అడవిలో అమానుషం- టిసర్కార్‌కు మరో కళంకం..

కెసిఆర్‌ ప్రభుత్వం ఎస్‌సి బిసిల కోసం చాలా పథకాలు ప్రకటిస్తూ ప్రచారం చేసుకుంటున్నది. కాని అధికార యంత్రాంగం పోలీసులు కులదురహంకారులు వరుసగా అణగారిన వర్గాలపై దమనకాండ సాగిస్తున్న ఘటనలు బయిటకొస్తున్నాయి. నేరెళ్లలో ఇసుకలారీ ధగ్ధం చేశారంటూ దళితులతో సహా పలువురిపై పోలీసులు చిత్రహింస సాగించారు. గూడెం గ్రామంలో భూ పంపిణీలో పక్షపాతానికి నిరసనగా దళితులు ఎంఎల్‌ఎ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి ప్రయత్నించారు. యాదగిరి భువనగిరి జిల్లాలో వర్ణాంతర వివాహం చేసుకున్న నేరానికి యువకుడిని దారుణంగా హత్యచేస్తే పోలీసులు పట్టించుకోలేదు.బయిటపడిన తర్వాత కూడా పాలక పక్ష స్పందన లేదు.

తాజాగా ఇప్పుడు జయశంకర్‌ భూపాల పల్లి జిల్లాలో అడవిబిడ్డలైన గుత్తికోయలపై అటవీశాఖ సిబ్బంది అమానుష దౌర్జన్యానికి పాల్పడ్డం మీడియా వెల్లడించింది. చెట్లు పెంచాలనీ, అటవీ హారం కావాలని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. అయితే అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయంతో పొట్టపోసుకుంటున్న గిరిజనులపై సాయుధ భటులు విరుచుకుపడుతున్న ఘటనలు అనేకం తెలియవచ్చాయి. అయితే ప్రభుత్వం వాటిపై స్పందించింది లేదు. తాడ్వాయి అటవీ ప్రాంతంలో గుత్తికోయ మహిళలను చెట్లకు కట్టి చీరలు లాగి నిర్బంధానికి గురి చేసిన దారుణం అన్ని ప్రముఖ పత్రికలు ఫోటోలతో సహా ఇచ్చాయి. పైగా కక్ష గట్టి మరీ ఈ దాడికి దిగారని గిరిజనులు చెబుతున్నారు.35 కుటుంబాలకు చెందిన దాదాపు వందమందిని ఈ విధంగా బాధించడమే గాక వారి సామాను లారీలలో వేసి బలవంతంగా తరలించారు.రెండు గంటల పాటు సాగిన ఈ దౌర్జన్యంలో వారు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారట. తాము ఎన్నోసార్లు చెప్పినా వినకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని అటవీశాఖ అధికారి శిరీష సమర్థించుకోవడం ఇంకా దారుణంగా వుంది. గిరిజన సంఘాలు ప్రతిపక్షాలూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. నేరెళ్ల వంటి సందర్భాల్లో చాలా ఆలస్యంగా స్పందించిన టి సర్కారు ఈ సారైనా తక్షణం కదలికలోకి వస్తుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.