ప‌వ‌న్ కు ప్ర‌భుత్వం నుంచి స‌రైన స్పంద‌న లేద‌ట‌..!

వామ‌ప‌క్ష నేత‌ల‌తో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మావేశం నిర్వ‌హించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్ర‌త్యేక హోదాపై త్వ‌ర‌లోనే పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షా రాసిన లేఖ గురించి విలేక‌రులు ప్ర‌శ్నిస్తే… దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అది ఒక రాజ‌కీయ పార్టీ రాసిన లేఖ అనీ, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి లేఖ వ‌చ్చి ఉంటే తాను స్పందిస్తా అన్నారు.

ప్రత్యేక హోదా అంశమై ప్రభుత్వం ఏర్పడ్డ తొలి వంద‌రోజులూ తాము మాట్లాడ‌లేద‌నీ, అయితే త‌రువాత ఇదే అంశం అడిగితే.. మొద‌టి సంవ‌త్స‌రం బ‌డ్జెట్ రానివ్వండి, మాట్లాడ‌దాం అన్నార‌ని ప‌వ‌న్ చెప్పారు. అది గ‌డ‌చిన కొన్నాళ్ల‌కు మిగ‌తా పార్టీల‌తోపాటు జ‌న‌సేన కూడా హోదా డిమాండ్ చేయ‌డం ప్రారంభించింది అన్నారు. ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మే లేదూ, అదేమ‌న్నా దిగొచ్చిందా అని ఆ స‌మ‌యంలో టీడీపీ మాట్లాడింద‌న్నారు. వైకాపా నుంచి కూడా స‌రైన స్పంద‌న లేద‌న్నారు. తాను తిరుప‌తి స‌భ‌లో మాట్లాడితే.. రాత్రికి రాత్రే కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించింది అన్నారు. కాకినాడ స‌భ పెట్టిన‌ప్పుడు.. ప్యాకేజీ కింద ఎంత మొత్తం ఇస్తారో చెప్పార‌న్నారు. అనంత‌పురంలో మ‌ళ్లీ తాను మాట్లాడితే.. ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తామ‌ని అన్నారు. అయితే, ప్ర‌తీ సంద‌ర్భంలో తెలుగుదేశం పార్టీ అనుస‌రించిన రాజీ ధోర‌ణి ప్ర‌జ‌ల‌కు తీవ్ర న‌ష్టం క‌లిగించింద‌ని ఆరోపించారు. రాష్ట్రానికి నిధుల కొర‌త ఉన్న‌ప్పుడు పుష్క‌రాలు లాంటి కార్య‌క్ర‌మాల‌కు ఎక్కువ ఖ‌ర్చు చేసేశార‌న్నారు. అయితే, ఇలాంటివి ఏవైనా అడుగుదాం అనుకుంటే.. స‌రైన స‌మాధానంగానీ స్పంద‌న‌గానీ ప్ర‌భుత్వం నుంచి ఉండ‌ద‌ని పవన్ చెప్పారు.

ప‌వ‌న్ అడిగిన దానికి ప్ర‌భుత్వం నుంచి స‌రైన స్పంద‌న లేద‌ట‌..! ఇలా అన‌డం మ‌రీ విడ్డూరంగా ఉంది క‌దా! మొన్న‌టికి మొన్న‌… జె.ఎఫ్.సి.కి లెక్క‌లు కావాలంటూ కేంద్ర రాష్ట్రాల‌ను ప‌వ‌న్ కోరితే ఎవ‌రు స్పందించారు… టీడీపీ లెక్క‌లు ఇవ్వ‌లేదా..? ఉద్దానం స‌మస్య‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప‌వ‌న్ నివేదించ‌గానే ఏం జ‌రిగింది.. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించ‌లేదా..? ఇంకాస్త వెన‌క్కి వెళ్తే… రాజధాని భూసేక‌ర‌ణ విష‌యంలో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ప‌వ‌న్ ఆనాడు చెబితే, నోటిఫికేష‌న్ ను ప్ర‌భుత్వం ఆపిందా లేదా..? ఇవ‌న్నీ ప‌వ‌న్ మ‌ర‌చిపోయిన‌ట్టున్నారు. ఇక‌, ప్ర‌త్యేక హోదా అంశ‌మై ప్ర‌తీ ద‌శ‌లోనూ టీడీపీ రాజీప‌డింద‌ని కామెంట్ చేశారు. ఒక‌వేళ అదే ధోర‌ణిలో టీడీపీ ఉండి ఉంటే… భాజ‌పాతో కోరి వైరం కొని తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది..? రాజీ ప‌డ‌లేదు కాబ‌ట్టే… హోదాకు స‌మాన‌మైన ప్ర‌యోజ‌నాలు కేంద్రం ఇస్తామంటే ఒప్పుకున్నారు. ఇవ్వ‌లేదు కాబ‌ట్టే.. ఇప్పుడు పోరాటానికి దిగుతున్నారు. ఇక‌, ప్ర‌త్యేక హోదాపై జ‌న‌సేన పోరాటం విష‌యానికి వ‌స్తే… ఆయ‌న చెప్పిన‌ట్టుగా తిరుప‌తి, కాకినాడ‌, అనంత‌పురం.. ఇలా స‌భ‌లు పెట్టారు. ఒక స‌భ‌లో ప్ర‌క‌టించిన కార్యాచ‌ర‌ణ మ‌రుస‌టి స‌భ‌లో క‌నిపించ‌లేదు..! విశాఖ‌లో హోదా కోసం యువ‌త స్వ‌చ్ఛందంగా ఉద్య‌మిస్తుంటే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత‌, రామ‌కృష్ణా బీచ్ లో ఉద్య‌మానికి దిగుతా అని నాడు ప్ర‌క‌టించారు. కానీ, దిగ‌లేదే..? హోదా ఉద్య‌మాన్ని ఇన్నాళ్లు తాత్సారం చేయాల్సిన అవ‌స‌రం జ‌న‌సేన‌కు ఏముంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.