. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రూ క‌ల‌సి ప‌నిచేయ‌లేదు. వినాయ‌క్ – ఎన్టీఆర్ టాపిక్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అదుర్స్ 2 ప్ర‌స్తావ‌న త‌ప్ప‌కుండా వ‌స్తుంది. అదిగో.. ఇదిగో అన‌డం త‌ప్ప‌.. ఈ సినిమాకి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు ప‌డ‌లేదు. కోన వెంక‌ట్ క‌థ రెడీ చేస్తే – త‌ప్ప‌కుండా అదుర్స్ 2 వ‌స్తుంద‌ని వినాయ‌క్ చెబుతున్నాడు. ఎన్టీఆర్ అయితే.. క‌నీసం ఆ మాట కూడా అన‌డం లేదు. అదుర్స్ 2 గురించి అడిగితే… మౌన‌మే స‌మాధానం.

ఎన్టీఆర్ దృష్టి కోణం పూర్తిగా మారిపోయిందిప్పుడు. స్టార్ ద‌ర్శ‌కులు, వాళ్ల ట్రాక్ రికార్డుల కంటే.. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ప‌ట్టం క‌డుతున్నాడు. పూర్తి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటే.. కాస్త వెన‌క‌డుగు వేస్తున్నాడు. అందుకే… వినాయ‌క్ ని దూరం పెట్టాడేమో అనిపిస్తోంది. వినాయ‌క్ సినిమాల‌న్నీ దాదాపుగా ఒకే మూస‌లో సాగుతుంటాయి. అందులోంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ప్ర‌య‌త్నించి, స‌ఫ‌ల‌మైన ఎన్టీఆర్ మ‌ళ్లీ పాత ప‌ద్ధ‌తిలోనే వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డడం లేదు. అందుకే వినాయ‌క్ లాంటి ఫక్తు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ల‌కు దూరంగా ఉంటున్నాడు. త‌మ అనుబంధాన్ని సినిమాల‌కు అతీతంగానే చూస్తున్నాడు. ఎన్టీఆర్ త‌ల‌చుకొంటే… వినాయ‌క్‌తో ఎప్పుడో సినిమా తీసేవాడు. వీరిద్ద‌రూ క‌ల‌వాలంటే అదుర్స్ 2 క‌థే అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ – వినాయ‌క్ కాంబినేష‌న్‌కు త‌గిన క‌థ రాయ‌డం కోన వెంక‌ట్ వాళ్ల‌కు న‌ల్లేరుపై న‌డ‌కే. కానీ.. ఇక్క‌డ స‌మ‌స్య క‌థ కాదు, కోన అంత‌కంటే కాదు. కేవ‌లం ఎన్టీఆర్ మైండ్‌లో వినాయ‌క్ లేక‌పోవ‌డ‌మే. వినాయ‌క్ మంచి హిట్లిచ్చాడు క‌దా, త‌న‌తో మ‌రో సినిమా చేసేద్దాం అని ఎన్టీఆర్ అనుకొంటే.. ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌డం ఎంత సేపు..?? కానీ ఎన్టీఆర్ ఆలోచ‌న‌లు వేరు. అందుకే… ఈ కాంబినేష‌న్ వార్త‌ల్లో వెలుగుతోంది త‌ప్ప‌… నిజం కావ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.