ఆంధ్ర ప‌త్రిక పున‌ర్ముద్ర‌ణ‌కు స‌న్నాహాలు

ఆంధ్ర ప‌త్రిక…. జాతీయోద్య‌మానికి ఊపిరులూదిన ప‌త్రిక‌.. భిన్న‌మైన శైలితో ఆనాటి పాఠ‌కుల‌ను స‌మ్మోహితుల్ని చేసిన ప‌త్రిక‌.. దేశ‌భ‌క్తిని అణువ‌ణువునా నింపిన ప‌త్రిక‌. తిరిగి వెలుగుచూడ‌బోతోంది. 1908లో కాశీనాధుని నాగేశ్వ‌ర‌రావు పంతులుగారి సార‌ధ్యంలో ప్రారంభ‌మైన ఆంధ్ర ప‌త్రిక‌ను కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు తిరిగి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నెలాఖ‌రులో పున‌ర్ముద్రించ‌బోతున్నారు. వివిధ కార‌ణాల వ‌ల్ల 1991లో మూత‌ప‌డిన ఆంధ్ర ప‌త్రిక తొలినాళ్ళ‌లో వార‌ప‌త్రిక‌గా ప్ర‌చురిత‌మైంది. మ‌ద్రాసు నుంచి ఈ ప‌త్రిక వెలువ‌డేది. 1969లో విజ‌య‌వాడ‌, ఢిల్లీలో దీని కార్యాల‌యాలు ప్రారంభ‌మ‌య్యాయి. అనంత‌రం హైద‌రాబాద్‌కూ విస్త‌రించింది. మా తెలుగు త‌ల్లికి మ‌ల్లెపూదండ అంటూ రాష్ట్ర గీతాన్ని ర‌చించిన శంక‌రంబాడి సుందరాచారి, పురిపుండ అప్ప‌ల‌స్వామి, వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి, చీరాల రామారావు, గోపరాజు, వెంక‌టానందం, త‌దిత‌రులు ఈ ప‌త్రిక‌లో విధులు నిర్వ‌ర్తించారు. హేమాహేమీలైన కాశీనాధుని నాగేశ్వ‌ర‌రావు, గాడిచ‌ర్ల హ‌రిసర్వోత్త‌మ‌రావు, సి. శేష‌గిరిరావు, శివ‌లెంక శంభు ప్ర‌సాద్ ఆంధ్ర ప‌త్రిక‌కు సంపాద‌క బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు. శివ‌లెంక రాధాకృష్ణ సంపాద‌కునిగా ఉన్న స‌మ‌యంలో ఇది మూత‌ప‌డింది. ఉద‌యం ప‌త్రిక అధినేత మాగుంట సుబ్బిరామిరెడ్డి ఆంధ్ర‌ప‌త్రిక‌ను కొనుగోలు చేసి, పున‌ర్ముద్రించ‌డానికి ప్ర‌య‌త్నించారు. 1995లో ఆయ‌న న‌క్స‌ల్స్ చేతిలో మ‌ర‌ణించ‌డంతో ఆ ప్ర‌య‌త్నం ఆగిపోయింది. ఆంధ్ర పత్రిక‌కు సంబంధించిన అన్ని ప్ర‌తుల‌నూ రాజ‌మండ్రిలోని గౌత‌మి లైబ్ర‌రీ డిజిట‌లైజ్ చేసి, భ‌ద్ర‌ప‌రిచింది.

కొన్నేళ్ళ క్రితం ఆంధ్ర‌ప‌త్రిక పేరిట ఓ వెబ్‌సైట్ కూడా వెలుగు చూసింది. తాజా ప్ర‌య‌త్నంతో వందేళ్ళ చ‌రిత్ర ఉన్న ఆంధ్ర ప‌త్రిక తిరిగి ముద్రణ‌కు రాబోతుండ‌డం సంతోష‌క‌ర‌మైన అంశం. అప్ప‌ట్లో అనేక వివాదాల‌తో పాటు మారుతున్న పాత్రికేయ ట్రెండ్‌ను త‌ట్టుకోలేక శ‌తాధిక ప‌త్రిక ఇబ్బందుల‌కు గురైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com