ప్రొ.నాగేశ్వర్: పాకిస్థాన్‌తో యుద్ధమా..? చర్చలా..?

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆయన చేసిన తొలి ప్రసంగంలోనే…కాశ్మీర్ పైనా..భారత్‌తో సంబంధాలపైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మాకు అతి ముఖ్యమైన అంశం కశ్మీర్ అంటాడు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటాడు. అదే సమయంలో ఇండియాతో సన్నిహిత సంబంధాలకు సిద్దమేనంటాడు. హిందూస్థాన్ ఒక అడుగు ముందుకు వేస్తే.. పాకిస్థాన్ రెండు అడుగులు ముందుకు వేస్తుందన్నారు.

ముందు ఇమ్రాన్‌ తన దేశం గురించి ఆలోచించాలి..!

భారతదేశంలో భాగంగా ఉన్న కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని వ్యాఖ్యానించే హక్కు.. పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తికి ఉన్నాయా..? . సైన్యం. జీహాదీస్టులు, హాఫీజ్ సయీద్ మద్దతుతో ప్రధాని అవుతున్న ఇమ్రాన్ ఖాన్.. ఇలా ఎలా మాట్లాడతారు..? . పాకిస్థాన్ ముందు తన దేశాన్ని సంస్కరించుకోవాలి. బెలూచిస్థాన్ లో నిర్బంధ కాండ జరుగుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. భారతదేశంపై వేలెత్తి చూపెట్టే ముందు…ఇమ్రాన్ ఖాన్.. ముందు తన దేశం గురించి ఆలోచించాలి. తన దేశంలో పరిస్థితుల్ని చక్క బెట్టాలి. పాకిస్థాన్ ప్రధానిగా.. ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి ప్రజలు ఎన్నుకున్నది.. భారత్ లో భాగంగా ఉన్న కాశ్మీర్ లో మానవ హక్కులను కాపాడమని కాదు. పాకిస్థాన్ ప్రజలకు తీవ్రవాద ముప్పును ఎలా తప్పించాలన్నది ఇమ్రాన్ ఖాన్ ముందుగా ఆలోచించాలి. ప్రతి రోజూ ఏదో ఓ చోట పేలుళ్లతో.. రావణకాష్టంలా మారిన పాకిస్థాన్ ను ఎలా కాపాడుకోవాలో ఆలోచించకోవాలి. అంతే కానీ భారతదేశానికి నీతులు చెప్పే అధికారమూ లేదు… అవకాశమూ లేదు.

కాశ్మీర్ గురించి మాట్లాడటానికి ఇమ్రాన్‌కి ఏం హక్కు ఉంది..?

కాశ్మీర్ భారదేశంలో అంతర్భాగం. కశ్మీర్ ప్రజల తరపున కానీ… పాకిస్థాన్ ప్రజల తరపున కానీ కశ్మీర్ గురించి మాట్లాడే అధికారం ఇమ్రాన్ ఖాన్ కు లేదు. బాధ్యతలు చేపట్టక ముందే.. ఇలా మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. ముందు ముందు భారత్ తో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనేది కీలకమైన ప్రశ్న. వాణిజ్యసంబంధాలు పెంపొందించుకుంటామన్న ప్రకటన చేశారు. దీనికి భారత్ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కొంత మంది పాకిస్థాన్ తో చర్చలేంటి..? పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది కదా అంటూంటారు. రాజకీయనాయకులు కూడా ఎన్నికలకు ముందు చర్చలు వద్దంటారు. ఎన్నికల తర్వాత చర్చలు కావాలి అంటారు. 2014 ఎన్నికలకు ముందు.. పాకిస్థాన్ తో చర్చలేమిటన్నవారు… ఆ తర్వాత అధికారంలోకి రాగానే.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను భారత ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి అహ్వానించారు. నిజంగానే పాకిస్థాన్ తీవ్రవాద దేశం, విఫల దేశం. కానీ ఆ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అవుతారో మనం నిర్ణయించలేం.

ముషారఫ్‌తోనే చర్చించారు కదా..! ఇమ్రాన్‌తో ఎందుకు చర్చించకూడదు..?

సైన్యం మద్దతుతో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ తో చర్చలేమిటి అని కొంత మంది అంటారు. అసలు సైన్యాధిపతి అయి.. పాకిస్థాన్ ను చేతుల్లోకి తీసుకున్న పర్వేజ్ ముషారఫ్ తో .. వాజ్ పేయి చర్చలు జరిపారు. కార్గిల్ దుర్మార్గానికి, కార్గిల్ చొరబాటుకు కారణమైన నాయకుడు..ముషారఫ్. భారతదేశంలో నిరంతర రక్తపాతాన్ని కోరుకంటున్నానని బహిరంగంగా చెప్పిన నాయకుడు, దుర్మార్గమైన వ్యక్తి ముషారఫ్. అలాంటి ముషారఫ్ తో కూడా వాజ్ పేయి చర్చలు జరిపారు. ఎవర్ని ప్రధానిగా ఎన్నిక చేసుకోవాలనేది అక్కడి ప్రజలే నిర్ణయించుకుంటారు. పాకిస్థాన్ పొరుగు దేశం కాబట్టి.. ఆ దేశంతో సత్సంబంధాలకు ప్రయత్నించాల్సిందే. పాకిస్థాన్ తో శాంతి కుదురుతుందా.. లేదా అన్నదాని సంగతి తర్వాత కానీ ముందుగా … శాంతి కోసం ప్రయత్నించాల్సిందే. భారత్ చర్చలు జరపకపోతే.. పాకిస్తాన్ ప్రపంచం అంతా.. శాంతి కోసం భారత్ ముందుకు రావడం లేదని ప్రచారం చేసుకుంటుంది. భారతదేశానిది యుద్ధోన్మాదం అని చాటుతుంది. ఈ అవకాశం పాకిస్థాన్ కు ఎందుకివ్వాలి..? చర్చలు జరపడం అంటే బలహీనపడటం కాదు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారనే విషయాన్ని పాకిస్థాన్ అంగీకరించదు. నిజాలు చెప్పినా పట్టించుకోదు.అందుకే ఈ అంశాలు వదిలేసి ఇతర అంశాలపై చర్చలు జరుపుకోవచ్చు.

చొరబాట్లకు తుపాకులతో… శాంతి కోసం చర్చలతో ప్రయత్నించాలి..!

భారత్ తో వాణిజ్యసంబంధాల వల్ల తాము లాభ పడుతున్నామని పాకిస్థాన్ ప్రజలు అనుకున్నప్పుడు.. పాక్ ప్రభుత్వ వైఖరిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్థాన్ ప్రజలకు భారత్ తో స్నేహం వల్ల ఉపయోగం అని అర్థమయ్యేలా చేయగలగాలి. అలా అయితేనే పాకిస్థాన్ ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుంది. అప్పటిదాకా మనం ఓపికగా చర్చలు జరపాల్సిందే. మన వాదన వినిపించాల్సిందే. చర్చలు జరుపుతున్న సమయంలో.. సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పరిస్తే.. తుపాకులతోనే సమాధానం చప్పాలి. అంటే.. ఏ విషయంలోనూ భారత్ వెనక్కి తగ్గకూడదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com